
Nayanthara Birthday Special : 19 సంవత్సరాల వయసులో.. 2003 విడుదలైన మలయాళం చిత్రం మనస్సినక్కరేతో నయనతార వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైంది. మూవీ మంచి సక్సెస్ సాధించింది.. కానీ నయనతారా కి మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం రజినీకాంత్ తో 2005లో నటించిన చంద్రముఖి మూవీ. ఆ తర్వాత తమిళ్ ,తెలుగు, మలయాళం భాషల్లో అందరూ అగ్ర హీరోల సరసన హిట్ మూవీస్ లో నయనతార నటించింది.
డయానా మరియం కురియన్.. అదేనండి మన నయనతార నవంబర్ 18,1984 లో బెంగళూరులో జన్మించింది. కాలేజీ చదివే రోజుల నుంచి నయనతారకు మోడలింగ్ పై మక్కువ ఉండేది. అలా మోడలింగ్ లో ప్రతిభ కనబరుస్తున్న నయనతారా ని చూసిన మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ ఆమెకు మూవీలో ఛాన్స్ ఇచ్చారు. ఈరోజు నయనతార పుట్టినరోజు సందర్భంగా లేడీ సూపర్ స్టార్ సౌత్ టు నార్త్ జర్నీ మీకోసం..
2003లో సినీ కెరియర్ ప్రారంభించిన నయనతార కు జీవ తో కలిసి నటించిన ‘ఈ’..శిలంబరసన్ తో చేసిన ‘వల్లభ’ సినిమాలు కుర్రకారులో మాంచి క్రేజ్ తీసుకొచ్చాయి. ఆ తర్వాత అజిత్ తో కలిసి నటించిన బిల్లా మూవీ తో నయనతారకు మాంచి గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు వచ్చింది.
2006 లో వి.వి.వినాయక్ డైరెక్షన్ లో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన లక్ష్మి మూవీ తో నయనతార టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.అదే సంవత్సరం నాగార్జున తో బాస్ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు నయనతార మరింత చేరువయ్యింది. అలా క్రమంగా సినీ ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంటూ ముందుకు సాగిన నయనతార 2023లో బాలీవుడ్ లో అడుగు పెట్టింది.
ఆమె నటించిన తొలి హిందీ మూవీ జవాన్ బాక్స్ ఆఫీస్ వద్ద 1100 కోట్లకు పైగా బిజినెస్ చేయడం.. ఆమెకు బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది. అటు దక్షిణాదిలో.. ఇటు ఉత్తరాదిలో తన సత్తా చాటుతున్న నయనతార నిజంగా లేడీ సూపర్ స్టార్ అనే బిరుదుకి అర్హురాలు అని అభిమానులు భావిస్తున్నారు.ఈ మూవీలో నయనతార రొమాంటిక్ యాంగిల్ తో పాటు ఫుల్ స్వింగ్ యాక్షన్ మోడ్ లో ఇరగదీసింది. మొదట మూవీ తోనే బాక్స్ ఆఫీస్ వద్ద గ్రాండ్ రికార్డ్ నెలకొల్పడం తో బాలీవుడ్ లో నయనతార లక్కీ స్టార్ అయిపోతుందేమో చూడాలి.
మామూలుగానే సౌత్ లో భారీ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన నయనతార బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడంతో తన రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసింది. ప్రస్తుతం నయనతార ఒక్కో మూవీకి సుమారు 12 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీ టాక్. నవరసభరితమైన నటనకు కేరాఫ్ అడ్రస్ గా మారిన లేడీ సూపర్ స్టార్.. నయనతార కు బిగ్ టీవీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.