
Telangana Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించటంతో బాటు వాటిని మరెవరికీ కేటాయించొద్దని ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం, దాన్ని కోర్టు కొట్టిపారేయటం తెలిసిందే. అయితే.. నిజానికి ఈ గుర్తుల బెంగ కేవలం గులాబీ పార్టీకే కాదు.. విజయావకాశాలున్న ప్రతి అభ్యర్థినీ బెంబేలెత్తిస్తోంది. ఎందుకో తెలుసుకోవాలంటే.. గత ఎన్నికల్లో ఆయా గుర్తులు సాధించిన ఓట్ల గణాంకాలను మీరు తెలుసుకోవాల్సిందే.
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్‌లో.. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వేముల వీరేశం 8,259 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే.. ఇక్కడ ట్రక్ గుర్తుపై పోటీ చేసిన దుబ్బా రవికుమార్‌కు 10,383 ఓట్లు వచ్చాయి. ఇది విజేత సాధించిన మెజారిటీ కంటే ఎక్కువ.
తాండూరు సెగ్మెంట్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి చేతిలో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి 2,589 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ ట్రక్ గుర్తు అభ్యర్థికి 2,608 ఓట్లు, రోడ్డు రోలర్ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థికి 639 ఓట్లు వచ్చాయి. ఈ రెండు గుర్తుల ఓట్లు కలిపితే విజేత మెజారిటీ కంటే ఎక్కువ. అంతేకాదు, తాండూరులో ట్రక్ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థి పేరు కూడా పి.మహేందర్ రెడ్డి. పేరు, గుర్తులో పోలిక ఉండడం వల్లే తమ అభ్యర్థికి రావాల్సిన ఓట్లను నష్టపోయామన్నది బీఆర్ఎస్ నేతల వాదన.
ధర్మపురి(ఎస్సీ) సెగ్మెంట్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్.. తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీద కేవలం 441 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ నియోజకవర్గంలో ట్రక్ గుర్తు అభ్యర్థికి 13,114 ఓట్లు (పోలైనవాటిలో 7.91 శాతం) వచ్చాయి.
అంబర్‌పేటలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేశ్ 1,016 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. ఇక్కడ ట్రక్ గుర్తు అభ్యర్థికి 1,052 ఓట్లు వచ్చాయి.
ఇక.. కోదాడలో కోదాడలో బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ 1,556 ఓట్లతో గెలిచారు. ఇక్కడ ట్రక్ గుర్తు అభ్యర్థి 5,240 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
తుంగతుర్తిలో బీఆర్ఎస్ నేత గాదరి కిశోర్ 1,867 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. ఇక్కడ ట్రక్ గుర్తు అభ్యర్థికి 3,729 ఓట్లు వచ్చాయి.
సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్‌పై 2,589 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. అయితే.. ఇక్కడ ట్రక్ గుర్తు అభ్యర్థి రామచందర్‌కు 4,140 ఓట్లు వచ్చాయి. ఇది విజేత జగ్గారెడ్డి సాధించిన ఆధిక్యం కంటే ఎక్కువ. అలాగే.. బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తంచేస్తున్న టీవీ గుర్తుతో ఇక్కడ పోటీచేసిన అభ్యర్థికి ఇక్కడ 738 ఓట్లు వచ్చాయి.
మొత్తంగా.. 2018 ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గానూ.. 58 సీట్లలో ట్రక్ గుర్తున్న అభ్యర్థులు బరిలో దిగగా, వాటిలో 21 సీట్లలో మూడో స్థానంలో, 22 చోట్ల నాలుగో స్థానంలో ట్రక్ గుర్తుమీద పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థులు రేసులో నిలిచారు. ఈ ఎన్నికల్లో ట్రక్ గుర్తు అత్యధికంగా మానకొండూర్‌లో 13,610 ఓట్లు సాధించింది. ఓట్ల శాతం పరంగా చూస్తే బెల్లంపల్లిలో అత్యధికంగా 8.38 శాతం ఓట్లు సాధించగా, బెల్లంపల్లి, కామారెడ్డి, ధర్మపురి, నకిరేకల్, జనగాంలలో ట్రక్ గుర్తుకు 10 వేల కంటే ఎక్కువ ఓట్లు పొందారు.
అలాగే.. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు 1,079 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థిపై గెలిచారు. ఇక్కడ చపాతీ రోలర్ గుర్తుకు 3,510, కెమేరా గుర్తుకు 1,978, ఓడ గుర్తుకు 1,005, రోడ్ రోలర్ గుర్తు అభ్యర్థికి 544, టెలివిజన్ గుర్తు అభ్యర్థికి 354 ఓట్లు వచ్చాయి.
ఈ కోవలోనే.. మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి 10,339 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ కూడా చపాతీ రోలర్‌కు 2,407, రోడ్ రోలర్‌కు 1,874 ఓట్లు, టీవీ గుర్తుకు 511, కెమేరా గుర్తు అభ్యర్థికి 502 ఓట్లు వచ్చాయి.
2014 అసెంబ్లీ ఎన్నికలలోనూ ఈ గుర్తులు కొందరు అభ్యర్థుల కొంపముంచాయి. ఆ ఎన్నికల్లో చేవెళ్లలో టీఆర్ఎస్ 781 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అక్కడ ఆటో రిక్షా గుర్తుకు 3,719 ఓట్లువచ్చాయి. ఇదే ఎన్నికల్లో జహీరాబాద్‌లో బీఆర్ఎస్ 842 ఓట్ల వ్యత్యాసంతో ఓటమి పాలవగా, అక్కడ ఆటో రిక్షా గుర్తుకు 1,767 ఓట్లు వచ్చాయి.
ఇక.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో 5,219 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అక్కడ రోడ్ రోలర్ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థికి 27,973 ఓట్లు వచ్చాయి.
Revanth Reddy Press Meet: కొడంగల్ నుంచే పోటీ .. రేవంత్ రెడ్డి క్లారిటీ..