Big Stories

Caste Discrimination IN IIT : ఐఐటి, ఐఐఎంలలో కుల వివక్ష.. అందుకే వేలమంది విద్యార్థులు చదువుమానేశారా?

Share this post with your friends

Caste Discrimination IN IIT : గత అయిదేళ్ల కాలంలో(జూలై 2023) కేంద్ర విద్యా సంస్థలలో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తున్న 34,035 మంది విద్యార్థులు చదువు మానేశారని రాజ్యసభలో బుధవారం కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీరిలో ఎక్కువగా సెంట్రల్ యూనివర్సిటీల నుంచి 17,454 మంది విద్యార్థులు చదువు మానేశారు.

మరింత ఆందోళన కలిగించే విషయమేమిటంటే.. ఈ 17,454 మంది విద్యార్థుల్లో 13,626 మంది దళిత(SC), ఆదివాసి(ST), బిసి(OBC) విద్యార్థులున్నారు. అంటే సగటున ప్రతిరోజు 7 మంది విద్యార్థులు చదువుమానేస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐటి, ఐఐఎం లాంటి విద్యా సంస్థల్లో సీటు రావడమే అద‌ృష్టంగా అందరూ భావిస్తారు. అలాంటిది ఆ విద్యా సంస్థల నుంచి ఇంత మంది విద్యార్థులు ముఖ్యంగా వెనెకబడిన వర్గాల విద్యార్థులు చదువు మానేయడం చాలా ఆందోళన కలిగించే విషయం.

2019 నుంచి 2023 గణాంకాల ప్రకారం..2424 మంది దళిత, 2622 ఆదివాసి, 4596 బిసి స్టూడెంట్స్ చదువు మధ్యలోనే మానేశారు. కేంద్ర విద్యా సంస్థల్లో అత్యధికంగా ఐఐటి నుంచి 8139 మంది, ఐఐఎం నుంచి 858 మంది చదువు మానేశారు.

రెండు రోజుల క్రితమే బహుజన్ సమాజ్ వాది పార్టీ ఎంపీ రితేష్ పాండే ఈ విషయాన్ని లోక్ సభలో ప్రశ్నించారు. ఇంతమంది విద్యార్థులు చదువుమానేయడానికి కారణం ఏమిటని అడిగారు. దానికి సమాధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి సుభాస్ సర్కార్ చాలా సింపుల్ సమాధానం చెప్పారు. చాలా మంది విద్యార్థులు ఒక కోర్సు నుంచి మరో కోర్సుకు, ఒక యూనివర్సటీ నుంచి మరో యూనివర్సిటీకి మారుతున్నారని చెప్పారు. మరికొందరు వ్యక్తిగత కారణాలతో చదువు మానేస్తున్నారని జవాబిచ్చారు.

జూలై డేటా ప్రకారం.. 77 మంది విద్యార్థులు కేంద్ర విద్యా సంస్థల్లో ఆత్యహత్య చేసుకున్నారు. ముఖ్యంగా ఐఐటి సంస్థల్లోనే ఎక్కువ మంది చనిపోయారు. వీరిలో ఎక్కువగా వెనకుబడిన వర్గాలు, గ్రామీణ నేపథ్యం కలవారే. విచిత్రమేమిటంటే ఐఐటి సంస్థల్లో 70 శాతంపైగా రిజర్వేషన్ ఉంది. ఈ రిజర్వేషన్ SC,ST,BC,EWS(ఆర్థికంగా వెనుకబడిన వర్గం), మైనారిటీ లకు ఉంది.

2021 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తెలిపిన వివరాల ప్రకారం.. కేంద్రం విద్యా సంస్థలైన ఐఐటి, ఎన్ఐటి, సెంట్రల్ యూనివర్సటి, ఐఐఎం సంస్థల్లో మొత్తం 122 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ గణాంకాలు 2014 నుంచి 2021 సంవత్సరం మధ్య కాలంలో తీసుకున్నవి. ఈ 122 ఆత్మహత్యలలో 58 శాతం మంది రిజర్వేషన్ కేటగరీ అంటే SC,ST,OBC,మైనారిటీ లకు చెందినవారే.

అయితే ఇటీవల ఐఐటి, ఐఐఎంలలో ఈ వెనుకబడిన వర్గాల విద్యార్థులు వేధింపులకు గురవుతున్నారని.. వీరంతా కుల వివక్ష ఎదుర్కొంటున్నారని తెలిసింది. ఈ పరిస్థితుల్లో చాలామంది మానేస్తుంటే.. కొంత మంది ఇంత పెద్ద విద్యాసంస్థల్లో సీటు వదులుకోలేక, తిరిగి ఇంటికి పోలేక, వివక్ష, వేధింపులు గురవుతూ ఆత్మహత్య చేసుకుంటున్నారు.

ఈ దుర్ఘటనల గురించి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని బర్కతుల్లా యూనివర్సటీకి చెందిన ప్రొఫెసర్ సంజీవ్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. SC,ST కుటుంబాలకు చెందిన విద్యార్థులు, పేదరికం నుంచి వచ్చినవారు. వారికి ధనిక కుటుంబాల పిల్లలాగా వ్యవహరించడం తెలియదు. దీంతో వారు హేళన గురవుతున్నారు అని చెప్పారు. “వెనుకబడిన వర్గాలు, గ్రామీణ విద్యార్థులకు ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. ఇది వారిలో ఆత్మనూన్యతను పెంచుతోంది. ఐఐటి, ఐఐఎం విద్యాసంస్థల్లో ఇంగ్లీష్ మాట్లాడే వాతావరణం ఉంటుంది. ఆ వాతావరణంలో ఇమడలేక, హేళనకు గురువతో చాలా మంది చదువు మధ్యలోనే మానేస్తున్నారు. మరికొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు,” అని అభిప్రాయపడ్డారు.

ఇటీవలే నవంబర్ నెలలో సుప్రీం కోర్టు విద్యార్థుల ఆత్మహత్యల విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. వెనుకబడిన వర్గాల విద్యార్థుల మరణాలపై కేంద్ర ప్రభుత్వం చర్యలెందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. యూనివర్సటి గ్రాంట్స్ కమిషన్ (UGC) కూడా ఈ సమస్యపై అప్రమత్తమైంది. SC,ST,OBC,మైనారిటీ లకు చెందిన విద్యార్థులకోసం ఉన్నత విద్యా సంస్థల్లో ఒక ప్యానెల్ ఏర్పటు చేసింది. ఆయా విద్యా సంస్థల్లో విద్యార్థులు వివక్షకు గురికాకుండా ఈ ప్యానెల్ చర్యలు తీసుకుంటుందని యుజిసి అధికారులు తెలిపారు.

భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 76 సంవత్సరాలైంది. ఈ కాలంలో మిగతా దేశాలు ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాయి. కానీ మన దేశంలో మాత్రం.. ఉన్నత విద్యా సంస్థల్లో కూడా ఇంకా కుల వివక్ష జరుగుతోంది. 21వ శతాబ్దంలో కూడా ఇంకా జాత్యాహంకారం, కులవివక్ష ఉందంటే.. దానికి ప్రధాన కారణం మనుషులు సంకుచిత ఆలోచనా ధోరణి. రాజ్యాంగం దృష్టిలో ప్రజలందరూ సమానమే అయినా.. ఇంకా దేశంలో మార్పు పూర్తిగా రాలేదని చెప్పడానికి ఈ ఆత్మహత్యలే ఉదాహరణ.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News