
Telangana Assembly Election schedule(Latest news in telangana) :
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ విషయంపై తెలంగాణ సర్కారుకు ముందే సమాచారం ఉందని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. సెప్టెంబర్ 15 -18 మధ్య ఎన్నికల షెడ్యూల్ విడుదల కావొచ్చని అధికారులకు సమాచారం అందింది. దీంతో ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది. ముందుగానే మద్యం ఆర్డర్లు పెట్టుకోవాలని లైసెన్స్ హోల్డర్లకు సూచించింది. నోటిఫికేషన్ విడుదలైతే మద్యం నిల్వలకు ఇబ్బంది రావొచ్చనని అధికారులు అంటున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికలు 2018 డిసెంబర్ 7న జరిగాయి. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఏడాది కూడా డిసెంబర్ లోనే ఎన్నికలు జరుగుతాయని భావించారు. అక్టోబర్ రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని అంచనా వేశారు. కానీ సెప్టెంబర్ మూడోవారంలోనే షెడ్యూల్ విడుదలవుతుందని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి.
ముందస్తు ఎన్నికలపై ప్రభుత్వానికి ముందే సమాచారం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే కేసీఆర్ ఆగస్టు 21 న 115 నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. మరో నాలుగు నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించలేదు. నోటిఫికేషన్ విడులయ్యేలోపు ఆ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
మరోవైపు ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ కూడా అలెర్ట్ అయ్యింది. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్ తొలివారంలో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అటు బీజేపీ మాత్రం ఎన్నికల రేస్ లో బాగా వెనుకబడింది. ఇంకా అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేసినట్లుగా కనిపించడంలేదు. అసలు 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు కాషాయ పార్టీకి అభ్యర్థులు ఉన్నారా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా పోటీ జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.