
RCB vs RR : చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు గెలిచింది. చివరి వరకు విజయం కోసం పోరాడిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరు ఇచ్చిన 189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన రాజస్తాన్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జోస్ బట్లర్ రూపంలో ఒక పరుగుకే ఫస్ట్ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, ఆ ఆనందం ఎంతోసేపు నిలువలేదు. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 2 సిక్సులు, 5 ఫోర్లతో 37 బంతుల్లో 47 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో దేవదత్ పడిక్కల్ కూడా ధాటిగా ఆడాడు. ఒక సిక్స్, 7 ఫోర్లతో 34 బంతుల్లోనే 52 పరుగులు చేసి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కెప్టెన్ సంజూ శాంసన్ ఉన్నంత సేపు బాగానే ఆడినా.. ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఇక ఆ తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్ ఎవరూ బెంగళూరు బౌలర్లను ఎదుర్కోలేకపోయారు.
కాని, ధ్రువ్ జురేల్, రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్‌పై ఆశలు రేపారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా బౌండరీలతో బెంగళూరు బౌలర్లను భయపెట్టారు. మ్యాచ్ చివరి ఓవర్ వరకు వచ్చిందంటే కారణం.. ధ్రువ్ జురేల్, రవిచంద్రన్ అశ్వినే. ధ్రువ్ 2 సిక్సులు, 2 ఫోర్లతో 16 బంతుల్లో 34 పరుగులు చేశాడు. అశ్విన్ 6 బాల్స్‌లో 12 పరుగులు చేశాడు. కాకపోతే, ఆఖరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉండడం, తీవ్ర ఒత్తిడిలో ఉన్న కారణంగా లక్ష్యాన్ని చేరలేక 7 పరుగుల తేడాతో ఓడిపోయారు.
బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు, మహ్మద్ సిరాజ్, డేవిడ్ విల్లే చెరో వికెట్లు తీశారు.
అంతకు ముందు బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఆటగాళ్లు చితక్కొట్టారు. కాకపోతే, సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ తొలి బంతికే డకౌటయ్యాడు. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ 39 బంతుల్లో 62 పరుగులు చేశాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ సైతం రెచ్చిపోయాడు. 44 బాల్స్‌లో 77 రన్స్ కొట్టాడు. ఒక దశలో బెంగళూరు జట్టు 200 ప్లస్ స్కోర్ ఈజీగా దాటేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ వీరిద్దరూ ఔటయ్యాక వికెట్లు టపటప పడిపోయాయి. 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసి పటిష్టంగా కనిపించిన ఆర్సీబీ.. ఆ తర్వాత పేకమేడలా కూలిపోయింది.
దినేశ్ కార్తిక్ 16 పరుగులు, మహిపాల్ లోమ్రోర్ 8, హసరంగ 6 పరుగులు చేసి ఔట్ అయ్యారు. దీంతో ఆర్సీబీ 189 పరుగులకే పరిమితమైంది. రాజస్తాన్ బౌలర్లలో బౌల్ట్, సందీప్ చెరో రెండు వికెట్లు తీయగా, చాహల్,అశ్విన్ చెరో వికెట్ తీశారు.