Big Stories

Article 370 Verdict : ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు..

Supreme court on article 370

Supreme court on article 370(Latest breaking news in telugu) :

జమ్మూకాశ్మీర్‌ లో ఆర్టికల్‌ 370 రద్దు అంశంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయం రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసింది. 370 ఆర్టికల్ ను తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని తేల్చిచెప్పింది. జమ్మూకాశ్మీర్ లో సాధ్యమైనంత త్వరగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

- Advertisement -

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 జమ్మూకశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించింది. ఈ ఆర్టికల్ ను కేంద్రం రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రాష్ట్రపతి ప్రకటనపై తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. పిటిషనర్ల వాదనను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చింది.. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది.

- Advertisement -

జమ్మూకాశ్మీర్‌ పై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్‌ చేయలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్‌ భారత్‌లో విలీనం తర్వాత ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని పేర్కొంది. అప్పట్లో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలోనే ఆర్టికల్‌ 370ని తీసుకొచ్చారని తెలిపింది. ఆ నిర్ణయం తాత్కాలికం మాత్రమే గానీ శాశ్వతం కాదని తేల్చిచెప్పింది.

ఆర్టికల్ 370ను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని స్పష్టం చేసింది. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు ఏమీలేవని వివరించింది. మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో జమ్మూకాశ్మీర్ సమానమేని చెప్పింది. ఆర్టికల్ 1, ఆర్టికల్‌ 370 ప్రకారం జమ్మూకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తీర్పు ఇచ్చారు.

జమ్మూకశ్మీర్‌ నుంచి లద్దాఖ్‌ను విభజించి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకాశ్మీర్‌ ఉంది. దీంతో రాష్ట్రహోదాను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. 2024 సెప్టెంబర్ 30లోగా జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని నిర్దేశించింది.

జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించిన ఆర్టికల్‌ 370ను కేంద్రం 2019 ఆగస్ట్ 5న రద్దు చేసింది. జమ్మూకాశ్మీర్, లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూకాశ్మీర్‌కు చెందిన వివిధ రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై సీజేై డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్ట్ 2 నుంచి సుదీర్ఘంగా విచారణ జరిపింది. సెప్టెంబర్ 5న తీర్పును రిజర్వులో ఉంచిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News