
MP Chhattisgarh Elections : మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 230 స్థానాలనకు ఎన్నికలు జరుగుతుండగా, ఛత్తీస్‌గఢ్‌లోని 70 స్థానాలకు రెండో విడత పోలింగ్ జరుగుతుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఈసీ అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో తొలివిడతలో కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో.. భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశలో 76.47 శాతం ఓటింగ్ నమోదైంది.రెండో విడతలో మరింత ఎక్కువగా నమోదయ్యేలా చర్యలు తీసుకున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ప్రజలు శివరాజ్ సింగ్ ప్రభుత్వానికి బుద్ది చెబుతారని తెలిపారు. శివరాజ్ సింగ్ లా ఎన్ని స్థానాలు గెలుస్తామో తాను చెప్పనని.. ఆ నెంబర్ ప్రజలే నిర్ణయిస్తారని కమల్ నాథ్ అన్నారు. పోలీసులు, ప్రభుత్వ వ్యవస్థలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. అయితే, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. కొత్త ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి ఉండదని అన్నారు.
మధ్యప్రదేశ్‌లో ఓటింగ్ కు ముందు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోని ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేయాలని, ఈ గొప్ప ప్రజాస్వామ్య పండుగకు మరింత అందాన్ని ఇస్తారని నమ్ముతున్నానని తెలిపారు.
మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో తుఫాన్ రాబోతుందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. రైతులు, మహిళలు, యువకులు కాంగ్రెస్ పై విశ్వాసం ఉంచి ఓటు వేయాలని సూచించారు.