
Gautama Buddha: బుద్ధుడు మగధ రాజధాని రాజగృహం లో ఉంటున్న రోజులవి. ఒకనాడు కొందరు బాటసారులు ఆయన దగ్గరకు వచ్చి… ‘భగవాన్! అంటురోగాల కారణంగా వైశాలి రాజ్యపరిస్థితి ఘోరంగా ఉంది’ అని సమాచారమిచ్చారు.
వెంటనే బుద్ధుడు తన వెంట 500 మంది భిక్షువులను తీసుకొని వైశాలికి వెళ్ళాడు. ఆ ప్రాంతమంతా తీవ్ర అనావృష్టితో విలవిలలాడుతోంది. చెరువులు ఎండిపోవటంతో వాటిలోని బురద నీటినే మనుషులూ, పశువులూ వాడుకుంటున్నారు. నీటి కొరతతో, ఆహారం కొరతతో ఎన్నో పశువులు మృతిచెందాయి. అంతటా దుర్గంధం వ్యాపించింది. అంటురోగాలతో వేలాది మంది మరణించారు.
బౌద్ధ సంఘం వైశాలిలో ప్రవేశించిన రోజున… అనుకోకుండా కుంభవృష్టి కురిసింది. వేల జంతు కళేబరాలు, మనుషుల శవాలు ఆ వరదకు కొట్టుకుపోయారు. జనం బయటికి అడుగుపెట్టటానికే జంకుతున్నారు. రాజు, రాజ పరివారం, అధికారులు తమ నివాసాలకే పరిమితమయ్యారు. నగరాన్ని శుభ్రం చేసేవారెవరూ లేరు.
కానీ.. బుద్ధుడు వచ్చాడని తెలిసి, కొందరు ధైర్యం చేసి బయటకు వచ్చారు. వారంతా వెంటరాగా, బుద్ధుడు సరాసరి రాజమందిరానికి చేరుకున్నాడు. రాజును ఉద్దేశించి… ‘మహారాజా! ఏమిటీ పని! ఎందుకీ భయం! ఇలాంటి సమయంలోనే మనం ధైర్యంగా ఉండాలి. మీ అవసరం సరిగ్గా ఇప్పుడే ప్రజలకు ఉంది. కనుక మీరంతా బయటికి వచ్చి జనానికి ధైర్యాన్ని ఇవ్వండి. ఔషధాలు, ఆహారాన్ని సమకూర్చండి. అంటురోగాల కన్నా అధైర్యమే ప్రమాదకరం’ అని కోరి నగర వీధుల్లోకి శిష్యులతో కలిసి బయలుదేరాడు.
అనంతరం బుద్ధుడు భిక్షు సంఘంతో వీధుల్లోకి వెళ్ళి.. నగరాన్ని మధ్యాహ్నానికల్లా శుభ్రం చేశారు. బౌద్ధ వైద్యుడు జీవకుడు తెచ్చిన ఔషధాలను ప్రజలకు అందించారు. సాయంత్రానికి ప్రజలకూ కాస్త ధైర్యం వచ్చింది.
ఆ రోజు సాయంత్రం వైశాలి నగరంలో బుద్ధుడు జన సమూహాన్ని ఉద్దేశించి కొన్ని బోధనలు చేశాడు. అవే ‘రత్న సూత్ర, మైత్రీ సూత్రాలు’ గా బౌద్ధ సాహిత్యంలో నిలిచిపోయాయి.