
Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ సరఫరా జరుగుతోందని నిరూపిస్తే కామారెడ్డి, కొడంగల్ ఎన్నికల నామినేషన్ ఉపసంహరించుకుంటానని సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కామారెడ్డి లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.
రేవంత్ రెడ్డి కార్యక్రమంలో మాట్లాడుతూ.. ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇదని పేర్కొన్నారు. 6 నెలలుగా 24 గంటపాటు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే ఈ రోజు 3 గంటల లోపు నామినేషన్ ఉపసంహరించుకుంటానని రేవంత్ ఓపెన్ చాలెంజ్ చేశారు. నిరూపించే దమ్ము మీకు ఉందా కేసీఆర్? అంటూ సవాల్ విసిరారు. ఎన్నికల తర్వాత మందేసి దేవదాసులా మీ ఫామ్ హౌస్‌లో చెట్ల చుట్టూ తిరగాలని రేవంత్ ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్య పెట్టి, డబ్బులు, మద్యంతో కేసీఆర్ గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎన్నికలో గెలవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఉచిత కరెంట్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీదేనని, రాష్ట్రంలో గత ఆరు నెలలుగా ఉచిత కరెంట్ ఇస్తున్నట్టుగా నిబద్ధత ఉంటే చర్చకు కేసీఆర్ రావాలి.. కామారెడ్డి చౌరస్తాకు రావాలి అంటూ సవాల్ చేశారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్, కామారెడ్డి ఎక్కడికైనా వస్తా.. నీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని తీసుకుని కామారెడ్డి అమరవీరుల స్తూపం వద్దకు రా.. 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్టు నిరూపిస్తే కామారెడ్డి, కొడంగల్‌లో నామినేషన్ ఉపసంహరించుకుంటా.. నా సవాల్‌కు కేసీఆర్ సిద్ధం కావాలి.. మధ్యాహ్నం 3 గంటల దాకా సమయం ఇస్తున్నానని సవాల్ చేసారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ బంద్ అవడం కాదు.. మీ ఒంట్లో, మీ ఇంట్లో కరెంట్ తీసేస్తామని, అప్పుడు మందేసి చెట్ల గజ్వేల్ ఫార్మ్ హౌస్‌లోనే ఉండిపోవాలన్నారు.
కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు.. కరువు వస్తుంది.. కర్ఫ్యూ వస్తుందని చెప్తున్న జాతకాలు ఏమైనా చూస్తున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎక్కడికెళ్లినా 24 గంటల కరెంట్ గురించి మాట్లాడరు.. నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి మాట్లారు.. మిషన్ కాకతీయ మీద మాట్లాడితే కమీషన్ల గురించి ప్రస్తావన వస్తోందేమో అని భయపడతారని, కాళేశ్వరం గొప్పలు చెప్పడం లేదని, సుందిళ్ళ, కుంగిన మేడిగడ్డ గురించి ప్రశ్నిస్తారని భయపడుతున్నారన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల ఊసెత్తడం లేదన్నారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అమలు చేయనివాళ్ళు ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేస్తారా అని అడుగుతున్నారని, కర్ణాటకలో కాంగ్రెస్ ఓడితే బీజేపీని గెలిపించాలి అనుకున్నవా కేసీఆర్ అని సూటిగా ప్రశ్నించారు.
కేసీఆర్ పాపాల భైరవుడని విమర్శించారు. బీఆర్ఎస్ కోసం బీజేపీ, ఎంఐఎం పనిచేస్తున్నాయన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఏం చేసిందో చెపుదాం మరి 2014 నుంచి 2023 వరకు నువ్వేం చేశావో చెప్పేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. నాడు రబ్బరు చెప్పులతో తిరిగే హరీష్ రావు విమానాల్లో తిరుగుతున్నారని, బంతిపూలతో బతుకమ్మ పేర్చుకుని తిరిగే కవితమ్మ నేడు బెంజ్ కార్లలో తిరుగుతూ ప్లాస్టిక్ పూల బతుకమ్మలు తెచ్చిందని, అమెరికాలో బాత్ రూంలు కడిగే కేటీఆర్ నేడు విమానాలలో తిరుగుతున్నారన్నారు.
2014 కు ముందు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు, నేటి అఫిడవిట్ ఆస్తులపై, నాడు చెప్పులు లేకుండా తిరిగిన కేసీఆర్‌కు నేడు ప్రత్యేక విమానాలు, టీవి, పత్రికలు ఎలా వచ్చాయో నాడు నేడుపై చర్చకు సిద్ధమా కేసీఆర్ అని ప్రశ్నించారు. పిసిసి చీఫ్ హోదాలో రాష్ట్రమంతా తిరిగే బాధ్యత నాపై ఉందని, ఏమాత్రం సమయం దొరికినా కామారెడ్డి వస్తానని, ప్రతి ఒక్క కార్యకర్త ఒక రేవంత్ రెడ్డి కావాలని ప్రతి ఇంటిని తట్టి కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తును మలుపు తిప్పబోతుందన్నారు.
10 సంవత్సరాలు కష్టాలు పడ్డామని.. కేసీఆర్‌కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే సమయం ఆసన్నమైందన్నారు. కామారెడ్డి ఎన్నికలు తీర్పు భారత్ దేశ చరిత్రలో గొప్ప తీర్పుగా మారాలని రేవంత్ అన్నారు. 150 కోట్ల మంది కామారెడ్డి వైపు చూస్తున్నారన్నారు.
.
.
.