
Telangana Elections : తెలంగాణాలో ఎన్నికలకు కొన్నిరోజుల ముందు వరకు కేసీఆర్ ప్రభుత్వాన్ని బీజేపీ నాయకులను తీవ్రంగా విమర్శించే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఎన్నికలు సమీపించే కొద్దీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను పదవి నుంచి కమలం పార్టీ పెద్దలు తప్పించి కిషన్ రెడ్డి చేతికి పగ్గాలిచ్చారు.
బండి సంజయ్ కేసీఆర్‌ను దొరికినప్పుడల్లా విమర్శించేవారు. అలాంటిది ఆయనను తప్పించి కిషన్ రెడ్డిలాంటి సీనియర్ నాయకుడిని రంగంలోకి దింపింది బీజేపీ. అప్పటి నుంచి బీఆర్ఎస్‌పై బీజేపీ తరపున విమర్శలు తక్కువగానే కనిపిస్తున్నాయి. కేసీఆర్ కూడా ఒక సందర్భంలో ప్రధాని మోడీ తనకు మంచి మిత్రుడని చెప్పారు.
మరోవైపు కర్ణాటక గెలుపుతో తెలంగాణలో కాంగ్రెస్ నాయకులలో కూడా ఉత్సాహం వచ్చింది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి భారీ స్థాయిలో వలసలు మొదలయ్యాయి. ప్రజలు కూడా బీజేపీ కంటే కాంగ్రెస్‌ను ప్రధాన ప్రత్యర్థిగా చూడడం మొదలుపెట్టారు. ఎన్నికల ప్రచారం కోసం ఇటీవల తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీ కూడా కేసీఆర్, బీఆర్ఎస్‌ను పెద్దగా విమర్శించలేదు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన అంశంపై అసలు మాట్లాడలేదు.
ఈ సంఘనలన్నీ ఒక ఎత్తు. కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఎన్నికల సమయంలో అది కూడా నామినేషన్లు వేసే రోజున ఐటీ అధికారుల దాడి చేయడం అనేది మరో ఎత్తు. ఐటీ అధికారులు కేవలం కాంగ్రెస్ నాయకుల ఇళ్లు, ఆఫీసులలోనే సోదాలు చేశారు. అదికూడా అభ్యర్ధులు నామినేషన్లు వేసే రోజే దాడులు జరిగాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్ధులు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, విక్రాంత్ రెడ్డితో పాటు పారిజాత నర్సింహారెడ్డి ఇళ్ళు, ఆఫీసులు, బంధువుల ఇళ్ళపైన కూడా దాడులు జరిగాయి.
ఈ దాడులన్నీ కేవలం కాంగ్రెస్ అభ్యర్ధుల మీదే జరగటంతో వెంటనే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ఆరోపణలు మొదలయ్యాయి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడబలుక్కునే కాంగ్రెస్ అభ్యర్ధులపైన ఐటి శాఖ అధికారులతో దాడులు చేయిస్తున్నట్లు కాంగ్రెస్ అభ్యర్ధులు నేతలు మండిపోతున్నారు. నిజంగానే బీఆర్ఎస్-బీజేపీలు ప్రత్యర్ధిపార్టీలే అయితే రెండు పార్టీల అభ్యర్ధుల మీద కూడా దాడులు జరగాలి.. కానీ అలా జరగలేదు అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఐటీ శాఖ.. బీజేపీ అభ్యర్ధుల మీద దాడులు చేయకపోయినా.. కనీసం బీఆర్ఎస్ అభ్యర్ధుల మీదైనా జరగాలి కదా అనే ప్రశ్నకు బీఆర్ఎస్, బీజేపీలు సమాధానం చెప్పలేకపోతున్నాయి.
ఐటి దాడుల తీరుతో ప్రజల్లో కూడా బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులలో ముఖ్యంగా పొంగులేటిని ఐటి అధికారులు నామినేషన్ వేయడానికి అడ్డుకున్న తీరుచూస్తే ఎవరికైనా ఇదే అనుమానం వస్తుంది.
తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయింది. అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్. దీంతో కేసీఆర్, మోదీ ఇద్దరి శత్రువు ఒక్కరే కాబట్టి ఇద్దరి మధ్య లోపాయికారీ పొత్తు కుదరిందనే అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ వెనక్కు తగ్గి బీఆర్ఎస్‌కు పరోక్షంగా సహకరిస్తే.. రేపు దేశమంతా జరిగే లోక్ సభ ఎన్నికలలో కేసీఆర్.. మోదీకి మద్దతిచ్చే అవకాశాలున్నాయి.
Pawan Kalyan: ఓడిపోయాను..ఫెయిల్యూర్ పొలిటిషీయన్ ను.. నెక్ట్స్ ఏంటి..?