
Vijayashanti : పార్టీ తీరుపై అసహనంగా ఉన్న రాములమ్మ బీజేపీకి గుడ్‌బై చెప్పింది. కొన్నాళ్లుగా అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో పార్టీ మారుతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఎట్టకేలకు ఆ వార్తలను నిజం చేస్తూ కమలం పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరనుంది. ఈ మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రీజైన్ చేసి.. రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపారు.
కొన్నాళ్లుగా రాములమ్మ పార్టీ తీరుపై అసహనంగా ఉన్నారన్న ప్రచారం జరిగింది. మోదీ, అమిత్ సభలకు ఆమె హాజరుకాకపోవడంతో ఆ ప్రచారం మరింత జోరందుకుంది. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు రాములమ్మకు నచ్చలేదు. బండి సంజయ్ స్థానంలో కిషన్‌రెడ్డి నియామకం పట్ల ఆమె బహిరంగంగానే తప్పుపట్టారు. ఆ తర్వాత అధిష్టానం పట్ల అసంతృప్తిగా ఉన్న కొందరు నేతలు గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారంటూ రాజ్‌గోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి సహా పలువురు నేతలపై వార్తలు జోరందుకున్నాయి. అయితే.. వారంతా బీజేపీని వీడి ఒక్కొక్కరు వరుసగా హస్తం గూటికి చేరినా విజయశాంతి కాస్త టైం తీసుకున్నారు.
ఈ సమయంలో ఆమెను కమలాథులు బుజ్జగించే ప్రయత్నం చేయకపోవడం ఒక కారణమైతే.. లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయకపోవడంతో బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనన్న భావనలోనూ విజయశాంతి ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కేసీఆర్‌ను ఢీకొట్టే సత్తా కాంగ్రెస్‌కే ఉందని నమ్మిన విజయశాంతి హస్తం గూటికి చేరే నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాగా.. బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉన్నవిజయశాంతికి కాంగ్రెస్ గాలం వేసింది. మెదక్ ఎంపీ సీటుతోపాటు సముచిత గౌరవం ఇస్తామని హామీ ఇస్తూ జరిగిన చర్చలు సఫలం కావడంతో ఇవాళ హస్తం గూటికి చేరుకోనున్నారు రాములమ్మ.