
Telangana Elections 2023 : తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించి అధికార పగ్గాలు చేపట్టేందుకు కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేనతో పొత్తుకు సై అంటోంది బీజేపీ. దీంతో పొత్తు రాజకీయంపై ఢిల్లీలో మంతనాలు నడిచాయి. హైకమాండ్ పిలుపు మేరకు కిషన్‌రెడ్డి, పవన్‌కల్యాణ్‌లు హస్తినలో అమిత్‌షాతో చర్చలు జరిపారు. సుమారు 40 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో అమిత్‌షా ఈ ఎన్నికల్లో కలిసి పని చేయాలని సూచించినట్టు సమాచారం. గురువారం రాత్రికి అమిత్ షా తెలంగాణకు వస్తున్నందున.. ఆ లోపు సీట్ల సర్దుబాటుపై ఓ అవగాహనకు రావాలని సూచించినట్టు తెలుస్తోంది. ఇందుకు కిషన్‌రెడ్డి, పవన్‌కల్యాణ్‌లు అంగీకరించినట్టుగా సమాచారం.
ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకూ తెలంగాణలో పోటీ చేయని జనసేన ఈసారి బరిలో దిగేందుకు ఎత్తుగడలు వేస్తోంది. ఎన్నికల రణరంగంలో నిలవాలని జనసైనికులు పట్టుపట్టడంతో అందుకు తగ్గట్టుగా అడుగులు వేస్తున్నారు పవన్‌కల్యాణ్. ఇందులో భాగంగానే.. ఉమ్మడి హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ, మెదక్ జిల్లాల్లో 33 సీట్లను డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అమిత్‌షాతో జరిగిన భేటీలో ఏపీ పాలిటిక్స్ గురించి కూడా చర్చించినట్టు సమాచారం. రాష్ట్రంలోని పరిస్థితులపై షాకు వివరించగా.. ఆంధ్రప్రదేశ్‌కు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటామని, రాష్ట్ర అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు ఖరారు కాగా.. జగన్‌ను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికకు సిద్ధమవుతున్నాయి ప్రతిపక్షాలు. ఈ మేరకు ఇరు పార్టీల ఐక్య కార్యాచరణపై ఫోకస్ పెట్టాయి. నవంబర్ 1న ఉమ్మడి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.
ఇప్పటికే మొదటి జాబితా ప్రకటించిన బీజేపీ రెండో లిస్టుపై కసరత్తులు చేస్తోంది. మరోవైపు ఈ నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ పెద్దలు త్వరలోనే తెలంగాణ ప్రచార పర్వంలోకి అడుగుపెట్టబోతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రెడీ అయ్యారు. దీని కోసం ఆయన గురువారం తెలంగాణకు రానున్నారు. శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్న అనంతరం సూర్యాపేటలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు.
52 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో పర్యటించనున్న తొలి కేంద్ర మంత్రిగా అమిత్ షా నిలవనున్నారు. అక్టోబరు 10న ఆదిలాబాద్‌లో జరిగిన బహిరంగ సభ ద్వారా బిజెపి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక గురువారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న అనంతరం పోలీస్ అకాడమీలోనే బస చేయనున్నారు. రేపు ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్ అనంతరం సూర్యాపేటలో నిర్వహించే జనగర్జన సభలో పాల్గొంటారు. దీని కోసం పోలీస్ అకాడమీ నుంచి బేగంపేటకు చేరుకొని.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సూర్యాపేటకు చేరుకోనున్నారు. సాయంత్రం సభ ముగిసి అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు అమిత్ షా. అయితే ఈ పర్యటనలో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ అవుతారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.