
KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎ పాల్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రజాశాంతి పార్టీలో చేరమని ఆహ్వానిస్తే.. మందకృష్టన రూ.25కోట్లు అడిగారని పాల్ అన్నారు. అదే పరేడ్ గ్రౌండ్‌లో సభ పెట్టడానికి బీజేపీ వద్ద రూ.72కోట్లు తీసుకున్నారని పాల్ ఆరోపించారు. ఒకప్పుడు మోదీని ఇష్టం వచ్చినట్లు తిట్టిన మందకృష్ట ఇప్పుడు దేవుడని పొగుడుతున్నారని, ఆయన మోదీకి అమ్ముడుపోయారని పాల్ చెప్పారు. మోదీ బీసీ కులానికి చెందినవారు కాదని.. ఆయన తన శిష్యుడని పాల్ వ్యాఖ్యానించారు.
ప్రజాశాంతి పార్టీకి ఇంతవరకూ ఎన్నికల గుర్తు కేటాయించలేదని.. త్వరలోనే ఈ విషయంలో హై కోర్టుకు వెళ్తామని కేఎ పాల్ అన్నారు. మూడు పార్టీలకు నవంబర్ 30న ఓటు వేయొద్దని, ఇంట్లోనే కూర్చోవాలని ప్రజలకు కేఎ పాల్ సూచన చేశారు.
చెన్నూరు, జుక్కల్, వేములవాడ, ఉప్పల్, యకత్పుర్ తో పాటు 13 సెగ్మెట్లలో తన అభ్యర్థులు ఉన్నారని పాల్ చెప్పారు. అయినా తమ పార్టీకి ఎన్నికల గుర్తు ఇవ్వకపోవడం అన్యాయమని ఆయన వాపోయారు.
దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. ప్రపంచంలోనే అత్యంత అవినీతి జరుగుతున్న దేశంగా ఇండియా మారిందని, దేశాన్ని రక్షించాలంటే కేఏ పాల్ మాత్రమే ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. కుటుంబ పాలన వద్దని, ప్రజలంతా కుటుంబ పాలనను తరిమేయాలని కోరారు.