
ChandraMohan Cine Career : రంగులరాట్నం సినిమాతో రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టి.. తన అభినయంతో రంగస్థలంకే వన్నెతెచ్చిన గొప్ప నటుడు చంద్రమోహన్. వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలబడమే కాకుండా.. సీరియస్ సన్నివేశాన్ని కూడా ఒక్క క్షణంలో కామెడీగా కన్వర్ట్ చేసి ప్రేక్షకులను మెప్పించదగిన నటనా కౌసల్యం కలిగిన గొప్ప యాక్టర్ చంద్రమోహన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. పదహారేళ్ల వయసు మూవీలో చంద్రమోహన్ చేసిన డీ గ్లామర్ పాత్ర విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. అటువంటి కళామతల్లి ముద్దుబిడ్డ అనారోగ్యం కారణంగా శనివారం (నవంబర్11) తుది శ్వాస విడిచారు.
ఈ సందర్భంగా చంద్రమోహన్ సినీ ప్రస్థానం గురించి పలు సందర్భాలలో ఆయన స్వయంగా వెల్లడించిన విశేషాలను తెలుసుకుందాం. సినీ కెరియర్ ప్రారంభమై ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మొదలుపెట్టాడు చంద్రమోహన్. సూపర్ స్టార్ కృష్ణ తెరంగేట్రం చేసిన తేనె మనసులు చిత్రానికి మొదట ఆడిషన్ ఇచ్చింది చంద్రమోహన్. ఆ తరువాత ఆఫర్ కృష్ణ చేతికి వెళ్ళింది. ఇక లాభం లేదు అని ఉద్యోగం చేసుకుంటూ ఉన్న అతడి ఫోటో చూసి బీఎన్ రెడ్డి గారు పిలిచి మరీ రంగులరాట్నంలో చేసే అవకాశాన్ని ఇచ్చారు.
మొదటి సినిమా అయితే చేతికి వచ్చింది కానీ ఆ తరువాత సుమారు 6 నెలల పాటు మరొక సినిమా ఊసే లేదు. ఏదో మరపురాని కథ ,బంగారు పిచ్చుక లాంటి చిత్రాలలో అవకాశం వచ్చింది. మళ్లీ రెండున్నర సంవత్సరాల పాటు ఖాళీగానే ఉండిపోయారు. ఇంకేదన్నా పాత్రలు చేద్దామా అంటే బి.యన్ రెడ్డి గారు కచ్చితంగా హీరో అయితేనే చెయ్యి తప్ప చిన్నచిన్న వేషాలు వేయకు అని స్పష్టంగా చెప్పారట. సినిమాల్లో చాన్సులు లేక , చేతిలో డబ్బులు లేక మద్రాసు వెంకటనారాయణ రోడ్డులో ఉన్న పార్కులో పస్తులు పడుకున్న రోజులు ఇప్పటికీ తనకు గుర్తున్నాయని చంద్రమోహన్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఒకానొక సమయంలో అసలు మద్రాసు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నారట. కానీ ఇంత దూరం వచ్చింది పట్టుదలగా ఎదగడానికే కానీ పిరికితనంతో పారిపోవడానికి కాదు అని నిర్ణయించుకుని.. హీరోగా నటించాలి అన్న పట్టుదలను కూడా పక్కన పెట్టి అన్ని రకాల వేషాలు వేసి ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలా ఆ రోజు రాజీ పడ్డాను కాబట్టి ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు ఉండగలిగానని అనిపిస్తోంది అని ఒక సందర్భంలో చంద్రమోహన్ అనడం జరిగింది.
పదహారేళ్ల వయస్సు మూవీ తమిళ్ రీమేక్ మూవీ.. ఇందులో చంద్రమోహన్ క్యారెక్టర్ ని ముందుగా తమిళ్ లో కమల్ హాసన్ చేశారు. ఒకసారి కమల్ హాసన్ మాట్లాడుతూ తనకంటే కూడా చంద్రమోహన్ ఆ క్యారెక్టర్ ని బాగా చేశాడు అనిపించిందని మెచ్చుకున్నారు. నిజంగా చంద్రమోహన్ కి ఆ మాట చాలు అనిపించిందట. ఈ విషయాన్ని ఆలీతో సరదాగా జరిగిన ఇంటర్వ్యూలో చంద్రమోహన్ స్వయంగా వెల్లడించారు. ఇండస్ట్రీలో చంద్రమోహన్ కి లక్కీ హీరో అని పేరు ఉంది.. అతనితో సినిమా చేసిన ఏ హీరోయిన్ కైనా సక్సెస్ కలిసి వస్తుంది అని ఒక గట్టి నమ్మకం ఇండస్ట్రీలో ఉంది.
అయితే ఎవరికీ తెలియని మరొక నమ్మకం చంద్రమోహన్ విషయంలో శోభన్ బాబుకి ఉందట. చంద్రమోహన్ ,శోభన్ బాబు ఇద్దరూ మంచి స్నేహితులు. అప్పుడప్పుడు శోభన్ బాబు చంద్రమోహన్ ని డబ్బులు అడిగి తీసుకునే వారట. స్వతహాగా మంచి ఆస్తిపరుడు.. సినిమాల్లోనూ బాగా సంపాదిస్తున్నాడు.. మరి నన్ను డబ్బులు ఇలా అడగడం ఏమిటి అని మొదట్లో చంద్రమోహన్ ఆశ్చర్యపోయేవాడట. అయితే ఇంతకీ విషయం ఏమిటంటే చంద్రమోహన్ దగ్గర డబ్బులు తీసుకుంటే బాగా కలిసి వస్తుంది అని శోభన్ బాబు నమ్మేవారట. అందుకే చాలా సందర్భాలలో చంద్రమోహన్ దగ్గర అడిగిమరీ డబ్బులు తీసుకునే వారట. మొత్తానికి చంద్రమోహన్ మాంచి లక్కీ హ్యాండ్ అని అర్థమవుతుంది.