
Telangana : ఎన్నికల టైం దగ్గర పడుతున్నకొద్దీ తెలంగాణ రాజకీయం మరింత హీటెక్కుతోంది. సవాళ్లు.. ప్రతి సవాళ్లతో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు సై అంటే సై అంటున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ కర్ణాటకలో కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేతలు కర్ణాటకను మోడల్‌గా చూపుతున్నారని.. అక్కడికి వెళ్లి రైతుల పరిస్థితి ఆరా తీద్దామా అని సవాల్ చేశారు. అక్కడి రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు కూడా అమలు చేయడం లేదన్నారు.
సీన్ కట్ చేస్తే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో కర్ణాటక రైతులు ర్యాలీ తీశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు. ఆ ర్యాలీని నారాయణఖేడ్ కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. నారాయణఖేడ్‌లో ర్యాలీ నిర్వహించింది నిజమే కానీ.. వాళ్లు ఎందుకు వచ్చారనే విషయాన్ని కర్ణాటక రైతులే బయటపెట్టారు. డబ్బులిస్తే ఆందోళన చేస్తున్నామన్నారు. రూ.300 ఇస్తామంటే బతుకుదెరువు కోసం వచ్చామన్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వం హామీలు అమలు చేస్తోందని చెప్పారు కర్ణాటక రైతులు. ఇదీ కర్ణాటక రైతుల ముసుగులో జరుగుతున్న ఆందోళనల వెనుక ఉన్న అసలు కథ.
అసలు, తెలంగాణ ఎన్నికల్లోకి కర్ణాటక రైతుల్ని ఎవరు తీసుకొచ్చారు? కాంగ్రెస్ దూకుడుకి అడ్డుకట్ట వేసే ప్రయత్నాల్లో భాగంగా కేసీఆర్ మొదలుకొని, ప్రతి నాయకుడు కర్ణాటకను ప్రస్తావిస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ హామీలు అమలు కావడం లేదన్నది వాళ్ల ఆరోపణ.
అంతకుముందు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల తూటాలు పేలాయి. కేటీఆర్ సవాల్ ను స్వీకరిస్తూ.. కాంగ్రెస్ నేతలు కూడా సవాల్ చేశారు. కాంగ్రెస్ నేతలు సవాల్ చేయడమే కాదు.. నేరుగా రంగంలోకి వెళ్లిపోయారు. ఉస్మానియా యూనివర్సిటీకి వంశీచందర్ రెడ్డి మరికొందరు నేతలు వెళ్లి కేటీఆర్ కోసం వెయిట్ చేశారు. కేటీఆర్ వస్తే.. కర్ణాటకకు తీసుకెళ్లి అక్కడి అభివృద్ధిని కళ్లకు కట్టినట్టు చూపిస్తామన్నారు. అయితే కేటీఆర్ రాకపోవడంతో కాంగ్రెస్ నేతలు కూడ అక్కడి వెనుదిరిగారు.
ఇదంతా చూస్తున్న ప్రజలు సవాళ్లు చేయడం ఎందుకు..? నిరూపించాలంటే పారిపోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అసలు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాతే కాంగ్రెస్ తెలంగాణలో బాగా పుంజుకుంది. ఆ రాష్ట్రంలో ఇచ్చిన మాదిరిగానే తెలంగాణలోనూ 6 గ్యాంరటీలను కాంగ్రెస్ ప్రకటించింది. హస్తంపార్టీ హామీలపై ప్రజల్లో పాజిటివ్ గా రెెస్పాన్స్ వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తువుతున్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీలో గుబులు మొదలైందంటున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు అమలు కావడంలేదని రాగాన్ని అందుకున్నారు.