
World Diabetes Day : భారతదేశంలో ప్రతి పౌరుడికి డయాబెటీస్ అంటే మధుమేహం(షుగర్ వ్యాధి) ప్రమదం పొంచి ఉందని చెప్పడం తప్పు కాదేమో. ఎందుకంటే మన దేశంలో పది కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. విచిత్రమేమిటంటే దాదాపు 5 కోట్ల మందికి తమకు షుగర్ వ్యాధి ఉందనే విషయం కూడా తెలియకపోవడం.
టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా సంస్థ ప్రచురించిన కథనం మేరకు 2021 సంవత్సరం వరకు భారతదేశంలో 7.4 కోట్ల మందికి మధుమేహం వ్యాధి ఉంది. అదే 2023 లో ఈ సంఖ్య పెరిగి 10 కోట్లకు చేరుకుంది. ఈ నెంబర్లు చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. ఆరోగ్య సర్వేల ప్రకారం.. ఈ స్పీడు ఇలాగే కొనసాగితే రాబోయే పది సంవత్సరాలలో మరో 10 కోట్ల మందికి షుగర్ వ్యాధి బారిన పడతారిన అంచనా.
ఈ విధంగా చూస్తే దేశంలో ప్రతి 10 మందిలో ఒకరికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదముంది. కానీ మన జీవనశైలిని బట్టి చూస్తే ప్రతి ఒక్కరికీ ఈ వ్యాధి వస్తుంది చెప్పొచ్చు. మద్రాస్ డయాబెటిక్ రీసెర్చ్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం.. దేశంలో 2.5 కోట్ల మందికి ప్రి డయాబెటిక్ లక్షణాలున్నాయి. అంటే ఇలాంటి వారికి త్వరలోనే డయాబెటీస్ వచ్చే ప్రమాదముంది. కానీ ఇలాంటి వాళ్లు వెంటనే తమ ఆహార అలవాట్లు మార్చుకొని, నిత్యం వ్యాయామం, తగినంత సేపు నిద్రపోవడం లాంటివి చేస్తే మధుమేహం రాకుండా చూసుకోవచ్చు.
అలాగే ప్రపంచం మొత్తంగా చూస్తే 50 కోట్ల మంది షుగర్ వ్యాధి బాధితులున్నారు. అందులో 20 శాతం అంటే 10 కోట్ల మంది ఒక్క భారతదేశంలో ఉన్నారు. ఈ కారణంగానే భారతదేశాన్ని ప్రపంచంలో డయాబెటీస్ క్యాపిటల్(మధుమేహ వ్యాధికి రాజధాని) అని పిలుస్తున్నారు.
మధుమేహం ఒక విచిత్ర వ్యాధి. ఈ వ్యాధి సోకినట్లు చాలా మందికి ముందుగా తెలియదు. శరీరీం లోలోపల ఉండి ఇది ఆరోగ్యాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. ఈ వ్యాధి ఉన్నవారికి గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యలు కూడా త్వరగా వచ్చే అవకాశాలున్నాయి.
షుగర్ వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎందుకు ఎక్కువ!

భారతదేశంలో ప్రజలు ఎక్కువగా బియ్యం, పిండి, బంగాళదుంపలు (ఆలు గడ్డలు) కలిగిన ఆహారాన్ని తీసుకుంటారు. వీటిలో అధికంగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ప్రొటీన్ నామమాత్రంగా ఉంటుంది. మరోవైపు బర్గర్లు, పిజ్జాలు, చైనీస్ ఫుడ్ లాంటి ఫాస్ట ఫుడ్ తినడమే ఇప్పడు ట్రెండ్.

మారుతున్న జీవనశైలి కూడా ఒక ప్రధాన కారణం. ఇప్పుడు మనుషులు ఎక్కువగా శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితి గ్రామాలలోనూ కనిపిస్తోంది. అంటే శరీరానికి శ్రమ కలిగే పని చేయడానికి ఇప్పుడు ఎక్కువ మంది ఇష్టపడడం లేదు. పైగా ఎక్కువ సేపు నడవాలంటే అది కుదరని పని అంటున్నారు. దీంతో శరీరంలో ఎక్కువగా కదలికలు ఉండవు. అలాగే రాత్రివేళ ఆలస్యంగా నిద్రపోయి.. తగిన నిద్రలేకపోవడం కూడా ఒక కారణం.
ఇలాంటి ఆహారపు అలవాట్లు, తక్కువ శారీరక శ్రమ, ఫాస్ట్ ఫుడ్లతో ఒక మధుమేహమే కాదు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా త్వరగా వస్తాయి.
షుగర్ వ్యాధి నివారణ
దేశంలోనే ప్రముఖ డయాబెటాలిజిస్ట్ డాక్టర్ పారస్ అగర్వాల్ ప్రకారం.. ఈ వ్యాధిని రాకుండా నివారించడం చాలా సులభం. ప్రతిరోజు రాత్రి త్వరగా నిద్రపోవడం.. ఉదయాన్నే లేవడం చేయాలి. అంటే తగినంత సేపు నిద్రపోవాలి.

ప్రతిరోజు 1 గంట లేదా కనీసం 40 నిమిషాల సేపు వ్యాయామం చేయడం లేదా ఏదైనా శారీరక శ్రమ కలిగేలా పని చేయడం లాంటివి చేయాలి. జిమ్ వెళ్లకపోయినా కనీసం వాకింగ్, రన్నింగ్, సైకిల్ తొక్కడం, స్విమ్మింగ్ లాంటివి.
ఒత్తిడి, డిప్రెషన్ నుంచి దూరంగా ఉండాలి. కష్టాలు, దుఖాలు ఎదురైనా వీలైనంత సంతోషంగా ఉండడం. అలాగే ఆహారంలో ఆకుకూరలు, తాజా పండ్లు తీసుకోవడం. ఫాస్ట్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. అలాగే షుగర్(చక్కెర), ఉప్పు భోజనంలో తగ్గించాలి.

ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు. మధుమేహం మీ దరిచేరదు. అలాగే ఈ వ్యాధి బాధితులు కూడా ప్రతిరోజూ డాక్టర్ ఇచ్చే మందులు తీసుకుంటూ.. ఇవే అలవాట్లతో జీవనశైలి మార్చుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది.