Big Stories

Musk-Mark : మస్క్ బాటలోనే మార్క్…

Share this post with your friends

Musk-Mark : ఎలాన్ మస్క్ ట్విట్టర్ ఉద్యోగులను భారీగా తొలగిస్తానని ఏ క్షణాన అన్నాడోగానీ… మిగతా కంపెనీలూ ఇప్పుడు అదే రూట్లో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. మెటా ఆధ్వర్యంలో నడుస్తున్న ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ఉద్యోగులను భారీగా తొలగించబోతున్నారని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొనడంతో… ఆయా సంస్థల ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.

వేల సంఖ్యలో ఉద్యోగులను మెటా ఇంటికి పంపే అవకాశం ఉందని… వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తన కథనంలో రాసింది. నవంబర్‌ 9న ఉద్యోగుల తొలగింపుపై ఓ ప్రకటన వెలువడబోతోందని చెప్పుకొచ్చింది. ఇటీవల థర్డ్ క్వార్టర్లో మెటా ఆదాయం భారీగా తగ్గడం… వచ్చే ఏడాది కొత్త రిక్రూట్మెంట్లు చేపట్టకుండా, ఉద్యోగుల సంఖ్యను స్వల్పంగా తగ్గించే అవకాశం ఉందని సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ చెప్పడం చూస్తుంటే… ఉద్యోగుల తొలగింపు భారీగానే ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఆర్థికంగా సంస్థ బలహీన పడకుండా, ఇతర టెక్‌ సంస్థల మారిదే మెటా కూడా నియామకాలు తగ్గించి, ఉద్యోగులను తొలగించే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మెటాలో 87,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తమలో ఎంత మంది ఉద్యోగాలు ఊడతాయోననే ఆందోళన… అప్పుడే సంస్థ ఉద్యోగుల్లో మొదలైనట్లు చెబుతున్నారు.

అమెరికాలో గత వారం ట్విట్టర్ 50 శాతం మంది ఉద్యోగులను తొలగించగా… అమెజాన్ కూడా కొత్త నియామకాలను నిలిపివేసినట్లు ప్రకటించింది. ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు వంటి చర్యలు వివిధ దిగ్గజ సంస్థల వాణిజ్య ప్రకటనల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతుండటంతో… అవి కూడా ఉద్యోగుల తొలగింపుపై ఏ క్షణమైనా ప్రకటన చేయొచ్చని చెబుతున్నారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News