
Telangana Polls : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ 30న జరుగబోతున్నాయి. ఫలితాలు డిసెంబర్ 3న వెలువడతాయి. గత రెండు ఎన్నికలతో పోల్చితే ఈ సారి ఎన్నికలు బీఆర్‌ఎస్ పార్టీకి అంత సులువుగా ఉండవని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తే అర్థమవుతోంది.
ఎందుకంటే 2014, 2018 తెలంగాణ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి రాజకీయ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. కానీ ఈసారి అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీ పుంజుకొని గులాబీ నేతలకు గట్టి సవాలు విసురుతోంది.
తెలంగాణ ప్రజల నోట ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వినిపిస్తోంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేది దీన్ని బట్టి అర్థమవుతోంది. ఈ విషయం పసిగట్టిన చాలామంది నేతలందరూ బెల్లం మీద ఈగలు వాలినట్లు కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు. వారి చేరికలు కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు పెరుగుతన్నట్లు సూచిస్తున్నాయి.
మరోవైపు కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సూచిస్తుంటే, మరికొన్ని కాంగ్రెస్-బిఆర్ఎస్ రెండు పార్టీలకు సమాన అవకాశాలు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నాయి. మరికొన్ని కొన్ని సర్వేలు బిఆర్ఎస్ పార్టీ తక్కువ మెజార్టీతో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. ఈ సర్వేలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ బలం పెరిగిందని స్పష్టమవుతోంది.
వీటికి తోడు ఎప్పుడూ బీఆర్‌ఎస్ పార్టీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసే గులాబీ బాస్ కేసీఆర్ ఈ సారి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ గెలిస్తే సంక్షేమ పథకాలు ఉండవని ప్రజలను భయపెడుతున్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి లోలోపల కేసీఆర్ కూడా కాంగ్రెస్ బలంతో భయపడుతున్నారని అర్థమవుతోంది.
గత లోక్‌సభ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని బల్లగుద్ది చెప్పిన కేసీఆర్‌కు చుక్కెదురైంది. ఆయన అంచనాలు పూర్తిగా తప్పాయి. తెలంగాణ ప్రజల ఆలోచన, రాజకీయ పరిస్థితులు గమనిస్తే అధికార బిఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలలో ఎదురీత తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.