Big Stories

Pulicat Lake : మన కొంగ వెళ్లిపోతోంది..!

Share this post with your friends

Pulicat Lake

Pulicat Lake : అది ఒక సాధారణమైన సరస్సు. అంతేనా.. ఎంతో నమ్మకంగా వేలమైళ్ల దూరంలోని విదేశాల నుంచి వలస వచ్చే పక్షులను అక్కున చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చే వెచ్చని విడిది. శీతాకాలమంతా తన వెచ్చని ఒడిలో జత కట్టి.. నాలుగు నెలల తర్వాత తమ పిల్లలతో కలిసి తిరిగెళ్లిపోతుంటే విదేశం పోయే బిడ్డను చూసి కన్నీరు పెట్టే తల్లిగా మారుతుంది. అదే మన ప్రళయ కావేరి సరస్సు. తమిళులేమో దీనిని పులియకావేరి అంటారు. బ్రిటిషర్లు మాత్రం నోరు తిరగక.. పులికాట్ అన్నారు. నాటి నుంచి దానిపేరు అలాగే ఉండిపోయింది.

పులికాట్ సరస్సు బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉంటుంది. దేశంలో రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఇదే. నేటి చిత్తూరు జిల్లాలోని వాకాడు మండలం రాయదొరువు, శ్రీహరికోట సమీపంలోని కొండూరుపాళెం, తమిళనాడు రాష్ట్రంలోని పల్వర్ కాడ్ లలో ఈ సరస్సు ముఖ ద్వారాలుంటాయి. ఈ ముఖద్వారాల ద్వారా సముద్రపునీరు పులికాట్ సరస్సులోకి చేరుతుంది. ఆటుపోటుల సమయంలో వచ్చి చేరే ఉప్పునీరు, కాళంగినది, స్వర్ణముఖి నది, పాముల కాలువ, నెర్రికాలువల ద్వారా వచ్చే మంచినీరు.. పులికాట్ సరస్సుకు చేరుతూ ఉంటుంది.

పులికాట్ సరస్సు విస్తీర్ణం.. 650 చదరపు కిలోమీటర్లు. 60 కిలోమీటర్ల పొడవు, ప్రదేశాన్ని బట్టి 0.2 నుండి 17.5 కిలోమీటర్ల వెడల్పు ఉంది. ఈ సరస్సు వానాకాలంలో మరిన్ని చదరపు కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. చిత్తూరుజిల్లాలో శ్రీ కాళహస్తికి 27 కి.మీ. దూరంలో ఉంటుంది. Periplus of the Erythraean Sea అనే గ్రంథం పులికాట్‌ను భారతదేశ తూర్పు తీరం వెంట ఉన్న మూడు ఓడరేవుల్లో ఒకటిగా పేర్కొనగా, రెండవ శతాబ్దంలో టాలెమౌసీ పొందుపరిచిన ఓడరేవుల జాబితాలో ఇది కూడా ఉంది.

ఈ సరస్సులో ఇరవైకి పైగా దీవులున్నాయి. ఉప్పు నీరు మంచినీరు కలిసే ఈ పులికాట్ సరస్సులో మత్స్యసంపద బాగా అభివృద్ధి చెందటంతో 85 వేల మంది మత్స్యకారులకు ఇది నమ్మకమైన ఉపాధి కేంద్రంగా నిలిచేది. ఒకప్పుడు.. అక్టోబర్ నెల వచ్చిందంటే.. పులికాట్ ఓ కొత్త రంగుల లోకాన్ని తలపించేది. ఎటు చూసినా చిత్రవిచిత్రమైన రంగుల కోలాహాలమే. వేర్వేరు సైజుల పక్షుల వచ్చి, సరైన తావును ఎంచుకుని, గూళ్లు కట్టుకుని, జతకూడి గుడ్లుపెట్టి, వాటిని పొదిగి తిరిగి పిల్లలతో కలిసి వేసవి నాటికి వెళ్లిపోయేవి. ఈ పక్షులు పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా… అవి విసర్జించే మలం.. బలమైన ఎరువుగా మారి ఇక్కడి నేలను సారవంతం చేసేది.

వందల ఏళ్లపాటు ఇది వేలాది పక్షులకు పుట్టినిల్లుగా నిలిచింది. ఎంతదూరమైనా.. ఆడపిల్ల పుట్టింట్లోనే పురుడు పోసుకున్నట్లుగా ఆఫ్రికా, సైబీరియా, మలేషియా, బర్మా, బంగ్లాదేశ్, కజికిస్థాన్, పాకిస్థాన్, జమ్మూ-కాశ్మీర్ ప్రాంతాల నుంచి ఫ్లెమింగో, పెలికాన్, ఎర్రకాళ్ళ కొంగలు, నత్తగుల్ల కొంగలు, నారాయణ పక్షులు, తెడ్డుముక్కు కొంగలు, షావలర్ పక్షులు, వంటి అరుదైన నూటయాభై రకాల పక్షులు 6 నెలల పాటు పులికాట్లో విడిది చేసేవి. వీటి అందాలను తమ కెమెరాల్లో బంధించేందుకు వందల మంది ఫోటో జర్నలిస్టులు ఇక్కడ రోజుల తరబడి మకాం వేసేవారు.

కానీ.. ఇప్పుడు ఇదంతా గతం మాత్రమే. సరస్సులోకి నీరు ప్రవేశించే నదీ ముఖ ద్వారాలన్నీ పూడిక కారణంగా మూసుకుపోయి.. సరస్సులోకి వచ్చే నీరు తగ్గిపోయింది. మరోవైపు అక్రమార్కులు మడ అడవులను నాశనం చేయటం, అనుమతుల్లేకుండా రొయ్యల చెరువులు తవ్వటంతో సరస్సు తన వాస్తవ రూపాన్ని కోల్పోయింది. దీంతోబాటే అక్కడి పచ్చదనం తగ్గి, పక్షులకు ఆహారం దొరకటం లేదు. సమీపంలోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగకేంద్రం కారణంగా.. శబ్దకాలుష్యం పెరిగి పక్షులు రావటం తగ్గించేశాయి.

సుమారు 155 రకాల పక్షులు వచ్చే ఈ సరస్సు వద్ద ఈ డిసెంబరు తొలివారానికి కేవలం పాతిక ముప్ఫై రకాల పక్షులే వచ్చాయంటే పరిస్థితి ఎంత మారిందో తెలుస్తోంది. మరోవైపు కేంద్రం తన నిధులతో.. పునరుద్ధరణకు సిద్ధమైనా రాష్ట్ర ప్రభుత్వం అందుకు చొరవ చూపకపోవటంతో ఎలాంటి అభివృద్ధీ జరగలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మన కొంగ మరెప్పటికీ తిరిగి రాదేమో అనిపిస్తోందని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News