
CM KCR Latest News(Election news in Telangana) :
గత రెండు ఎన్నికలతో పోలిస్తే ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అధికార బీఆర్ఎస్ పార్టీకి ఒక సవాలుగా మారాయి. పలు సర్వే ఫలితాలు గులాబీ బాస్ కేసీఆర్‌కు చెమటలు పట్టిస్తున్నాయని అంటున్నారు.
బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య గమనిస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఎంతలా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పైన దూకుడుగా వ్యవహరించే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ రోజురోజకీ పుంజుకుంటోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని గద్దెదింపడానికి కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నిస్తోంది.
వచ్చే ఎన్నికలలో కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయబోతున్నారు. కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగబోతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వికటిస్తుందేమోననే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ రెండు చోట్ల కూడా ఆయన గట్టి పోటీ ఎదుర్కోవడం ఖాయమనే అంచనాలున్నాయి.
గజ్వేల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈటల రాజేందర్ పేరును ఇటీవల బీజేపీ ప్రకటించింది. తన పై కేసీఆర్ ప్రభుత్వం చేసిన రాజకీయ కక్ష సాధింపులకు సరైన సమాధానం చెప్పడానికే తాను ఈ పోటీకి సిద్ధమయ్యానంటూ ఈటల అంటున్నారు. ప్రజాక్షేత్రంలో మంచి ఆదరణ కలిగిన మాస్ నాయకుడిగా ఈటలకు మంచి గుర్తింపు ఉంది. గజ్వేల్ నుంచి పోటీ చేయనున్న కేసీఆర్ కు ఈటల లాంటి సమఉజ్జీని ఎదుర్కోవడం అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు కామారెడ్డి నుంచి కేసీఆర్ పై పోటీకి తానూ కూడా సిద్ధం అంటూ రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఎన్నికల కథ మంచి రసకందాయంలో పడింది. రేవంత్ రెడ్డి తన వాక్చాతుర్యంతో అటు యూత్ లోనూ, ఘాటైన రాజకీయ విమర్శలు చేస్తూ ఇటు మాస్ లోనూ మంచి ఆదరణ సంపాదించుకున్నారు.
మొత్తంమీద కేసీఆర్ ఇద్దరు మాస్ లీడర్లను ఎలా ఎదుర్కొంటారనే అంశంపై అందరి దృష్టి మళ్లింది. రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్‌లతో పోటీ కేసీఆర్‌కు కత్తి మీద సాములా ఉంటుందంటున్నారు.