Big Stories

Telangana Elections : కుర్రాళ్లోయ్.. వెర్రోళ్లు కాదోయ్.. రాజకీయ పార్టీలకు యువ ఓటు బ్యాంక్‌ టెన్షన్‌!

Telangana Elections : తెలంగాణ ఎన్నికల హీట్‌ ఈసారి మరింత పెరిగింది. కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌ విజయం కోసం సర్వశక్తులు ఒడ్డాయి. ఇటు బీజేపీ కూడా ఫలితాలను తారుమారు చేసే స్థాయిలో గ్రౌండ్‌లో యాక్టివిటీస్‌ పెంచింది. గతానికి భిన్నంగా ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది. కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అనూహ్యంగా పుంజుకోవడం కమలదళానికి కంటగింపుగా మారింది. దీన్ని గుర్తించిన సీనియర్‌ నేతలు బీజేపీకి షాకిస్తూ సొంత గూటికి చేరారు. పొలిటికల్‌గా ఈ పరిణామాలు ఎలాంటి ఫలితాలకు కారణవుతుందనేది పక్కన పెడితే.. రాష్ట్రంలో యువ ఓటర్లు నిర్ణయం ఈసారి కీలకం కానుంది. అందులోనూ కొత్త ఓటర్లు దాదాపు 10 లక్షల మంది వరకు ఉన్నారు. వాళ్లు ఫలితాలను ఏవైపు టర్న్‌ చేస్తారనేది తేలాల్సి ఉంది.

- Advertisement -

తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయిలో యువ ఓటు బ్యాంకు భారీగా పెరగడం ఆసక్తికరంగా మారింది. యువత ఓట్లు కొల్లగొట్టేందుకు అన్ని పార్టీలు ఈసారి ఫోకస్ పెంచాయి. వాళ్లకు దగ్గరయ్యేందుకు అన్ని మార్గాలను అన్వేషించాయి. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 17 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో 18 నుంచి 39 ఏళ్లలోపు వాళ్లు 1 కోటి 60 లక్షల మందికి పైగా ఉన్నారు. మొత్తం ఓటర్లలో 30 శాతం వరకు యూత్ ఉండగా వాళ్ల ఓట్లు సంపాదిస్తే దాదాపు విజయం ఖరారు అయినట్లే అని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.

- Advertisement -

వాళ్ల మనసు చూరగొనేందుకు వినాయక చవితి నుంచి దీపావళి వరకు అన్ని పండగలకు స్పాన్సర్లుగా మారారు. వినాయక విగ్రహాలు, మండపాలు, దేవీ నవరాత్రుల సందర్భంగా విగ్రహాలు మండపాలకు సహకరించారు. నిమజ్జనానికి వాహనాలు సమకూర్చడం దగ్గర్నుంచి యువతను ఆకట్టుకునేలా ప్రయత్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీ చేశారు. ఉచితంగా డ్రైవింగ్ లైసెన్సులు, జాబ్ మేళాలు ఏర్పాటు చేసి గాలం వేశారు.

యూత్‌ను ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఒక ఎత్తైతే.. వాళ్లలో కొత్త ఓటర్లు ఎటువైపు మొగ్గుతారనేది హాట్‌ టాపిక్‌గా మారింది. అన్ని పార్టీల నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. యువ ఓటర్లపై రాజకీయ నేతల ప్రభావం కొంత తక్కువగానే ఉంటుంది. సామాజిక పరిస్థితులపైనా అంతగా అవగాహన ఉండదు. అలాగని వీళ్లకు మంచేదో చెడోదో తెలియనిది కాదు. యువ ఓటర్లను ప్రధానంగా ఇంకొకరు ప్రభావితం చేసే అవకాశాలు చాలా తక్కువ. వాళ్లు ఒకసారి నిర్ణయానికి వస్తే అభిప్రాయం మార్చడం అంత సులువు కాదు. కుటుంబ సభ్యులు కూడా వాళ్ల ఆలోచనను మార్చలేరు. ఓటు వేయడం పూర్తిగా తమ ఇష్టం.. వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.

ఇలాంటి ఓటు బ్యాంకు రాజకీయ పార్టీలకు ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో ఈసారి 9 లక్షల 99 వేల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. అంటే దాదాపు 10 లక్షల మంది తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అంటే ఇదేం చిన్న విషయం కాదు. దాదాపు 3 శాతానికి పైగా కొత్త ఓటర్లు ఉన్నారు. పర్సెంటేజీతో కంపేర్‌ చేస్తే జస్ట్‌ 3 శాతంగానే కనిపిస్తోంది. కానీ, ఈ నెంబరే గేమ్‌ చేంజర్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. గతంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలు.. ఓడిపోయిన పార్టీల మధ్య వ్యత్యాసం దాదాపు 1 శాతమే. అంటే 1 శాతం ఓటర్లే రిజల్ట్‌ను తారుమారు చేయగలరు. ఇదే పార్టీలకు డేంజర్‌ బెల్స్‌ మోగేలా చేస్తున్నాయి.

గట్టి పోటీ ఎదురైన చాలా చోట్ల ఫలితాలు నువ్వా-నేనా అన్నట్లుగానే సాగుతాయి. తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్‌-బీఆర్ఎస్‌ మధ్య ఇలాంటి టఫ్‌ ఫైటే నెలకొంది. రిజల్ట్‌ 1 శాతం నుంచి రెండు, మూడు శాతం ఓట్లతోనే మెజార్టీ స్థానాల్లో ఫలితాలు మారిపోతాయి. అందుకే ఈసారి కొత్త ఓటర్ల పాత్ర మరింత కీలకంగా మారనుంది. వీళ్లు వన్‌ సైడెడ్‌గా ఓటు వేస్తే రాష్ట్ర వ్యాప్తంగా రిజల్ట్‌ మారిపోనుంది. ఇలాంటి వాళ్లపై సామాజిక మాధ్యమాల ప్రభావం అధికంగా ఉండే చాన్స్‌ ఉంది. ఎక్కువగా ఫోన్లు వాడేది ఈ ఏజ్‌ గ్రూప్‌ వాళ్లే. యాప్స్‌ యూజ్‌ చేసేది కూడా వీళ్లే అధికం. అలాగే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సమాచారం షేర్‌ చేయడం.. పోస్ట్‌లు పెట్టడం.. ఫాలో అవడం.. ఇలా ఎక్కువ యాక్టివిటీస్‌ చేస్తుంటారు. స్నేహితులతో కూడా ఎక్కువగా గడుపుతుంటారు. ఇంటరాక్షన్స్‌, గ్రూప్‌ డిస్కషన్స్‌లో పార్టిసిపేట్‌ చేస్తుంటారు.

ఇలాంటి ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు సోషల్‌ మీడియాను వేదికగా వాడుకుంటున్నాయి. యువత ప్రధానంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్‌ యూజ్‌ చేస్తారు. పార్టీల ఐటీ సెల్ టీమ్‌లు ఆయా మాధ్యమాల్లో చురుకైన పాత్రను పోషిస్తున్నాయి. రీల్స్, పొలిటికల్ మీమ్స్, డీజే పాటలు, ట్రోల్ వీడియోలతో ప్రత్యర్థి పార్టీలను ఎండగడ్తున్నాయి. ఇవి ఏ మేరకు ఓట్లుగా మారతాయనేది కొత్త ఓటర్లు డిసైడ్‌ చేయనున్నారు.

రాష్ట్రంలో ప్రధానంగా నిరుద్యోగులు తీవ్ర అసహనంతో ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా తలరాతలు మారిపోతాయని భావించారు. ఇంటికో ఉద్యోగం అంటే ఎన్నో ఆశలతో తొలిసారి బీఆర్ఎస్‌ పార్టీకి అధికారం కట్టబెట్టారు. రెండోసారి నిరుద్యోగ భృతి నమ్మకంతో ఓటు వేశారు. మరి ఈసారి యువ ఓటర్లు ఏం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది. అయితే ఇటీవలి పరిణామాలు కొత్త తరాన్ని పూర్తిగా ఆలోచనలో పడేశాయి. TSPSC పేపర్‌ లీకేజీ సహా గ్రూప్‌-2 పరీక్షలు రెండు సార్లు వాయిదా పడటం తీవ్ర నిరాశ, నిస్మృహకు లోను చేశాయి.

రాష్ట్రంలో దాదాపు నిరుద్యోగులు 30 లక్షల మంది వరకు ఉన్నారు. ఆయా కుటుంబాలు కూడా ఆగ్రహంగా ఉన్నాయి. మరి వారి కోపాన్ని తగ్గించేందుకు అధికార పక్షం లెక్కలేనన్ని సార్లు లెంపలేసుకుంది. మరోసారి అధికారంలోకి వస్తే జాబ్‌ క్యాలెండర్‌ ప్రటిస్తామని నమ్మించే ప్రయత్నం చేసింది. ఇన్నాళ్లూ లక్షలాది ఉద్యోగాలిచ్చామని చెబుతూనే దాన్ని పక్కకు పెట్టి.. కొన్ని తప్పులు చేశాం.. ఈసారి సరిచేసుకుంటామని నమ్మబలుకింది. ఫలితాలు వెలువడిన తర్వాత నిరుద్యోగ యువతతో మాట్లాడి వాళ్ల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపింది. అయితే ఈసారి యువ ఓటర్లు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

గతంలో నిరుద్యోగుల కోసం హామీ ఇచ్చి విఫలమైన పార్టీలు ఈసారి ఆ అంశం జోలికి పెద్దగా వెళ్ల లేదు. నిరుద్యోగుల విషయాన్ని హైలైట్ చేయడానికి అధికార బీఆర్ఎస్‌ సాహసించలేదు. చివర్లో మాత్రం TSPSCని UPSC తరహాలో ప్రక్షాళన చేస్తామని ప్రకటించింది. యూత్ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని భరోసా ఇచ్చింది. 4 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది. బీజేపీ కూడా నిరుద్యోగ భృతి, పరీక్షల నిర్వహణ, టీఎస్‌పీఎస్సీ తీరు, పరీక్షల వాయిదాలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని దీటుగా ప్రచారం చేస్తూ యువతను ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. బీఎస్పీ తన మేనిఫెస్టోలో ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. నిరుద్యోగ జేఏసీ కూడా ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఒకతరం ఫ్యూచర్‌ మొత్తం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. జాగో యూత్‌ అంటూ ముమ్మర ప్రచారం చేసింది. మరి నిరుద్యోగ యువత, కొత్త ఓటర్లు ఈసారి ఎలా రెస్పాండ్‌ కానున్నారనేది తేలాల్సి ఉంది.

.

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News