Big Stories

Rice and wheat : ఆహారం.. ఎంతో నిస్సారం

Rice and wheat : తిండి కలిగితే కండ కలదోయ్‌.. కండ కలవాడేను మనిషోయ్‌.. అని 113 ఏళ్ల క్రితమే అన్నారు గురజాడవారు. కానీ ఆ తిండే ఇప్పుడు మన పాలిట విషమవుతోంది. దేశంలోని వరి, గోధుమల రకాలు ఎన్ని ఉన్నా.. అవేవీ మన కండబలాన్ని పెంచేవి కావంటున్నారు శాస్త్రవేత్తలు. మన ఆరోగ్యానికి అవసరమైన ఖనిజాలు ఆ గింజల్లో నానాటికీ మాయమవుతున్నాయని తాజా పరిశోధనలో తేలింది.

- Advertisement -

కాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు తిండి గింజల్లో తగ్గుతూ వస్తున్నాయని ఆ అధ్యయనం స్పష్టం చేసింది. 1960లలో పండించిన గింజలతో పోలిస్తే.. ఆ ఖనిజాలు 19% నుంచి 45% కన్నా తక్కువగానే ఉంటున్నాయని చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్‌కి శాస్త్రవేత్తలు జరిపిన ఆ అధ్యయనం ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

- Advertisement -

ఆరుదశాబ్దాల క్రితంతో పోలిస్తే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పండించే కొన్ని రకాల వరి గింజల్లో ఆర్సెనిక్ 16 రెట్లు, క్రోమియం స్థాయులు 4 రెట్లు ఉన్నట్టు తేలింది. అయితే గోధుమల విషయంలో ఇలాంటి సమస్యలేవీ లేవు. ఇప్పటి గోధుమగింజల్లోనే ఆర్సెనికం, క్రోమియం స్థాయులు తక్కువగా ఉన్నట్టు ఆ స్టడీ తేల్చింది. ఆర్సెనిక్, క్రోమియం రెండూ టాక్సిక్ ఎలిమెంట్స్. మన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసేవి ఇవే.

హరిత విప్లవం కారణంగా దేశంలో వరి, గోధుమ దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఫలితంగా ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధం కాగలిగాం. అదే సమయంలో ఆహారవిలువలను కోల్పోయాం. గింజల్లో పోషకాలు క్రమేపీ తగ్గు ముఖం పట్టాయని అధ్యయనం స్పష్టం చేసింది. గ్రీన్ రివల్యూషన్ పుణ్యమా అని అధిక దిగుబడులు, బ్రీడింగ్ వెరైటీలు, పురుగులను తట్టుకునే వంగడాలపై శాస్త్రవేత్తలు దృష్టి సారించి విజయం సాధించగలిగారు. కానీ ఆ గింజల్లో క్షీణిస్తున్న పోషకాల గురించి పట్టించుకోకపోవడం విషాదమే.

తిండిగింజల్లో కీలకమైన మినరల్స్ లోపిస్తే.. అది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా పెరుగుతాయి. హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ అవసరం.జింక్ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. నరాల ఆరోగ్యం, పునరుత్పత్తి సామర్థ్యం పెంపునకు కూడా జింక్ కావాలి.

తిండి గింజల్లో ఇవి ఏ మేర ఉన్నాయన్నదానిని మదింపు చేసేందుకు పరిశోధకులు 1960 నుంచి 2010 వరకు లభించిన వరి, గోధుమ రకాలను పరీక్షించారు. 1960-2010 మధ్యకాలంలోనే అత్యుత్తమ వంగడాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయగలిగారు. అందుకే ఆ సమయంలో లభించిన వెరైటీల్లో ఖనిజాల స్థాయులు ఎలా ఉన్నాయో పరిశీలించారు.

2000 సంవత్సరం వరకు పండించిన వరిలో కాల్షియం స్థాయులు 1960 సంవత్సరం నాటి వరిగింజలతో పోలిస్తే 45% తక్కువగానే ఉన్నట్టు తేలింది. అలాగే ఐరన్ 27%, జింక్ స్థాయులు 23% తగ్గాయని వెల్లడైంది. 2010 తర్వాత పండించిన గోధుమల్లో 30% తక్కువగా కాల్షియం, 19% తక్కువ మొత్తంలో ఐరన్, జింక్ స్థాయులు 27% తక్కువగా ఉన్నట్టు ఆ అధ్యయనం తేల్చింది.

వరి, గోధుమ సహా ప్రధాన ఆహార పంటలకు సంబంధించి పోషకాలు ఏ స్థాయిలో లభ్యమవుతుందన్నదీ భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ICAR) పున:పరిశీలించాల్సిన అవసరం ఉందని రిసెర్చర్లు అభిప్రాయపడ్డరు. అయితే గత కొన్ని దశాబ్దాల కాలంలో 1400 రకాల వంగడాలను ICAR విడుదల చేసింది. 16 రకాల వరి, 18 రకాల గోధుమ వంగడాలపై మాత్రమే అధ్యయనం జరిగినందున.. ఆ ఫలితాలను దేశంలో పండే అన్ని రకాల వంగడాలకు ఆపాదించలేమని ICAR సీనియర్ సైంటిస్ట్ ఒకరు అభిప్రాయపడ్డారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News