
Jawaharlal Nehru : పత్రికల్లో కన్పించే చిన్న చిన్న కార్టూన్లు, జోకులు జీవనపోరాటంతో సతమతమయ్యే సామాన్యులకు ఎంతో ఊరటనిస్తుంటాయి. అయితే.. నేడు ఆ వాతావరణం క్రమంగా కనుమరుగవుతోంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో, వారి అనుయాయుల్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ రోజురోజుకీ తగ్గిపోతోంది. ప్రజాస్వామ్య ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నఅంశాల్లో ఇదొకటి.
నేడు నేషనల్ ప్రెస్ డే సందర్భంగా.. ఈ నేపథ్యాన్ని గుర్తుచేసే ఓ పాత సంగతిని గుర్తుచేసుకుందాం. 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారతదేశానికి ఘోర పరాభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్టూనిష్టు ఆర్.కే.లక్ష్మణ్, నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై ఒక కొంటె కార్టూన్ వేసారు.నెహ్రూను చిన్నబుచ్చుతూ వేసిన కార్టూన్ అది. నెహ్రూ అభిమానులనుంచి ప్రతిఘటన ఎదురవుతుందని భావించిన లక్ష్మణ్‌కు ఊహించని విధంగా నెహ్రూ నుంచి ఓ ఉత్తరం వచ్చింది.
‘ఈరోజు పొద్దునే పేపర్లో మీ కార్టూన్ చూశాను సార్. నాకు భలే సంతోషం అనిపించింది. మనసారా నవ్వుకున్నాను కూడా. ఒక చిన్న రిక్వెస్ట్. ఆ కార్టూన్‌ని కొంచెం పెద్దదిగా గీసి పంపిస్తే ఫ్రేం కట్టించి దాచుకుంటాను.” అని రాశారు నెహ్రూ,కాసింత శ్లేషతో కూడిన హుందాతనం చూపిస్తూ.

అలాగే.. ఇందిరా పాలనా కాలంలో ప్రసిద్ధ కార్టూనిస్టు శంకర్ ఆధ్వర్యంలో శంకర్స్ వీక్లీ అనే పూర్తి నిడివి కార్టూన్ల పత్రిక వచ్చేది.దేశంలో ఎమర్జెన్సీ అమలవుతున్న రోజుల్లో పలు పత్రికలపై సెన్సార్‌షిప్ విధించారు. దీనికి నిరసనగా ఆయన.. ప్రభుత్వాన్ని విమర్శించకుండా తాను కార్టూన్ గీయలేనని చెబుతూ.. ఆ పత్రిక ప్రచురణనే నిలిపివేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అంజయ్యగారు కూడా పత్రికల వారితో ఎంతో స్నేహంగా ఉండేవారు. అప్పట్లో ఆయన సీఎంగా ఉన్న టైంలో ఓ హెలికాప్టర్ కొని దానికి యాదగిరి అని పేరు పెట్టారు.
ఒక ప్రముఖ పత్రిక అంజయ్య గారి కార్టూన్ వేసినప్పుడల్లా ఆయన వేలికి హెలికాప్టర్ కట్టి ప్రచురించేది. అయన కూడా అది చూసి ఆయన తెగ నవ్వుకునే వారు తప్ప చిన్నబుచ్చుకునే వారు కాదట.
ఈ రోజుల్లో, కార్టూన్లు, జోకులు కొండొకచో కొంచెం శృతి మించుతున్న మాటా నిజమే. కానీ అవి చదవగానే రాసిన వారెవరో ఎందుకోసం రాసారో సులభంగా తెలిసిపోతూనే వుంటుంది. ఎందుకంటే దేశం ఇప్పుడు రాజకీయ పార్టీల వారీగా, నాయకుల వారీగా, వారివారి అనుయాయులవారీగా విడిపోయి వుంది. ఈ విభజన వల్ల లాభపడేది పార్టీలే, దేశం కాదు.
ప్రతి విమర్శా, ప్రతి జోకూ రాజకీయ నాయకులను ఎద్దేవా చేయడానికి ఉద్దేశించినవని అనుకోకూడదు. నిజ జీవిత అనుభవాలనే కార్టూనిస్టులు జనం ముందు పెడతారు తప్ప అందులో వారికి వ్యక్తిగత రాగద్వేషాలేమీ ఉండవు. ఏ నాయకుడైనా దాన్ని చూసి మనసారా నవ్వుకోగలిగితే.. అది వారికే కాదు..మన ప్రజాస్వామ్యానికీ మంచిదే.