Big Stories

Robbery in Ex Minister office | మాజీ మంత్రుల ఆఫీసుల నుంచి ఫర్నీచర్ చోరీ.. ఫైళ్లు చోరీ.. ఆ ఫైళ్లలో ఏ అక్రమాలున్నాయ్?

Share this post with your friends

Robbery in Ex Minister office | అంతా ఒక బిజీలో ఉంటే.. మాజీ అమాత్యుల పీఏలు, ఓస్డీలు, అటెండర్లు ఇంకో పనిలో బిజీగా ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఇలా మారిందో లేదు.. అలా పాత మంత్రుల పేషీల్లో రకరకాల కథలు నడిచాయి. కీలక ఫైళ్లను చించడం, కాల్చేయడం… మాయం చేయడం.. ఇలాంటివి తెరపైకి వచ్చాయి. అయితే వాచ్ మెన్లు చూసినవి కొన్నే. ఇంకా బయటకు రాని ఘటనలు చాలానే ఉన్నాయా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఎందుకు మాజీ మంత్రులు ఇంతలా భయపడుతున్నారు?

పదేళ్లు అధికారంలో ఉన్నారు.. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది. గత మంత్రులు చాలా మంది ఓడిపోయారు కూడా. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలా ప్రభుత్వాలు మారినప్పుడు పాత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు ఎంత హుందాగా వ్యవహరించాలి? ఎంత బాధ్యతగా పెండింగ్ ఫైల్స్.. కీలక నిర్ణయాలకు సంబంధించిన ఫైల్స్ అప్పగించాలి… కానీ ఇప్పుడు తెలంగాణలో అదే జరగలేదు. ఇందుకు నిదర్శనంగా వరసుగా మాజీ మంత్రుల పేషీలు, క్యాంప్ ఆఫీసుల్లో జరిగిన ఘటనలే ఇందుకు కారణం. పైగా అవన్నీ చాలా అనుమానాలు రేకెత్తించేవిగా ఉన్నాయి.

ఏ తప్పూ చేయకపోతే ఫైల్స్ మాయం చేయాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. ఈసారి కూడా తమ ప్రభుత్వమే వస్తుందని గట్టిగా నమ్మారో ఏమో గానీ.. తీరా రిజల్ట్ వచ్చాక షేక్ అయ్యారు. కీలక అంశాలకు సంబంధించిన ఫైల్స్ అలాగే కొత్త మంత్రుల దగ్గరికి వెళ్తే బండారం బయటపడుతుందనుకున్నారో ఏమో గానీ… ఓవైపు కొత్త ప్రభుత్వంలో సీఎం మంత్రులు ప్రమాణస్వీకారాలు చేస్తుంటే.. ఇంకోవైపు పేషీల్లో పలువురు మంత్రుల సిబ్బంది చేతివాటం చూపించే పని పెట్టుకున్నారు. ఒక్క సారి ఈ సీన్లు చూడండి… ఇది హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో ఉన్న పశుసంవర్దక శాఖ ఆఫీస్. ఫైల్స్ ఎలా చిందరవందరగా మారాయో.. చూడండి… సీసీ ఫుటేజ్ కూడా ధ్వంసం చేశారు…. ఎవిడెన్సులు ట్యాంపర్ చేశారు… మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కల్యాణ్‌ ఆఫీస్‌లో ఉన్న ఫైల్స్ మాయమయ్యాయి. కిటికీల గ్రిల్స్ తొలగించి ఫైల్స్‌ ను ఎత్తుకెళ్లారని చెబుతున్నారు. దుండగులు ఎత్తుకెళ్లిన ఫైల్స్ లో చాలా కీలకమైనవి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వాచ్ మెన్ ఫిర్యాదు ఆధారంగా తలసాని ఓఎస్డీ కళ్యాణ్ పై కేసు నమోదు చేశారు. గొర్రెల పంపిణీ స్కీం వ్యవహారంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం వాటిపై విచారణ జరిపి ఫైళ్లను బయటకు తీస్తే.. అవినీతి బాగోతం బయటపడుతుందనే ఫైళ్లను చించేశారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు.

ఇంకోవైపు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఇదిగో ఇలా తెలంగాణ పర్యాటకశాఖ ప్రధాన కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రికి రాత్రి మంటలు చెలరేగాయి. కంప్యూటర్లు కాలిపోయాయి. కీలకమైన ఫైల్స్ ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఇది కావాలనే చేసిందని అప్పట్లోనే చాలా మంది నేతలు గరంగరం అయ్యారు. ఈ ఘటనపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. ప్రభుత్వం మారడం ఖాయమని తేలిన తర్వాత కీలక ఆధారాలను చెరిపేసే పనిలో భాగమే అన్న వాదన తెరపైకి వచ్చింది. గతంలో పర్యాటకశాఖ మంత్రిగా ఉన్న శ్రీనివాస్‌గౌడ్‌ నిర్ణయాలపై పలు వివాదాలు, అలాగే గతంలో టూరిజం శాఖ ఛైర్మన్‌గా పనిచేసిన శ్రీనివాస గుప్తా పైనా పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అగ్ని ప్రమాదం జరగడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.

ఇది మరో సీన్… బషీర్‌బాగ్‌ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థలో ఫైల్స్ ను తరలించే పనిని ఇద్దరు వ్యక్తులు భుజానికెత్తుకున్నారు. ఇక్కడే మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చాంబర్ కూడా ఉండేది. రాత్రి వేళ వారు బైక్ పై వచ్చారు.. అనుమానాస్పదంగా కనిపించడంతో రోడ్డుపై ఉన్న స్థానికులు నిలదీశారు. వెంటనే మీడియా అక్కడికి చేరుకుంది. దీంతో వెంటనే వారు జవాబు చెప్పలేక అక్కడి నుంచి ఉడాయించారు. వెంట తెచ్చుకున్న ఆటోను వదిలేసి పరారయ్యారు. పోలీసులు పట్టుకుని విచారణ చేశారు. సచివాలయానికి చేరని ఫైల్స్ ను చేరవేస్తున్నట్లు పోలీసుల విచారణలో చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వివిధ శాఖల్లోని కీలక ఫైళ్లను కొందరు అధికారులు మాయం చేస్తున్నారు. మరికొందరు ఫర్నీచర్ ​తో పాటు ఫైళ్లను తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇలాంటి ఘటనలు పాత సర్కార్ పాలనపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే.. పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. గతంలో ప్రభుత్వాలు మారినప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదని, ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ ఫైళ్లు, కంప్యూటర్లలో ఏం దాగుందన్న చర్చ మొదలైంది. భారీ ఎత్తున అవినీతి జరగడంతోనే ఇలా చేస్తున్నారా అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రవీంద్రభారతి నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీస్​ లోని ఫర్నీచర్ ​ను టీజీవో వాళ్లు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా ఓయూ విద్యార్థి నేతలు అడ్డుకున్నారు. అయితే, అవి ప్రభుత్వ ఆస్తులని తమకు తెలియదంటూ తర్వాత టీజీవో సంఘం నేతలు ప్రకటించారు. ఆ ఫర్నీచర్ ​ను తిరిగి ఆఫీసులో పెట్టేశారు. వివిధ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల్లోని ఫర్నీచర్​ నూ మాయం చేసే ప్రయత్నాలు జరిగాయి. ఈ అంశంపై అలర్ట్ అయిన సీఎస్ శాంతి కుమారి.. ఒక్క కాగితం కూడా సెక్రటేరియట్ నుంచి బయటకు వెళ్లకూడదని అన్ని శాఖలకూ ఆదేశాలు ఇచ్చారు.

ఎన్నికల్లో ఓడిపోయినా.. క్యాంప్ ఆఫీసులు ఖాళీ చేయాల్సి వచ్చినా.. ప్రభుత్వ సొమ్ముతో కొన్న వస్తువులను అలాగే అప్పగించాలి. కానీ బీఆర్ఎస్ లో కొందరు మాజీలు కొత్త సంప్రదాయానికి తెరలేపారు. ఫర్నిచర్ సహా విలువైన సామన్లను తరలించే పని పెట్టుకుని అడ్డంగా బుక్కవుతున్నారు కూడా. బోధన్ లో మాజీ ఎమ్మెల్యే షకీల్ క్యాంప్ ఆఫీస్ లో ఫర్నిచర్, విలువైన సామాగ్రిని రెండు డీసీఎంల్లో తరలిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.

అటు మంచిర్యాల జిల్లా చెన్నూరులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ క్యాంప్ ఆఫీస్ లో సామాన్ల తరలింపు గుట్టుగా పూర్తి చేశారు. క్యాంప్ ఆఫీస్ ఉన్న తాళాలు పగులగొట్టి మరీ తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు కంప్లైంట్ అందింది.

కొందరైతే ఓడిపోయినా క్యాంప్ ఆఫీసులను ఖాళీ చేయలేకపోతున్నారు. ఇవి బయటకు వచ్చిన కొన్ని ఘటనలు మాత్రమే. బయటకి రాకుండా గుట్టుగా తరలించిన వాటి సంగతేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే సర్కార్ ఇలాంటి ఘటనపై సీరియస్ గా ఉంది. ఫైల్స్ మాయం చేసిన వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News