
Parameswar Reddy : గ్రేటర్ హైదరాబాద్ లోని ఉప్పల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పరమేశ్వరరెడ్డి బరిలోకి దిగారు. నియోజకవర్గంలో గల్లీగల్లీ తిరుగుతున్నారు. ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉప్పల్ లో గెలిచేది తానేనని స్పష్టం చేస్తున్నారు.
ఉప్పల్‌పై కేసీఆర్ సర్కార్ సవతి ప్రేమ చూపిస్తోందని పరమేశ్వరరెడ్డి మండిపడ్డారు. నియోజకవర్గంలో అభివృద్ధి ఏమీ జరగలేదన్నారు. కాంగ్రెస్ మీద ప్రజలకు నమ్మకం ఏర్పడిందని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని తెలిపారు. ప్రస్తుత ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.
నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లోనూ డ్రైనేజీ సమస్య ఉందని పరమేశ్వరరెడ్డి వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులు కబ్జాకు గురయ్యాయని తెలిపారు. ఎన్నికల సమయంలోనే మాత్రం జీవోలు తీసుకువస్తారని విమర్శించారు. బీఆర్ఎస్ కు ఉప్పల్ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తేల్చిచెప్పారు.
సంక్షేమ పథకాలు సామాన్యులకు అందలేదని పరమేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ను 6 గ్యారెంటీలే గెలిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని మండిపడ్డారు.అయినా సరే కాంగ్రెస్‌కే పట్టం కట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు.
.
.