KCR Poll Competition | కేసీఆర్‌కు భారీ నామినేషన్ల టెన్షన్.. రెండు చోట్ల బాధితుల సెగ!

KCR Poll Competition | కేసీఆర్‌కు భారీ నామినేషన్ల టెన్షన్.. రెండు చోట్ల బాధితుల సెగ!

Share this post with your friends

KCR Poll Competition | ఇక్కడ కాకపోతే ఇందూరులో గెలుస్తాను అన్నారట.. ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకుడు ఒకరు.. అవును ఇప్పుడు ఆయనకి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. గజ్వేల్‌ కాకపోతే కామారెడ్డి అంటూ పోటీ చేస్తుండగా.. ఆ కాక మామూలుగా తగలడం లేదు. రెండు చోట్ల నామినేషన్ల రూపంలో సెగపెట్టారు. గజ్వేల్‌, కామారెడ్డిలో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయన బాధితులు.. మాటిచ్చి మర్చిపోయారని గుర్తు చేస్తున్న వాళ్లు బరిలో నిలిచారు. చివరకు… ఇక్కడ గెలిస్తే అక్కడ.. అక్కడ గెలిస్తే ఇక్కడ.. ఎక్కడ కొనసాగుతారో తెలియక… చివరకు కేసీఆర్ తీరు రెంటికి చెడిన రేవడిలా మారుతుందేమోనని గులాబీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

కేసీఆర్‌కు మరో షాక్ తగిలింది. ఆయన పోటీ చేస్తున్న రెండు చోట్లా భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. సొంత జిల్లా.. సొంత నియోజకవర్గంలో పోలింగ్‌కి ముందే ఎదురుగాలి వీస్తోంది. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌, కామారెడ్డిలో భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. గజ్వేల్‌లో 44 మంది కేసీఆర్‌పై పోటీకి సై అన్నారు. మొత్తం 145 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. 70 మంది విత్‌​డ్రా చేసుకున్నారు. ఇక్కడి నుంచి భూ నిర్వాసితులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, చెరుకు రైతులు పెద్దసంఖ్యలో నామినేషన్లు వేశారు. నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ బీఆర్ఎస్​ లీడర్లు ఎంత ఒత్తిడి చేసినా ఫలించలేదు. 44 మంది బరిలో ఉండటం హాట్‌ టాపిక్‌గా మారింది. కామారెడ్డి సెగ్మెంట్‌లోనూ కేసీఆర్‌కి ఇదే తరహా సెగ తగులుతోంది. అక్కడ 58 నామినేషన్లు వేయగా.. 19 మంది విత్‌డ్రా చేసుకున్నారు. చివరకు 39 మంది బరిలో నిలిచారు. కేసీఆర్‌ పోటీ చేస్తున్న చోటే ఇలాంటి పరిస్థితి ఉండటం గులాబీ నేతలకు మింగుడు పడకుండా చేస్తోంది.

గజ్వేల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కాంగ్రెస్ నుంచి నర్సారెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బీఎస్పీ నుంచి జక్కని సంజయ్ కుమార్, ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటుగా హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధిలోని వట్టి నాగులపల్లి గ్రామంలో శంకర్ హిల్స్ అసోసియేషన్ మెంబర్స్ 45 మంది, అమరవీరుల కుటుంబ సభ్యులు 30 మందితో కలుపుకొని అత్యధికంగా 127 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 13 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 70 మంది నామినేషన్లు విత్ డ్రా చేసుకోవడంతో 44 మంది బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో అసంతృప్తి ఈ స్థాయిలో ఉండటం చర్చకు దారి తీస్తోంది. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌ తీరుపై జనంలో ఎంత ఆగ్రహం ఉందో అనే టాక్‌ నడుస్తోంది. బీఆర్ఎస్‌ నేతలు కూడా ఇదే అంచనా వేస్తూ ఆందోళన చెందుతున్నారు.

గజ్వేల్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్‌ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆయన కామారెడ్డిలోనూ పోటీ చేయడంతో జనం అనుమానం వ్యక్తం చేశారు. తమకిచ్చిన హామీలు విస్మరించి మరో నియోజకవర్గానికి పారిపోతున్నారని ఫైరయ్యారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేసీఆర్‌ని ఓడిస్తామనే నిర్ణయానికి వచ్చారు. గులాబీ అగ్రనేతల బుజ్జగింపులకీ లొంగేది లేదని తేల్చిచెప్పారు. డేంజర్‌ బెల్స్‌ మోగడం పసిగట్టిన కేసీఆర్‌ నేరుగా రంగంలోకి దిగి గజ్వేల్‌ నియోజకవర్గం ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. తాను కామారెడ్డిలో గెలిచినా గజ్వేల్‌లోనే కొనసాగుతానని .. ప్రజల మధ్యే ఉంటానని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఈటల రాజేందర్‌ కూడా రంగంలోకి దిగారు. కేసీఆర్‌ మాటలపై నమ్మకం లేని ఆయన బాధితులు ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్‌ ఉపసంహరించుకునేది లేదని క్లారిటీ ఇచ్చారు.

కామారెడ్డిలోనూ కేసీఆర్‌కి గట్టి పోటీ ఎదురవుతోంది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బరిలో ఉండటం గులాబీ బాస్‌కి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గజ్వేల్‌ ప్రజలతో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపైనా కామారెడ్డి వాసులు భగ్గుమంటున్నారు. పొలిటికల్‌ వ్యూహాల కోసం కేసీఆర్‌ తమను వాడుకుంటారా? అని ఆగ్రహిస్తున్నారు. గెలిస్తే రాజీనామా చేసేవాళ్లు తమకు ఎందుకంటున్నారు. ఈ తీరుని నిరసిస్తూ అనేక మంది నామినేషన్లు వేశారు. మాస్టార్‌ ప్లాన్‌కి వ్యతిరేకంగా, అభివృద్ధి జరగలేదనే కోపంతోనూ కొందరు పోటీలో నిలిచారు. మొత్తం 58 నామినేషన్లు దాఖలవగా బీఆర్ఎస్‌ నేతలు ఒత్తిడి చేసి 19 మందిని వెనక్కి తీసుకునేలా చేశారు. అయినప్పటికీ 39 మంది పోటీలో నిలిచారు.

సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు చోట్లా విజయం ఈజీ అని భావించిన గులాబీ నేతలకు ఈ పరిణామాలు షాక్‌ ఇస్తున్నాయి. ఎలక్షన్‌ షెడ్యూల్‌కు ముందే ఇటు గజ్వేల్‌.. అటు కామారెడ్డిలో ఏకగ్రీవ తీర్మానాలు అంటూ బీఆర్ఎస్‌ నేతలు నాటకాలకు తెరలేపారు. ఇప్పుడు రెండు చోట్లా ఎదురుగాలి వీస్తుండటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కంటే కేసీఆర్‌ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనూ గెలుపుకోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని వాపోతున్నారు. నోటికొచ్చిన హామీలు ఇచ్చి పట్టించుకోకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుందని బాహాటంగానే కామెంట్స్ చేస్తున్నారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Kaushik Reddy : హుజురాబాద్‌లో సంచలనంగా మారిన కౌశిక్ రెడ్డి ఆడియో కాల్.. అసలేం జరిగింది.?

Bigtv Digital

Telangana: తెలంగాణ రౌండప్.. ఫటాఫట్ అప్‌డేట్స్..

Bigtv Digital

Smart Phone Addiction : పిల్లలు ఫోన్ వదలడం లేదా? ఇలా చేయండి !

Bigtv Digital

Nagarjuna Sagar news: సాగర్ జలాల పంపిణీ.. డ్యామ్ పై హైటెన్షన్ వాతావరణం

Bigtv Digital

Munugode : “ఊరకుక్కలు, పిచ్చికుక్కలు”.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

Bigtv Digital

Tamilisai: దేశాధినేతలనైనా కలవొచ్చు కానీ.. కేసీఆర్‌ను కలవలేం.. గవర్నర్ గరంగరం..

Bigtv Digital

Leave a Comment