
Telangana Elections : తెలంగాణలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల్లో విజయం సాధించేందుకు తమ బలబలాలను ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నాయి. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం ప్రచారంలో చాలా వెనుకబడిపోయింది. కమలం పార్టీలో నేతలు కూడా ప్రచార కార్యక్రమాల్లో పెద్దగా కనబడడం లేదు.
ఒకవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల హామీలు, మేనిఫెస్టోలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ చాలా నెమ్మదిగా అడుగులేస్తోంది. అలా అని కమలం పార్టీని తక్కువ చేయలేం. ఎందుకంటే బీజేపీ కులం, మతం ప్రతిపాదికన ఎన్నికలలో వ్యూహాలు రచించి ఓటర్లను ప్రభావితం చేయగలదు. తెలంగాణలో కూడా బీజేపీ అదే చేస్తోందా? అని భావనకలుగుతోంది. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో మతాన్ని ఉపయోగించి ప్రజలను ప్రభావితం చేసింది. కానీ మతం ముసుగు దక్షిణ భారతదేశంలో పెద్దగా పనిచేయదు. అయితే దక్షిణాదిన కులం ఒక పెద్ద అంశం.
తెలంగాణలో కూడా కులం ప్రకారమే అన్ని పార్టీలు టికెట్లు కేటాయిస్తాయి. ప్రస్తుతం బీజేపీ ఈ అంశంలో ముందంజలో ఉంది. పైగా బీసీ కులానికి చెందిన అభ్యర్థినే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని పదేపదే ప్రకటిస్తోంది. ఇందు కోసం మూడు సామాజికవర్గాలను టార్గెట్ చేసింది. దాన్ని ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమలు చేస్తున్నారు.
ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారానికి రెండు సార్లు తెలంగాణ వచ్చారు. వచ్చిన ప్రతీసారి కుల నినాదం ఎత్తుకున్నారు. ముందుగా బీసీ ముఖ్యమంత్రి అని.. ఇప్పుడు తాజాగా ఎస్సీ వర్గీకరణ హామీ. అలాగే కాపు ఓట్లు ప్రభావితం చేసేందుకు ముందుగానే జనసేతతో పొత్తు పెట్టుకున్నారు. బీసీ, ఎస్సీ, కాపు ఈ మూడు సామాజికవర్గాల ఓట్లు వస్తే తమ గెలుపు సాధ్యమని బీజేపీ భావిస్తోంది.
బీసీలందరూ తమకే ఓటు వేస్తారో లేదో అని అనుమానంతో బీజేపీ మాదిగ వర్గాన్ని టార్గెట్ చేసింది. దీనికోసం ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తామని చెప్పేందుకు మోదీ భారీ బహిరంగసభ ఏర్పాటు చేసుకున్నారు. మందకృష్ణ మాదిగతో సభ ఏర్పాటు చేయించి.. ఏకంగా ప్రధాన మంత్రి ఆ కార్యక్రమానికి వచ్చారు. ఆ సభలో మోదీ మందకృష్ణను ఓదార్చడం చూసి.. అందరూ ఆశ్చర్యపోయారు. సభలో మోదీ మాట్లాడుతూ.. మాదిగల పోరాటానికి మద్దతు తెలిపారు.
అలాగే ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవసభలో పవన్ కల్యాణ్ కు కూడా మోదీ అదే తరహా ట్రీట్ మెంట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తమతో ఉన్నారని మోదీ గొప్పగా చెప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ పక్కన ఉంటే మున్నూరు కాపు ఓట్లు తమకే వస్తాయని బీజేపీ ధీమా.
అయితే ఇప్పుడు ప్రజలు తమ కష్టాలను పక్కనబెట్టి బీజేపీ కుల హామీలను ఎంతవరకు నమ్ముతారో తెలియదు, కానీ బీజేపీ ముఖ్యమంత్రి పదవిపై బీసీ వర్గాలకు చెందిన బండి సంజయ్, ఈటల రాజేందర్ లాంటి అగ్రనేతలు మాత్రం పదవి తమదేనని నమ్ముతున్నారు.