
Puvvada Ajay Affidavit : బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ సమర్పించిన అఫిడవిట్లో తప్పులు ఉన్నాయని.. ఆయన నామినేషన్‌ను తిరస్కరించాలని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కోరుతున్నారు. ఈ విషయంపై ఖమ్మం రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ ఆఫీస్‌కు తుమ్మల వెళ్లి.. పువ్వాడ అజయ్ సమర్పించిన నామినేషన్, ఎన్నికల సంఘం ఫార్మాట్ కు భిన్నంగా ఉందంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ ఆఫిడవిట్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ లో లేదని.. ఫార్మాట్ మార్చడంపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశానని తుమ్మల చెప్పారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఫార్మాట్‌లో కాకుండా పువ్వాడ అజయ్ మార్చి ఇచ్చారని ఆరోపించారు. దాంతోపాటు అఫిడవిట్ లో డిపెండెంట్ కాలమ్ మార్చారన్నారు. డిపెండెంట్ కాలమ్‌లో ఎవ్వరు లేకపోతే నిల్ అని రాయకుండా మార్చారని.. నాలుగు సెట్స్ నామినేషన్లు కూడా తప్పులుగా ఉన్నాయని ఆయన చెప్పారు.
ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ లో లేకపోతే నామినేషన్ రిజెక్ట్ చేయాలని రిటర్నింగ్ అధికారిని అడిగానని తెలిపారు. అయితే తన నిర్ణయమే ఫైనల్ అని రిటర్నింగ్ అధికారి చెప్పారన్నారు తుమ్మల. ఎన్నికల నిబంధనలు పాటించలేదని.. ఆర్ఓపై ఎన్నికల సంఘనికి ఫిర్యాదు చేస్తానని.. అవసరమైతే న్యాయస్థానంలో కూడా పోరాటం చేస్తానని తుమ్మల స్పష్టం చేశారు.