Big Stories

Devarakonda Durgam: వెలమ పాలకుల అండ… దేవరకొండ..!

Devarakonda Durgam

Devarakonda Durgam : వచ్చిపోయే అతిథులతో కళకళలాడుతుండే అతిథి గృహాలు, వేదోచ్ఛారణలమధ్య వెలిగిపోతుండే గుళ్లు, గోపురాలు.. సిరిమువ్వల సవ్వడితో చేసే నాట్య విన్యాసాలు, సంగీత సాహిత్య సమ్మేళనాలు, రారాజుల తీర్పుకోసం వేచి ఉండే ప్రజలతో నిండిన రాజ ప్రాసాదాలతో కళకళలాడుతూ దర్శనమిచ్చే చారిత్రక ప్రదేశం దేవరకొండ దుర్గంవెలమ రాజులు శుత్రుదుర్భేద్యంగా నిర్మించిన దేవరకొండ దుర్గం..

- Advertisement -

హైదరాబాద్‌ నుంచి నాగార్జున సాగర్‌ వెళ్లే దారిలో మల్లేపల్లి నుంచి 7 కి.మీ దూరం లోపలికి వెళితే దేవరకొండ దుర్గం కనిపిస్తుంది. 800 ఏళ్ల నాటి పద్మనాయకుల(వెలమ) పాలనకు అద్దంపడుతూ, శత్రువు ఊహకు అందని భద్రతా ఏర్పాట్లతో రాతి, మట్టి ప్రాకారాలతో ఈ దుర్గం ఠీవిగా దర్శనమిస్తుంది.

- Advertisement -

ఏళ్ల తరబడి యుద్ధం చేయాల్సి వచ్చినా.. కోటలోకి నిత్యావసరాలు, ఇతర వనరుల రవాణా ఆగిపోకుండా దుర్గ నిర్మాణం చేసినట్లు ఇక్కడి కట్టడాలను గమనిస్తే అర్థమవుతుంది. ఊహించని రీతిలో శత్రువుపై దాడి చేసేలా వ్యూహాత్మక స్థానాల్లో చేపట్టిన నిర్మాణాలను చూస్తే.. మనం నోరెళ్లబెట్టాల్సిందే. నాటి పద్మనాయక వెలమ రాజుల మేధస్సు, పరిజ్ఞానం ముందు నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ముందు దిగదుడుపే అనిపించకమానదు.

కాకతీయుల వద్ద సేనానులుగా పని చేసిన పద్మనాయక వంశానికి చెందిన భేతాళ నాయకుడి వంశీకులు.. కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత దేవరకొండను కేంద్రంగా చేసుకుని రాజ్యపాలన చేపట్టారు. వీరి వంశంలో 8వ తరానికి చెందిన రెండవ మాదానాయుడు కాలంలోనే దేవరకొండ దుర్గ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

మాదానాయుడి తండ్రి సింగమనాయుడు దుర్గ నిర్మాణాన్ని ప్రారంభించగా, మాదానాయుడు దీనిని పూర్తిస్థాయి దుర్గంగా తీర్చిదిద్దారు. ఈయన పాలనలోనే దేవరకొండ రాజ్యం శ్రీశైలం వరకు విస్తరించినట్లు చరిత్ర చెబుతోంది. 525 ఎకరాల విస్తీర్ణం, 500 అడుగుల ఎత్తుగల ఏడు కొండలను కలుపుతూ పద్మనాయకులు ఈ దుర్గాన్ని అత్యద్భుతంగా నిర్మించారు.

సువిశాలమైన ఎత్తైన కొండల హెచ్చు తగ్గులకు అనుగుణంగా కోటను పలు అంచెలుగా మలచారు. అవసరమైన చోట పెద్ద పెద్ద బండరాళ్లను చీల్చి, 7 కొండలను కలుపుతూ 6, 8, 10 మీటర్ల ఎత్తుగల ప్రాకారాల గోడలను నిర్మించారు. దుర్గంలోపల కొండపైన సమృద్ధిగా నీటి నిల్వకు ఏర్పాట్లు కూడా చేశారు. అంతేకాదు.. దుర్గం లోపల ఏకంగా 100 ఎకరాలను సాగుభూమిగా మలచారు.

ఈ దుర్గంలో 360 బురుజులు, 9 ప్రధాన ద్వారాలు, 32 చిన్న ద్వారాలు, 23 పెద్ద బావులు, 53 దిగుడు బావులు, 6 కోనేరులు, 5 చిన్న కొలనులు, 13 ధాన్యాగారాలు, గుర్రపుశాలలు, ఆయుధాగారాలు ఉండేవని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అయితే సరైన రక్షణ లేని కారణంగా వీటిలో నేడు చాలా వరకు శిథిలమైపోయాయి.

ప్రధాన ద్వారాల నిర్మాణంలో వెలమ రాజులు వాడిన టెక్నాలజీ.. పర్యాటకులను ఆశ్చర్యపరుస్తుంది. శత్రువులు దుర్గంలోకి ప్రవేశిస్తే.. వారిని మొదటి ద్వారం నుంచి రెండో ద్వారం చేరేలోపు 3 మలుపులు తిరగాల్సి ఉంటుంది. ఈ మలుపులలో దాదాపు 100 మంది సైనికులు శత్రువులకు కనిపించకుండా గోడలోనే వచ్చే వారికి కనబడకుండా నిలబడే ఏర్పాట్లు చేశారు. అలాగే.. శత్రువులు.. ‘ఇదే లోపలికి పోయే దారి’ అనుకునేలా మొదటి ద్వారం తర్వాత ఒక డమ్మీ ద్వారాన్ని నిర్మించారు.

అంతేగాకుండా.. దీనిని కొండపై నిర్మించిన కారణంగా శత్రువులు దుర్గం గోడలను కూలగొట్టటం సాధ్యం కాదు. అలాగే.. సింహద్వారాలకు అతి సమీపంలో ‘యు’ ఆకారంలో బలమైన బురుజులను నిర్మించి శత్రువులు లోనికి రాకుండా కట్టడి చేయటంతో బాటు మొదటి రెండు ద్వారాలను అతి సమీపంలో నిర్మించి వాటి మధ్య రెండు అంతస్థులుగా సైనిక స్థావరాలను నిర్మించారు.

ప్రతి ద్వారానికి అడుగున రెండువైపులా పూర్ణకుంభాలను చెక్కించారు. ఇక్కడి పూర్ణకుంభ కలశాలనూ నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తమ అధికార చిహ్నం ఎంపికలో పరిశీలించింది.

సింహద్వారం దాటి లోపలి వెళ్లగానే ఎడమవైపు నల్లరాతి ఏకశిలా నంది విగ్రహం దర్శనమిస్తుంది. మరికాస్త దూరంలో ప్రధాన ద్వారం, ఆ తర్వాత కుడివైపుకు వెళితే శిథిలావస్థలోని ధాన్యాగారాలు, సైనికావాసాలు, అధికారుల భవనాలు కనిపిస్తాయి. ఇది దాటాక.. ఉండే విశాలమైన మెట్లు ఎక్కి కాస్త దూరం వెళితే రెండో రాతి ప్రాకారం కనిపిస్తుంది. తీరా ప్రాకారం దగ్గరికి వెళ్లే దాకా.. ఇక్కడ ఇంత పెద్ద ద్వారం ఉందనే సంగతే గుర్తించలేము.

అలాగే మెట్లు ఎక్కుతూ పడమరవైపు వెళితే మరో రాతి ప్రాకారం వస్తుంది. అందులో ఎన్నో రహస్య సైనిక స్థావరాలున్నాయి. ఇంకాస్త.. ముందు నాలుగో రాతి ప్రాకారం, దానినుంచి పడమర వైపు పైకి ఎక్కు తూ వెళితే ఐదో ప్రాకారం వస్తాయి. ఐదో ప్రాకారం వద్ద ఇప్పటికీ ఏ మాత్రం చెక్కుచెదరని సింహ ద్వారం మనకు దర్శనమిస్తుంది. ఈ ద్వారం దాటి లోనికి వెళ్లగానే ఓ ఆలయం ఉంటుంది.

దానికి ఉత్తర దిశగా వెళితే రెండు దారులు.. అందులో దక్షిణంవైపు మెట్లు ఎక్కి వెళితే దుర్గంలోని ఎత్తైన కొండపై గల రామాలయానికి చేరుకుంటాం. కొండపైగల 50 ఎకరాల సమతల ప్రదేశంలో రాజమందిరం, అంతఃపురం, సభావేదికలు, రాణివాసాలు, రాజదర్బారు మనకు ఆహ్వానం పలుకుతాయి.

అక్కడికి నైరుతీ దిశలో గొలుసుబావి ఉంది. రాజవంశీకులు ఈ బావిలోని నీరే తాగేవారు. కోటను వదలి వెళ్లేటప్పుడు విలువైన వస్తువులు, ధనం, నగలు వగైరాలను బకెట్‌లలో నింపి ఈ బావిలో వేసి ఇనుప గొలుసులతో అక్కడి బలమైన రాతి స్థంభాలకు బిగించి వెళ్లేవారట. 1980 వరకు ఆ గొలుసులు ఉండేవని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడి ఈ గొలుసుబావికి ఎదురుగా ఉండే కోనేరు.. ఎంత కరువులోనూ ఎండిపోలేదనీ, అందులోని నీరు నేటి వరకు ఒకేలా ఉందని చెబుతారు.

గుళ్లూ.. గోపురాలు…
గొలుసుబావికి ఉత్తరదిశగా విశాలమైన మట్టి ప్రాకారం మధ్య ఓ శివలింగం, నందీశ్వరుడు, ఓంకారేశ్వరస్వామి ఆలయాలు కనిపిస్తాయి. ఏటా శివరాత్రి, వైకుంఠ ఏకాదశి రోజున స్థానిక గ్రామాల ప్రజలు ఇక్కడ పూజాదికాలు నిర్వహిస్తుంటారు.

దేవరకొండ దుర్గాన్ని శత్రువులు ఎవరూ యుద్ధం ద్వారా ఆక్రమించనప్పటికీ.. నాటి రాజకీయ పరిణామాలు, పెరుగుతున్న శత్రువుల కారణంగా రెండవ మాదానాయుడి కాలంలో అక్కడి పాలకులు స్వచ్ఛందంగా కోటను వదలి, విజయనగర రాజులవద్ద ఆశ్రయం పొందారు.
ప్రస్తుతం.. ఈ దుర్గం భారత పురావస్తు శాఖవారి ఆధీనంలో ఉంది. ఇక్కడి విలువైన చారిత్రక సంపదను పరిరక్షించుకోగలిగితే.. ఈ దుర్గం రాబోయే తరాల వారికీ ఒక చెదరని చారిత్రక సాక్ష్యంగా నిలుస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News