
Australia Vs India Final 2023 : ఆస్ట్రేలియా ఇంతవరకు ఆడిన మ్యాచ్ ల్లో తడబడుతూ గెలుస్తుందని అంతా అనుకుంటున్నారు. అది నిజమే కావచ్చు. మొదట్లోనే రెండు మ్యాచ్ లు ఓడి, తర్వాత పుంజుకుని వరుసగా 8 మ్యాచ్ లు నెగ్గి ఫైనల్ వరకు వచ్చేసింది. అయినా సరే ఉపేక్షించకూడదని సీనియర్లు అంటున్నారు. ఎందుకంటే ఇది ఆస్ట్రేలియాకి 8వ ఫైనల్ .అంతేకాదు నాకౌట్ మ్యాచ్ ల్లో ఎలా ఆడాలో వారికి తెలిసినంతగా ఎవరికీ తెలీదు. అందుకే జర భద్రం బిడ్డో అని రోహిత్ శర్మకి చెబుతున్నారు.
ఇంతవరకు వన్డే వరల్డ్ కప్ 2023లో జరిగిన చాలా మ్యాచ్ లు.. ఒకరిద్దరి కారణంగా గెలిచినవి అనే చెప్పాలి. అందరూ అవుట్ అయిపోతుంటే ఎవరో ఒకరు నిలబడి మ్యాచ్ విన్నర్లుగా మారుతున్నారు. ఆసిస్ ని గెలుపు బాట పట్టిస్తున్నారు.
అందుకని ఏ ఒక్కరిని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇంతవరకు జరిగిన మ్యాచ్ లను ఒకసారి పరిశీలిస్తే, వారితో ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది.
మ్యాక్స్ వెల్ తో జాగర్త బిడ్డా…
వరల్డ్ కప్ లో ఆఫ్గాన్ తో జరిగిన లీగ్ మ్యాచ్ ఒక ఉదాహరణ. 18.3 ఓవర్లలో 91 పరుగులకి 7 వికెట్లు పడిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆస్ట్రేలియాను ఒంటిచేత్తో మ్యాక్స్ వెల్ విజయ తీరాలకు చేర్చాడు. ఇదెవరూ ఊహించలేనిది. వరల్డ్ కప్ చరిత్రలో 7 వ వికెట్టుకు 202 పరుగుల రికార్డ్ భాగస్వామ్యం నెలకొల్పి ఒంటిచేత్తో, కుంటికాలితో మరీ గెలిపించాడు. అందరికీ దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది.
పుష్ప-3తో భద్రం కొడకో…
పాకిస్తాన్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ 164 పరుగులు చేసి తగ్గేదేలే అన్నాడు. ఏ ముహూర్తాన పుష్ప సినిమా చూశాడో తెలీదు కానీ, మనోడికి బాగా ఎక్కేసింది. సెంచరీ చేయడం, ఒక్క ఎగురు ఎగరడం, తగ్గేదేలే అనడం…ఇదే వరస… ఇప్పుడు మనోడ్ని పుష్ప 1, పుష్ప 2 కాదు, పుష్ప 3 అని పిలవాలి…అందుకే పుష్ఫ 3తో భద్రం కొడకో అంటున్నారు.
బుడ్డోడితో భద్రం రా నాయనా..
ఆస్ట్రేలియా టీమ్ లో భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర కుమ్మేస్తున్నాడు. కొత్త పిచ్చోడు పొద్దెరగడని..తొలి వరల్డ్ కప్ ఆడుతూనే ఇప్పటికే మూడు సెంచరీలు చేశాడు. 578 పరుగులు చేశాడు. మొన్న సౌతాఫ్రికాతో జరిగిన సెమీస్ లో తక్కువ స్కోరుకే అయిపోయాడు. అందువల్ల ఫైనల్ లో మళ్లీ జూలు విదిల్చే అవకాశం ఉంది. బుడ్డోడిని ఒక కంట కనిపెట్టాలి నాయనా అని రోహిత్ కి హితబోధ చేస్తున్నారు.
మార్ష్ ని మరిచిపోవద్దు.. నాయనలారా..
బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఒకవైపు అడ్డంగా నిలబడి 132 బాల్స్ లో 177 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వరల్డ్ కప్ లో నిలకడగా రాణిస్తున్నాడు. మిడిల్ ఆర్డర్ లో వచ్చి ఇప్పటివరకు 426 పరుగులు చేశాడు.
జంపింగ్ జపాంగ్.. ఆడమ్ జంపా ని కాసుకో బిడ్డా
బౌలర్ల విషయానికి వస్తే వరల్డ్ కప్ లో 22 వికెట్లు తీసి నెంబర్ టూ గా ఉన్నాడు. మొదట్లో ప్రభావం చూపకపోయినా, ఇప్పుడు మళ్లీ ట్రాక్ ఎక్కేశాడు. జంపాని కొంచెం కాసుకో బిడ్డా అని రోహిత్ కి సూచిస్తున్నారు.
వీరే కాకుండా మిగిలిన వాళ్లు ప్రతిభావంతమైన ఆటగాళ్లే. ఎప్పుడెవరు ఎలా ఆడతారో తెలీదు. అందుకని ఆసిస్ ఆటగాళ్లతో చాలా జాగర్తగా ఉండాలి. వెరీ డేంజరస్ అని అందరూ చెబుతున్నారు.