
Telangana 2BHK Scheme | డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం జరుగుతున్న దందా మామూలుగా లేదు. జూబ్లీహిల్స్‌లోని కమలానగర్‌లోనూ… డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వ్యవహారంలో గోల్‌మాల్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమలానగర్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం… ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 130 కుటుంబాలను ఖాళీ చేయించారు. ఇల్లు ఖాళీ చేస్తే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తామని మాగంటి గోపీనాథ్ తమకు హామీ ఇచ్చారని, అందుకే తాము ఇల్లు ఖాళీ చేసి అద్దె ఇళ్లలో చేరామని ఆయా కుటుంబాలు చెబుతున్నాయి.
తీరా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక… కొన్ని కుటుంబాలకే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించారని, ఎమ్మెల్యే మాత్రం 100 ఇళ్లను తనవారికే కేటాయించుకున్నారని బాధితులు చెబుతున్నారు. మాగంటి గోపీనాథ్ తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఇల్లు పొందిన లబ్దిదారులు కూడా అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. నాసిరకం నిర్మాణం వల్ల తాము అదనంగా 3 లక్షల రూపాయల వ్యయంతో ఇళ్ల మరమ్మతులు చేసుకున్నామని లబ్దిదారులు చెబుతున్నారు. డ్రైనేజీ లీక్, ఫ్లోర్‌కు గుంతలు, గోడలకు పగుళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీళ్లు, కరెంట్ లాంటి కనీస సదుపాయాలు కూడా లేవంటున్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టామని చెప్పుకోవడానికే తప్ప… ఏ మాత్రం నాణ్యత లేకుండా కట్టారని ఆరోపిస్తున్నారు. సమస్యలు మీడియాతో చెబితే… తమను బెదిరిస్తున్నారని లబ్దిదారులు చెబుతున్నారు.
మరో విషయం ఏంటంటే… కమలానగర్‌లో కట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో ఇప్పటికీ 100 ఇళ్లు ఖాళీగానే ఉన్నాయి. వేల మంది డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం ఎదురుచూస్తుంటే… అర్హులైన వారికి కేటాయించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని కమలానగర్ వాసులు చెబుతున్నారు.