Big Stories

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BRS Dark Secrets | గత ప్రభుత్వం ఇప్పటిదాకా ఇచ్చిన జీవోలను ఇప్పుడు వెలుగులోకి తీసుకురావడం సాధ్యమేనా? పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా ఉన్నవి ధ్వంసం కాకుండా ఉన్నాయా? ప్రపంచమంతా టెక్నాలజీని వాడుకుంటే.. గత కేసీఆర్ సర్కార్ మాత్రం ఆఫ్ లైన్ కే మొగ్గు చూపడం చాలా సందేహాలకు తావు ఇస్తోంది. ఫిజికల్ ఫైల్స్ తో అంతా మాయ చేయొచ్చన్న ఉద్దేశంతోనే ఆఫ్ లైన్ పాలన కొనసాగించారన్న విమర్శలు పెరుగుతున్నాయి.

- Advertisement -

ఇటు ప్రభుత్వం మారగానే.. అటు ఫైల్స్ మాయం చేసే పని.. అవును ఫిజికల్స్ ఫైల్స్ ఉంటే ఎలా మాయ చేయొచ్చో ఈ దృశ్యాలే నిదర్శనం. కొత్త సర్కారు కొలువుతీరుతుంటే ఇంకోవైపు ఇలా ఫైల్స్ మాయం చేయడం లేదంటే ధ్వంసం అవడం వంటి పనులు జరిగాయి. ఈ మూడు ఘటనలూ అనుమానాస్పదంగానే మిగిలిపోయాయి. వీటిపై ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతోంది. పశుసంవర్దక శాఖలో ఎందుకు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి.. ఫైల్స్ మాయం చేయాల్సిన పరిస్థితి ఎదురైందన్నది తేలాల్సి ఉంది. ఎగ్జిట్ పోల్స్ రిలీజైన రోజునే.. పర్యాటక శాఖలో కంప్యూటర్లు, ఫైల్స్ కాలిపోయాయి. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది.. ఇది కూడా విచారణలో ఉంది. అటు విద్యాశాఖ నుంచి ఫైల్స్ తీసుకెళ్లేందుకు ఆటో తీసుకొచ్చి మరీ చేసిన ప్రయత్నం అందరి కళ్ల ముందు ఉంది. ఇవన్నీ బయటకు కనిపించిన ఉదాహరణలు మాత్రమే. కనిపించనివి ఎన్నో ఉన్నాయన్న విమర్శలున్నాయి.

- Advertisement -

గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది.. పాలన ఎలా సాగింది.. ఏ నిధులు ఎటు వెళ్లాయి.. ఏ పనికి ఎంత ఖర్చయింది.. ఎవరెవరికి కేటాయింపులు చేశారు.. టెండర్ల సంగతేంటి.. ఇవన్నీ తెలియాలంటే జీవోలే కీలకం. జీవోల కోసం సెక్షన్ లలో ఆఫీసర్స్ 3 రకాల రిజిస్టర్స్ మెయింటేన్ చేస్తుంటారు. వాటిని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ఇప్పుడు ఫిజికల్ రిజిస్టర్స్ పరిస్థితి ఏంటన్నది తేలాల్సి ఉంది. సమస్య ఉన్న వారు బయటికొస్తేనే అసలు సీన్ తెలుస్తుందంటున్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకత సుపరిపాలనకు రెండు కళ్లు. కానీ రహస్య జీవోలతో మొదటికే మోసం వస్తున్న పరిస్థితి ఉంది. ప్రజల ముందు ఏదో దాచడానికి చేసే ప్రయత్నంగానే చూస్తున్నారు. ప్రభుత్వ సమాచారం జనం తెలుసుకునే హక్కు ప్రజాస్వామ్యానికి సంజీవిని. గత ప్రభుత్వ హయాంలో అదే లేకుండా పోయింది. జీవోలు సీక్రెట్ గా ఉండడం వల్ల ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి పెరగడానికి కారణమౌతుందన్న వాదన కూడా ఉంది. ప్రభుత్వం అంటే దేశ, రాష్ట్ర భద్రతకు సంబంధించినవి మినహా మిగితా ప్రతి నిర్ణయాలన్నీ ఓపెన్‌గా ఉండాలి. ప్రజల డబ్బుతో పాలన చేస్తున్నప్పుడు ప్రజలకు జవాబుదారీగా ఉండటం ప్రభుత్వ బాధ్యత. జీవోలు జనానికి మరింత సులువుగా అందుబాటులోకి వచ్చేలా టెక్నాలజీ పెంచాల్సింది పోయి.. పూర్తిగా పక్కన పెట్టడమే సందేహాలకు కారణమవుతున్న విషయం.

సమాచారహక్కు చట్టం సెక్షన్‌–4 ప్రకారం ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు సులభంగా లభ్యమయ్యే విధంగా అందుబాటులో ఉంచి తీరాలి. కానీ సమస్యలు వస్తాయనుకున్న జీవోలను బ్లాంక్ చేయడం పెరిగింది. ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచడానికున్న ఇబ్బంది ఏమిటని తెలంగాణ హైకోర్టు కూడా గతంలో ప్రశ్నించిన సందర్భం ఉంది. జీఓల ద్వారా ప్రజలకు సమాచారం తెలియచేయాల్సిన మొదటి భాధ్యత ప్రభుత్వాలదే. సమాచారాన్ని పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలనే ఆర్టీఐ చట్టం రూల్స్ ను దృష్టిలో పెట్టుకుని పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ 2012 మార్చిలో నాటి యూపీఏ ప్రభుత్వం.. నేషనల్ డేటా షేరింగ్ అండ్ యాక్సెసిబిలిటీ పాలసీ – NDSAPని తీసుకొచ్చింది. అంతటి పారదర్శకతను గత కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినా.. ఆ తర్వాతి కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది.

నిజానికి కోర్టులు కూడా తమ తీర్పులను ఆన్‌లైన్‌లో ఉంచుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లు, ఇతర నోటిఫికేషన్‌లు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. అలాంటప్పుడు ప్రభుత్వ జీఓలు ఉంచితే నష్టం ఏంటన్నది క్వశ్చన్ మార్క్. కొన్ని జీఓలను కాన్ఫిడెన్షియల్, మరికొన్ని బ్లాంక్‌గా పేర్కొంటూ వెబ్‌సైట్‌లో పెట్టడం లేదు. చీకటి పాలనకు కారణాలు ఏంటన్నది తేలాలి.

మరోవైపు E – ఆఫీస్ విధానం కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది. ఆ తర్వాత ఇది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసుకున్నాయి. కానీ తెలంగాణ సర్కార్ మాత్రం దీన్ని పక్కన పెట్టింది. కేవలం కరోనా లాక్ డౌన్ టైంలో మాత్రమే ఈ – ఆఫీస్ విధానాన్ని వాడారు. ఆ తర్వాత పక్కన పెట్టేశారు. గతంలో ప్రభుత్వ జీవోలను వెబ్ సైట్ నుంచి తీసుకుని ఉద్యమాలు చేసిన సందర్భాలున్నాయి. కానీ ఇన్నాళ్లూ సీక్రెట్ గా ఉండడంతో ప్రశ్నించడానికి వీలు లేకుండా పరిస్థితి తీసుకొచ్చారు. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్. ఇందులో విషయాలను ఎందుకు దాచాల్సి వస్తోంది? ఏదో మతలబు ఉండడంతోనే మాయాజాలం చేశారా అన్న ప్రశ్నలు ఉన్నాయి.

ఆర్టీఐ చట్టం సెక్షన్ 4…, క్లాజ్ 1, క్లాజ్ 2 ప్రకారం ప్రతి సమాచారాన్ని అందుబాటులో ఉంచాలన్నది. భద్రతకు సంబంధించి తప్ప మిగితావన్నీ ప్రజలకు సంబంధించినవి పబ్లిక్ ముందు పెట్టాల్సిందే.. చట్ట ప్రకారం అధికారులు బాధ్యులు, ఆ తర్వాత ప్రజాప్రతినిధులు బాధ్యులవుతారు. ఓఎస్డీలు, వివిధ శాఖల చీఫ్ సెక్రెటరీలు, మాజీ సీఎం ఇలా అందరూ బాధ్యులే అని, ఐపీసీ 420, 417, 406, 409, 120 బీ ప్రకారం నేరమే అని సీనియర్ న్యాయవాదులు అంటున్నారు.

గత ప్రభుత్వ హయాంలో బ్లాంక్ లో పెట్టిన జీవోల్లో ఉన్న మాయాజాలమేంటో బయటకు రావాల్సి ఉంది. ఫిజికల్ ఫైల్స్ కు మంగళం పాడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ ఫిజికల్ ఫైల్స్ ట్యాంపర్ కాకుండా చూసుకోవడం కూడా ఇప్పుడు సవాల్ గా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News