
Telangana Elections : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. ప్రచారంలో మరింత జోరును పెంచేందుకు రెడీ అయ్యింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు రాష్ట్రానికి రానున్నారు. అంతేకాదు.. ఒక్కరోజులోనే ఐదు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. రాజేంద్ర నగర్ సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.
రేపు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 11 గంటలకు పినపాకకు రాహుల్ చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పినపాకలో రోడ్ షో, కార్నర్ సమావేశం నిర్వహించనున్నారు. అక్కడి నుంచి నర్సంపేటకు చేరుకుని 3 గంటల వరకు ప్రచారం చేయనున్నారు. నర్సంపేట నుంచి రోడ్డు మార్గంలో వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి చేరుకుంటారు. వరంగల్ ఈస్ట్ లో సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర చేపట్టనున్నారు. వరంగల్ ఈస్ట్ నుంచి వెస్ట్‌లో కూడా ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 6:30 గంటలకు రోడ్డు మార్గంలో రాజేంద్రనగర్ చేరుకుని అక్కడ ప్రచార సభలో పాల్గొననున్నారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా ఢిల్లీ బయలుదేరుతారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించేందుకు 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే కాంగ్రెస్ సమర్పించింది. ఇందులో కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు రాష్ట్ర నాయకులకు కూడా చోటు దక్కించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ప్రచారంలో పాల్గొంటారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలకు అవకాశం కల్పించారు.