
Dangerous Animals : ఈ ప్రపంచంలో భూమిపై మనుషులకు ఎక్కువగా ప్రమాదకరమైన పది జీవులు ఏమిటీ తెలుసా? అందరూ చెప్పేది ముందుగా పులి, ఏనుగు, సింహం అని. కానీ నిజానికి బీబీసి వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. టాప్ 10 జీవుల్లో అసలు పులి పేరే లేదు. అవును మనుషులను ఎక్కువగా చంపుతున్న జీవులలో పులి ముందువరుసలో లేదు.
టాప్ 10 ప్రమాదకర జీవులు
10. సింహం

అడవికి రాజుగా వర్ణించబడే ఈ క్రూరమైన జంతువు వలన ప్రతి ఏడాది 200 మంది మనుషులు చనిపోతున్నారు. సింహాలు క్రూరమైన జంతువులు అయినప్పటికీ అవి త్వరగా మనుషులతో కలిసి పోతాయని.. కేవలం ఉద్రేక సమయాల్లోనే మనుషులపై దాడి చేస్తాయని జంతువుల అధ్యయనంలో తేలింది.
9. హిప్పోపొటమస్ (నీటి ఏనుగు)

హిప్పోపొటమస్ అంటే తెలుగులో దీనిని మనం నీటి ఏనుగు అని పిలుస్తాం. భారీ ఆకారంలో ఉండే ఈ జీవి ఎక్కువ సమయం నీటిలోనే ఉంటుంది. కానీ ఈ జంతువు మహా కోపిష్టి. దీని దెబ్బకు సింహాలు, మొసళ్లు భయపడుతాయి. హిప్పోపొటమస్ వల్ల ప్రతి సంవత్సరం 500 మంది మనుషులు చనిపోతున్నారు.
8. ఏనుగు

ఏనుగు అంటూనే అందరికీ మనిషి నేస్తం అనే భావన కలుగుతుంది. కానీ గజరాజుకు మదమెక్కితే ఎలాంటి వినాశనం సృష్టిస్తిందో అందరికీ తెలుసు. అలా ఏనుగులు చేసే దాడిలో ప్రతి ఏడాది దాదాపు 600 మంది చనిపోతున్నారు.
7. క్రోకొడైల్ (మొసలి)

మొసళ్లు అనగానే ఒకరకమైన భయం కలుగుతుంది. నోరంతా పదునైన పళ్లతో ఉండే ఈ జీవి చాలా వేగంగా, బలంగా దాడి చేసి తన నోటితో గట్టిగా పట్టుకుంటుంది. ఆ దెబ్బకు వేటాడ బడ్డ జంతువు శరీర అంగమే ఊడి వచ్చేస్తుంది. అలా మొసలి చేసే దాడులలో ఏడాదికి 1000 మంది చనిపోతున్నారు.
6. తేలు

తేలు అంటేనే ఒక విషపు జీవి. పురుగుజాతికి చెందిన ఈ జీవి తోక విషంతో నిండి ఉంటుంది. ఈ భూమ్మీద దాదాపు 2600 రకాల తేళ్లు ఉన్నాయి. అందులో కేవలం 25 రకాల తేళ్లకు మాత్రమే తమ శరీరంలో మనిషిని చంపేంత విషం ఉంటుంది. తేలు కుట్టిన తరువాత విష ప్రభావంతో ప్రతి సంవత్సరం దాదాపు 3300 మనుషులు చనిపోతున్నారు.
5. అసాసిన్ బగ్ లేదా బెడ్ బగ్ ట్రయాటోమినే (Bedbug Triatominae)

పురుగు జాతికి చెందిన అసాసిన్ బగ్ ఎక్కువగా మధ్య, దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. ఈ పురుగు మనుషుల రక్తం పీలుస్తుంది. రక్తం పీల్చే క్రమంలో ఈ పురుగు తన నోటి నుంచి ఒక ద్రవాన్ని మనిషి శరీరంలోకి వదులుతుంది. ఈ ద్రవం వల్ల మనుషుల్లో చాగాస్ అనే వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి వల్ల ఏడాదికి 10000 మంది చనిపోతున్నారని ఒక అంచనా.
4. కుక్క

మీకు చదవడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజమే. కుక్కలు మనుషులతో ఫ్రెండ్లీగా ఉన్నా.. అప్పుడప్పుడూ ఇవి హింసాత్మకంగా మారినప్పుడు మనుషులపై కూడా దాడి చేస్తాయి. అలాంటి దాడులలో ప్రతి సంవత్సరం దాదాపు 59000 మంది చనిపోతున్నారు.
3. పాము

పాము అనగానే విషపు జంతువు అని అందరికీ తెలుసు. కానీ పాము జాతికి చెందిన జీవుల్లో కొన్ని మాత్రమే విషపూరితంగా ఉంటాయి. ఇందులో కోబ్రా(నాగు పాము), బ్లాక్ మాంబ అనేవి అతి ప్రమాదకరమైనవి. ఇలాంటి పాములు కాటు వేస్తే మనుషులు సరైన వైద్యం అందని స్థితిలో కొన్ని గంటలలోనే ప్రాణాలు కోల్పోతారు. అలా చనిపోతున్నవారి సంఖ్య ఏడాదికి 1,38,000 అని సమాచారం.
2. మనిషి

అవును మీరు చదివింది నిజమే. ఈ ప్రపంచంలో రెండో అతి ప్రమాదకర జీవి మనిషే. మానవుడు జంతువులలో తెలివైన వాడు. ఆ తెలివితో మహా అద్భుతాలు చేయగలడు.. అలాగే వక్రబుద్ధి ఉంటే ఎంతో మంది ప్రాణాలు కూడా తీయగలడు. అలా ప్రతి సంవత్సరం మనిషి వల్ల చనిపోతున్న వారి సంఖ్య దాదాపు 4 లక్షలు. ఈ మరణాలు కేవలం హత్యలతో మాత్రమే జరుగుతున్నవి. యుద్దాలు, ఉరి శిక్ష లాంటివి ఘటనలను లెక్కచేయలేదు.
1. దోమ

అందరికీ ఆశ్చర్యం కలిగే ఉంటుంది. కానీ ఇది కూడా నిజమే. దోమలు మనుషులను నేరుగా చంపక పోయినా.. ఇవి మనుషుల రక్తం తాగే సమయంలో శరీరాన్ని గట్టిగా కుడతాయి. అలా దోమ వలన మలేరియా, డెంగ్యు లాంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ఈ వ్యాధుల వల్ల ప్రతి ఏడాది 7,25,000 మంది చనిపోతున్నారు.