
Meet the Press : నిజాం నిరంకుశ పాలనను గతంలో ప్రజలు ఎదిరించి తరిమికొట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పోషించిన కీలక పాత్ర గురించి వివరించారు. రాష్ట్ర ప్రజలు ఏనాడు తమ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టలేదని తెలిపారు. రాష్ట్రంలో పోరాటాలకు మూలం భూమి అని.. నిజాంల హయాం నుంచి జరిగిన పోరాటాలు భూమి కోసమేనని గుర్తుచేశారు. నిజాంల కాలంలో ఆకలిని భరించారే తప్ప.. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదని, అందుకే నాడు సాయుధ తెలంగాణ పోరాటం జరిగిందన్నారు రేవంత్ రెడ్డి.
సమైక్యపాలనలో తెలంగాణ ప్రజలపై ఆధిపత్యం కొనసాగితే.. కేసీఆర్ కుటుంబ పెత్తనాన్ని మరో తొమ్మిదేళ్లు ప్రజలు భరించారన్నారు. ఎంతోమంది పోరాడి తమ ప్రాణాలను త్యాగం చేస్తే వచ్చిన తెలంగాణకు.. విద్య, వైద్య రంగాల్లో అన్యాయం జరిగిందన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను సోనియాగాంధీ నెరవేర్చారని గుర్తుచేశారు. ఇప్పుడు 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రజా దర్బార్ లు నిర్వహించిందని తెలిపారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం జరగలేదని విమర్శించారు. ఇప్పుడు మరోసారి తెలంగాణ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్న ఆయన.. ఇప్పుడు జరుగబోయే ఎన్నికలే చివరిదశ ఉద్యమం కావాలన్నారు.
బీఆర్ఎస్ 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెబుతూ.. ఆర్భాటపు ప్రచారం చేస్తుందని, ధరణి పేరుతో పెద్ద భూ దోపిడీ జరిగిందని, లక్షల కోట్ల రూపాయల విలువైన భూముల్ని దోచుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇందులో కేసీఆర్ కుటుంబమే 10 వేల ఎకరాలను ఆక్రమించుకుందని, మూడు జిల్లాల్లో లక్షన్నర ఎకరాలను కేసీఆర్ ప్రభుత్వం ఆక్రమించుకుందన్నారు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణిని తీసేస్తామంటే కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉచిత కరెంట్ పేటెంట్ పూర్తిగా కాంగ్రెస్ దే నని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బడ్జెట్ ఉంటే ఎలాంటి సంక్షేమ పథకాలనైనా అమలు చేయడం సాధ్యమేనని.. బడ్జెట్ ను ఆసాంతం పరిశీలించిన తర్వాతే కాంగ్రెస్ హామీలిచ్చిందని రేవంత్ స్పష్టం చేశారు.
బీసీ, దళిత ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్‌కు పడకుండా ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. వర్గీకరణ కోసం ప్రయత్నిస్తున్న మందకృష్ణకు ఓ సూచన చేశారు. వర్గీకరణపై ఆర్డినెన్సుకు మద్దతిచ్చేందుకు తాము రెడీగానే ఉన్నామన్న రేవంత్.. కేంద్రం తలచుకుంటే 48 గంటల్లోనే ఆర్డినెన్స్ ఇస్తుందన్నారు. కానీ వాటికోసం ప్రయత్నించకుండా.. బీఆర్ఎస్ గెలుపుకోసమే బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు..
.
.
.