
Qatar Death Sentence : గూఢచర్యం కేసులో ఖతార్ జైలులో ఉన్న 8 మంది భారత నేవీ మాజీ అధికారులకు మరణ శిక్ష విధిస్తూ గురువారం ఆ దేశ కోర్టు తీర్పు వెలువరించింది. గూఢచర్యం కేసులో వారిని ఖతార్ అధికారులు గతేడాది ఆగస్టులో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అయితే, వీరిపై మోపిన అభియోగాలపై ఖతార్ అధికారులు స్పష్టత ఇవ్వలేదు.
ఈ వార్త తెలిసిన వెంటనే భారత ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ కేసుకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని, అన్ని రకాల న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తామని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
‘కోర్టు తీర్పుతో షాక్‌కు గురయ్యాం. నేవీ మాజీ ఉద్యోగుల కుటుంబ సభ్యులతో మా లీగల్ టీం మాట్లాడింది. వారిని విడుదల చేయడానికి ఉన్న దారులను అన్వేషిస్తాం. అన్ని దౌత్యపరమైన, న్యాయపరమైన సహకారాలను కొనసాగిస్తాం. ఈ తీర్పును ఖతార్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లుతాం. ఈ కేసు రహస్య స్వభావం రీత్యా మరింత సమాచారాన్ని వెల్లడించలేము’ అని విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది.
ప్రైవేట్ సంస్థ దోహా గ్లోబల్ టెక్నాలజీస్, కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేస్తున్న వీరిపై ఇజ్రాయెల్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు నమోదయ్యాయని సమాచారం. ఖతార్ అధికారులు వీరిని గత ఏడాది ఆగస్టులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వీరికి మరణశిక్ష విధిస్తూ ‘కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ఆఫ్ ఖతార్’ తీర్పునిచ్చింది.
తమ వాళ్లను ఖతార్ ప్రభుత్వం నిర్బంధించటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరు ప్రధాని మోదీకి గత ఏడాది లేఖ కూడా రాశారు. ఈ కేసులో తమ సోదరుడిని విడిపించేందుకు భారత ప్రభుత్వం సాయం చేయాలంటూ ఓ యువతి ప్రధాని మోదీని వేడుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను ట్యాగ్ చేస్తూ, ‘దేశ గౌరవాన్ని పెంచిన నేవీ మాజీ అధికారుల్ని తిరిగి భారత్‌కు రప్పించాలి. ప్రధాని మోదీని చేతులు జోడించి వేడుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు.
దౌత్యపరమైన యాక్సెస్ అందిన తర్వాత భారత అంబాసిడర్ అయిన అధికారి శిక్ష పడిన ఈ భారతీయులను గత అక్టోబర్ 1వ తేదీన కలిశారు.
Anil: షర్మిల ఇలా.. అనిల్ అలా.. వారికే క్లారిటీ లేదా?