
World Cup Prize Money | అందరూ ఫైనల్, ఫైనల్ అంటున్నారు గానీ, ఒకవేళ గెలిస్తే ప్రైజ్ మనీ ఎంత వస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి రేగుతోంది. ఆదివారం నాడు ఆస్ట్రేలియా-ఇండియా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా మోదీ స్టేడియంలో జరగనుంది. ఇప్పుడిక్కడ గెలిచిన వారికి ఐసీసీ ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే కళ్లు తిరగక మానదు.
ముందు గెలవాలి. కప్ రావాలి. డబ్బులది ఏముందిలే… అంటున్నారు గానీ, చాలామంది క్రికెటర్లు పేదరికంలో ఉన్నారంటే ఆశ్చర్యం అనిపించక మానదు. కొన్ని దేశాల్లో తప్ప ఇతర దేశాల్లో అంత గొప్పగా క్రికెటర్లకి పారితోషికాలు ఉండవు. వాళ్లు పేదరికంలోనే ఉంటారు.
కాకపోతే అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడటం వల్ల ఇతర దేశాల్లో లీగ్ లు, క్లబ్ ల తరఫున ఆడి సంపాదిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడందరికి కూడా ఆ ప్రైజ్ మనీపై ఆసక్తి ఏర్పడింది. డబ్బులంటే ఎవరికి చేదు చెప్పండి…అవేమీ ఊరికినే రావు కదా…
ఇప్పుడు ఫైనల్ గెలిచిన జట్టుకు.. ప్రపంచకప్ ట్రోఫీ దక్కుతుంది. దాంతోపాటు రివార్డు కింద ఐసీసీ కళ్లుచెదిరే మొత్తంలో ప్రైజ్‌మనీ అందిస్తుంది. ప్రపంచకప్ అంతటికీ కలిపి పది మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ అందించనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి తెలిపింది.
ఇక ఫైనల్ లో గెలిచి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచే జట్టుకు.. ట్రోఫీతో పాటు 4 మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీ అందజేస్తారు. ఇక ఓడిపోయి రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 2 మిలియన్ డాలర్లను అందజేస్తారు.
భారతీయ కరెన్సీలో చెప్పాలంటే విన్నర్‌గా నిలిచే జట్టుకి రూ. 33 కోట్లు, రన్నరప్‌గా నిలిచే జట్టుకు రూ. 16 కోట్లు అందనుంది.
ఇక సెమీఫైనల్‌లో ఓడిపోయే ఒకొక్క జట్టుకు రూ. 8 లక్షల డాలర్ల చొప్పున అందిస్తారు. లీగ్ దశలోనే వెనుదిరిగిన జట్టుకు లక్ష డాలర్ల చొప్పున ఐసీసీ అందజేయనుంది. మొత్తంగా పది మిలియన్ డాలర్లను అన్నిజట్లకు వారి ప్రదర్శన ఆధారంగా కేటాయిస్తారు.
లీగ్ దశ, సెమీస్, ఫైనల్స్ ఇలా మూడు భాగాలుగా విభజించారు. ఆ ప్రకారం పైన చెప్పిన విధంగా అందజేయనున్నారు. ఇవి కాకుండా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు అదనంగా ఇస్తారు. అవి వ్యక్తిగతంగా ఆటగాళ్లకు చెందుతాయి. ఇవే కాకుండా మంచి ప్రదర్శన చేస్తే ఆయా దేశాల బోర్డులు కూడా ఆటగాళ్లకు వ్యక్తిగతంగా కొన్ని ప్రోత్సహకాలు అందజేస్తారు.
World Cup, Prize Money, Cricket, ICC World Cup 2023, Winner
Revanth Reddy : ఎర్రబెల్లిని ఓడించండి.. పాలకుర్తి ప్రజలకు రేవంత్ పిలుపు..