
Congress: ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో తెలంగాణ ఎమ్మెల్యేల అభ్యర్థల రెండో జాబితాపై తుది కసరత్తు జరిగింది. సోనియా, మల్లిఖార్జున ఖర్గే, రేవంత్ రెడ్డి, మాణిక్‌రావ్ ఠాక్రే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మురళీధరన్
ఏఐసిసి కార్యాలయంలో జాబితాపై చర్చించారు. రెండో జాబితాలో 16 నుంచి 20 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక దాదాపు కసరత్తు పూర్తి చేసిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ… విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించనుందని తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి నేతల చేరికల వల్లే అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
కాంగ్రెస్ తొలి జాబితాలో 55 మంది అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఒకసారి ప్రకటిస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే తాజా రాజకీయ పరిణాామాల నేపథ్యంలో విడతల వారీగా అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని అంటున్నారు. వామపక్షాలకు నాలుగు స్థానాలు కేటాయించారు. మిగిలిన 60 స్థానాల అభ్యర్థుల ఎవరనే ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు పలువురు కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పు కోనున్నారు. గురువారం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మోత్కుపల్లి నరసింహులు కలిశారు. అధిష్ఠాన పెద్దలతో మాట్లాడిన తర్వాతే చెప్తా అన్నారు మోత్కుపల్లి. మోత్కుపల్లిని వెంకట్ రెడ్డి ఏఐసీసీ ఆఫీసుకు తీసుకొచ్చారు.