Big Stories

Medaram Jathara 2024: వనం.. జనం అయ్యే జాతర..

Medaram Jatara

Medaram Sammakka-Sarakka Jathara: అదొక అభయారణ్యం. ఏడాది పొడవునా అక్కడ ఎలాంటి మానవ సంచారం పెద్దగా కనిపించదు. అక్కడ చెప్పుకోదగ్గ దేవాలయమూ లేదు. అక్కడ ఉండేందుకు ఏ వసతులూ ఉండవు. ఎటు చూసినా అడవే గనుక క్రూరమృగాల బెడదా ఎక్కువే. కానీ.. రెండేళ్లకోసారి వచ్చే జాతర సందర్భంగా ఈ అడవి జనారణ్యంగా మారుతుంది. అంతులేని భక్తి అక్కడ పొంగిపొరలుతుంది. ఆ ఆధ్యాత్మిక సాగరంలో మునిగితేలేందుకు ఏకంగా కోటిమంది అక్కడికి చేరుకుంటారు. అదే మన మేడారం జాతర. 1996 లో ఈ జాతరని అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతర విశేషాలు మీకోసం..

- Advertisement -

నిరంకుశ పాలకుల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ, పోరుబాట పట్టి అమరులైన ఇద్దర ఆదివాసీ మహిళల బలిదానమే మేడారం జాతర నేపథ్యం. ఆనాటి నుంచి సమ్మక్క, సారలమ్మ అనే ఆ ఆదివాసీ మహిళలు ఆ సమూహానికి దేవతలయ్యారు. రెండేళ్లకోసారి వారిని తలుచుకుని, వారి త్యాగాలను స్మరించుకునేందుకు మూడు రాష్ట్రాల ఆదివాసీలు గూడు బళ్లలో వందల కిలోమీటర్ల దూరాన్ని లెక్కచేయకుండా తరలిరావటం ఈ జాతర విశేషం. 9 శతాబ్దాల చరిత్ర గల ఈ జాతరను స్వాతంత్ర్యానికి ముందురోజుల వరకు కేవలం ఆదివాసీలే.. చిలకల గుట్టపై జరుపుకునే వారు. కానీ ఇది నేడు అందరి జాతర అయింది.

- Advertisement -

ఇక.. ఈ జాతరకు సంబంధించిన చరిత్రను పరిశీలిస్తే పగిడిద్దరాజు, సమ్మక్క భార్యాభర్తలు. వీరి సంతానమే.. సారక్క, జంపన్న, నాగులమ్మ. కాకతీయ పాలకులతో జరిగిన యుద్ధంలో సారక్క, నాగులమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు అమరులు కాగా.. ఈ ఘోరకలిని చూసిన జంపన్న అక్కడి సంపంగ వాగులో దూకి చనిపోతాడు. నాటి నుంచి ఆ వాగు జంపన్న వాగు అయింది. ఆ తర్వాత కొనసాగిన యుద్ధంలో సమ్మక్క యుద్ధం చేస్తూ… రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలకల గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యంలో మాయమైపోయింది. ఆమెను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు గానీ.. ఆమె మాయమైన చోట కనిపించిన ఓ పుట్టవద్ద పసుపు, కుంకుము గల భరిణె లభించినది. నాటి నుంచి ఆ భరిణనే సమ్మక్కగా భావించి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ద పౌర్ణమి రోజున సమ్మక్క జాతర నిర్వహించే సంప్రదాయం మొదలైంది.

Read More: మేడారం భక్తులు.. ఈ రూట్ మ్యాప్ ఫాలో కావాల్సిందే.. !

మరో కథనం ప్రకారం.. కాకతీయుల మీద దాడికి వస్తున్న ఢిల్లీ సుల్తానుల సేనలను దూరం నుంచే చూసిన పగిడిద్దరాజు.. ఈ కబురును తమ పాలకుడైన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడికి ఓ వేగు ద్వారా కబురు పంపి, ఢిల్లీ సేనలను మధ్యలోనే ఆపేందుకు సిద్ధపడతాడు. కానీ తన సామంతుడైన పగిడిద్దరాజు స్వతంత్రం ప్రకటించుకోవటం కోసమే యుద్ధ సన్నాహాలు చేస్తున్నాడని అపోహపడిన ప్రతాప రుద్రుడు తన సేనల్ని పగిడిద్దరాజు మీదికి పంపుతాడు. ఒకవైపు ఢిల్లీ సేనలు, మరోవైపు కాకతీయ సేనలతో చేసిన యుద్ధంలో పగిడిద్దరాజుతో సహా ఆయన కుటుంబం అంతా వీరమరణం పొందుతుంది. మిగిలిన సమ్మక్క చిలకలగుట్ట వద్ద మాయమైపోయిందనే కథనమూ జనాల్లో ఉంది.

జాతరలో భాగంగా మొదటి రోజు సారలమ్మను కన్నెపల్లి నుంచి ఊరేగింపుగా తీసుకువస్తారు. ఆమె గద్దె పైకి రాకముందే ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కొండాయి నుంచి గోవిందరాజును, మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును అటవీమార్గంలో కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. రెండో రోజు సాయంత్రం వడ్డెలు (పూజారులు) మేడారంలోని చిలుకలగుట్ట పైకి వెళ్లి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మకను తీసుకువచ్చి మేడారం గద్దెపై ప్రతిష్ఠిస్తారు. సమ్మక్క వస్తుందనగానే మేడారంలో ఒక తెలియని ఆధ్యాత్మిక భక్తి తరంగం వ్యాపిస్తుంది. దేవతని గద్దెపై ప్రతిష్టించే వేళ.. లక్షలాది మంది భక్తులు పూనకంతో ఊగి పోతారు. మూడోరోజు గద్దెలపై సమ్మక, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు అందరూ కలసి కొలువుతీరి భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు మేడారం భక్తజన సంద్రమైపోతుంది. చివరిరోజున.. సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు తిరిగి కాలినడకన తీసుకెళ్తారు. దేవతలు వనప్రవేశం చేయడంతో మేడారం జాతర ముగుస్తుంది.

వంశ పారంపర్యముగా వస్తున్న ఆదివాసీ కుటుంబాల వారే ఈ జాతరలో పూజారులు. ఇక్కడ ప్రధాన దేవతలైన సమ్మక, సారలమ్మలకు ఎలాంటి విగ్రహాలు ఉండవు. కేవలం రెండు గద్దెలు ఉంటాయి. వాటిలో ఒకదానిని సమ్మక గద్దె, రెండవది సారలమ్మ గద్దె. ఆ గద్దెకు మధ్యభాగంలోని చెట్టు కాండాలే (కంకమొదళ్లు) వన దేవతలు. దేవతామూర్తులను తోడొని వచ్చే వడ్డెలు (పూజారులు) తమ మీది నుంచి దాటుకుంటే అమ్మ కృప తమమీద పడుతుందని భక్తుల నమ్మకం.

Read More: మేడారం జాతరకు 6 వేల బస్సులు.. రెగ్యులర్ సర్వీసులు తగ్గింపు..

సమ్మక కుమారుడైన జంపన్న పేరుతో ఉన్న వాగులో స్నానం చేసిన తర్వాత గద్దెల దగ్గరికి పోయి అమ్మలను దర్శించుకుంటారు. ఈ జాతరలో పలువురు పురుషులు మహిళల వేషధారణలో వన దేవతలను దర్శించుకుంటారు. కంకబియ్యం (ఒడిబియ్యం), ఎదురుకోళ్లు (దేవతను తీసుకు వచ్చేటప్పుడు ఎదురుగా కోళ్లను గాల్లోకి ఎగురవేయడం), లసిందేవమ్మ మొకు (గుర్రం ఆకారపు తొడుగును మొహానికి కట్టుకుని వచ్చి దాన్ని అమ్మవారికి సమర్పించడం) వంటి మొక్కులు ఇక్కడ ప్రత్యేకం.

ఈ జాతర నాలుగు రోజులూ మద్యం, మాంసం మీద ఎలాంటి నిషేధం ఉండదు. అంటూ, ముట్టు, ఆచారం అనే మాటే లేదు. అక్కడ అందరూ ఒక్కటే. వీఐపీ దర్శనాల మాటే లేదు. నెరవేరిన తమ మొక్కుల తాలూకూ బంగారం(బెల్లం) అక్కడి దేవతలకు నేరుగా వెళ్లి సమర్పించుకుని, తృప్తిగా వెనుదిరుగుతారు. తెలంగాణా కుంభమేళాగా పేరొందిన ఈ జాతర నేడు అసలు సిసలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News