Big Stories

Vinesh Phogat: రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కు లైంగిక వేధింపులు.. బీజేపీ ఎంపీపై ఆరోపణలు

Vinesh Phogat: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన ఆరోపణలు చేశారు. భారత రెజ్లింగ్ సమాఖ్యలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయని అన్నారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (WFI) అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్ సింగ్‌తో పాటు పలువురు జాతీయ కోచ్‌లు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఆ వేధింపులు భరించలేక తాను ఓసారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని కూడా చెప్పింది. తనలానే అనేక మంది మహిళ రెజ్లర్లు ఈ టార్చర్ ను అనుభవిస్తున్నారని తెలిపింది. 30 మంది బాధిత రెజ్లర్స్ అంతా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర ఆందోళనకు దిగారు.

- Advertisement -

తనను ఎందుకూ పనికిరావని తిట్టారని.. WFI అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ వేధింపుల వల్ల తాను ఎంతో మానసిక క్షోభకు గురయ్యానని చెప్పుకొచ్చారు. ఆయనపై ఫిర్యాదు చేసినందుకు గతంలో తనను చంపేస్తానంటూ బెదిరించారని కన్నీళ్లు పెట్టుకుంది వినేశ్ ఫొగట్. అయితే, ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బీజేపీ ఎంపీ కావడంతో ఈ అంశం రాజకీయంగా కలకలం రేపుతోంది.

- Advertisement -

కొన్నేళ్లుగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఈ అరాచకం జరుగుతోందని.. ఇప్పటి వరకు 20 మంది యువ రెజ్లర్లు ఇలాంటి ఫిర్యాదులను తన వద్దకు తెచ్చారని భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ అన్నారు. వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయన్నారు. దీనిపై కచ్చితంగా విచారణ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి కూడా ఆధారాలిస్తామన్నారు.

మొత్తం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ లో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అంతా అలాగే ఉన్నారని మరో రెజ్లర్ సాక్షి మాలిక్ విమర్శించారు. మరోవైపు ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ స్పందించింది. ఢిల్లీ పోలీసులతో పాటు క్రీడా మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది.

ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర భజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్‌, సంగీతా ఫొగాట్‌, సాక్షిమాలిక్‌, సుమిత్‌ మాలిక్‌, సరితా మోర్‌ సహా 30 మంది స్టార్‌ రెజ్లర్లు ఆందోళన చేపట్టారు. బ్రిజ్‌ భూషణ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకూ ఏ అంతర్జాతీయ పోటీల్లోనూ ఆడబోమని పంతం పట్టారు. తమ పోరాటం ప్రభుత్వం, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాపై కాదని.. కేవలం రెజ్లింగ్‌ ఫెడరేషన్‌పైనే అని చెబుతున్నారు మహిళా రెజ్లర్లు.

అయితే, రెజ్లర్లు చేసిన ఆరోపణలను WFI అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ ఖండించారు. వారి ఆరోపణల వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. లైంగికంగా వేధించారని ఏ ఒక్కరైనా నిరూపిస్తే తాను ఉరి వేసుకుంటానని సవాల్ చేశారు. రెజ్లింగ్‌ అధ్యక్ష పదవికి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీనామా చేయనని తేల్చి చెప్పారు.

2011 నుంచి బ్రిజ్‌ భూషణ్‌ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2019లో వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ నేత అయిన భూషణ్‌.. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News