
Vivek Ramaswamy | అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి.. ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో తన కుటుంబంతో సహా పాల్గొంటున్నారు. ప్రచారం కోసం వరుసగా చర్చలు, సమావేశాల్లో తన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నారు. అమెరికా అధ్యక్ష పదవి చేపడితే తాను ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తానని ఆయన వివరిస్తున్నారు. అలాగే మనిషి జీవితంలో కుటుంబ విలువల గురించి తన అభిప్రాయాలు పంచుకున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఫ్లోరిడా రాష్ట్రం ఓసియోలా కౌంటీలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ఆయన తన భార్య అపూర్వతో కలిసి పాల్గొన్నారు. అక్కడ కొందరు ఓటర్లు వారి పరిచయం, పెళ్లి గురించి చెప్పాలని ప్రశ్నించారు. అందుకోసం ఆయన ఒక వీడియో ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆయన భార్య అపూర్వ తమ వైవాహిక బంధం, పరిచయం గురించి వివరించారు.
“నేను మొదటిసారి వివేక్‌ని ఒక పార్టీలో చూశాను. ఆ పార్టీలో అతను ఆసక్తికరంగా కనిపించాడు. ఆ సమయంలో నేను డాక్టర్ కోర్సు చదువుతున్నాను. వివేక్ లా చదువుతున్నారు. నేను స్వయంగా వెళ్లి వివేక్‌తో పరిచయం చేసుకున్నాను. కానీ అతను నన్ను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. అయితే పార్టీ చివర్లో మళ్లీ తనే నాతో మాట్లాడాడు. ఇద్దరం చాలా సేపు ఒకరి గురించి మరొకరు తెలుసుకున్నాం. మా ఇద్దరి ఆలోచనలు కూడా ఒకే విధంగా ఉన్నాయని తెలిసింది. ఆ తరువాత కొంతకాలానికి ఒకరోజు మళ్లీ వివేక్‌ని మా ఇంటి సమీపంలో చూశాను. అప్పడు తెలిసింది అతను కూడా తన తల్లిదండ్రులతో ఆ ప్రాంతంలోనే నివసిస్తున్నాడని. మా ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. తరువాత మా తల్లిదండ్రుల అనుమతితో మేము పెళ్లి చేసుకున్నాం,” అని ఆమె చెప్పింది.
ఆ తరువాత వివేక్ కూడా ఆ వీడియోలో మాట్లాడాడు. వివేక్ మాట్లాడుతూ.. ” మా తల్లిదండ్రులు మాకు కుటుంబం పట్ల, దేవుడి పట్ల విశ్వాసంగా ఉండాలని నేర్పించారు. మనం ఎవరిని పెళ్లి చేసుకోవాలో, జీవిత భాగస్వామిగా ఎవరిని ఎంచుకోవాలో వారికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలని నేర్పించారు. అలాగే విద్యకు మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యం ఉందని చెప్పారు. ఇదే విషయం మేము మా పిల్లలకు కూడా నేర్పిస్తాము,” అని వివరించారు.
అంతకుముందు వివేక్ రామస్వామి ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే.. వేరే దేశాల యుద్ధాలలో తలదూర్చనని చెప్పారు. ఆ దేశం ఇజ్రాయెల్ అయినా సరే. అలాంటి దేశాలకు ఆయుధాలు లేక ధన రూపంలో సహాయం చేయకూడదని అభిప్రాయపడ్డారు. ఇతర దేశాల మధ్య కలహాల సందర్భంలో న్యాయం వైపు నిలబడి నైతిక మద్దతు మాత్రమే ఇవ్వాలని అన్నారు. ఎవరి యుద్ధం వారి పోరాడాలి.. ఇజ్రాయెల్ కూడా తన యుద్ధం తనే పోరాడాలి అని చెప్పారు.