ప్రతీ ఏటా విడుదలయ్యే ఐఫోన్ కోసం… ఆపిల్ ప్రియులంతా ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ఎప్పుడు కొత్త ఐఫోన్ మోడల్ మార్కెట్లోకి విడుదలవుతుందా? ఎప్పుడు కొనేద్దామా? అన్నట్టుగా కాచుకుని ఉంటారు. అలాంటి వాళ్లందరికీ ఇప్పుడు ఆపిల్ కంపెనీ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఐఫోన్ 14 మోడల్స్ బుక్ చేసిన కస్టమర్లు మరికొన్నాళ్లు వేచి ఉండక తప్పదంటోంది… ఆపిల్.
ఐఫోన్ 14 సిరీస్ లో… 14ప్రో, 14 ప్రో మ్యాక్స్ సిరీస్ లకు విపరీతమైన డిమాండ్ ఉందని ఆపిల్ వెల్లడించింది. చైనాలో కొవిడ్ మళ్లీ విజృంభిస్తుండటం, ఆంక్షల కారణంగా ఉత్పత్తి ఆలస్యమవుతుండటంతో… వినియోగదారులకు ఐఫోన్ 14 డెలివరీ అనుకున్న దానికంటే ఆలస్యం కానుందని ఆపిల్ ప్రకటించింది.
చైనాలోని జెంగ్‌జౌలో కరోనా ఆంక్షలు ఐఫోన్ 14 అసెంబ్లింగ్ ప్లాంట్‌ను తాత్కాలింగా ప్రభావితం చేశాయని, ప్రస్తుతం చాలా తక్కువ సామర్థ్యంతో ప్లాంట్ పనిచేస్తోందని ఆపిల్ వెల్లడించింది. సప్లై చెయిన్ కార్మికుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, అందుకే షిప్‌మెంట్స్ ఆలస్యమవుతున్నాయని ఆపిల్ తాజా ప్రకటనలో తెలిపింది.
సెంట్రల్ చైనాలోని జెంగ్‌జౌలో సుమారు 2 లక్షలమంది ఉద్యోగులు పనిచేసే యాపిల్ కీలక ప్లాంట్ లో తీవ్రమైన కోవిడ్ ఆంక్షల కారణంగా ఐఫోన్ల ఉత్పత్తి భారీగా తగ్గవచ్చని వివిధ మార్కెట్ రీసెర్చ్ సంస్థలు అంచనా వేశాయి. అది ఏ రేంజ్ లో ఉందంటే… అతి తక్కువ ఉత్పత్తి కారణంగా… జెంగ్‌జౌ ప్లాంట్ నుంచి డిసెంబర్ త్రైమాసికంలో ఐఫోన్ షిప్‌మెంట్లు 80 మిలియన్ల నుంచి 2 లేదా 3 మిలియన్ యూనిట్లకే పరిమితం కావొచ్చని అంటున్నాయి.