Big Stories

Uyyalawada Narasimha Reddy : సీమ ముద్దుబిడ్డ.. ఉయ్యాలవాడ..!

Uyyalawada Narasimha Reddy Death Anniversary : భారత స్వాతంత్ర పోరాటానికి ఒక ప్రాతిపదికను ఏర్పరచిన నాటి యోధుల్లో ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి ముఖ్యులు. నేటి కోవెలకుంట్ల ప్రాంతంలో జన్మించిన మహావీరుడు.. బ్రిటిషర్ల పెత్తనాన్ని సవాలు చేసిన తొలి తెలుగు వీరుల్లో ఒకడిగా చరిత్రకెక్కాడు. నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఆ మహావీరుడి జీవిత విశేషాలను స్మరించుకుందాం.

- Advertisement -

విజయనగర పాలకుల కాలంలో నేటి రాయల సీమ అంతా పాలెగాళ్ల పెత్తనంలో ఉండేది. వీరంతా విజయనగర పాలకుల సామంతులుగా ఉంటూ ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి రాజుకు చెల్లించటమే గాక యుద్ధాల వేళ.. తమ 30 వేల సైన్యంతో రాజులకు అండగా నిలిచేవారు. దీనికి ప్రతిఫలంగా స్థానికంగా పాలన అంతా వీరి చేతిలోనే నాటి పాలకులు వదిలిపెట్టారు. అయితే.. బ్రిటిష్ గవర్నర్ జనరల్ వెలస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతికి తలొగ్గిన నైజాం రాజు సంధి షరతులతో భాగంగా రాయలసీమను 1800లో ఆంగ్లేయులకు ధారాదత్తం చేశాడు.

- Advertisement -

Read More : మరువలేని మహా వీరుడు.. ఛత్రపతి శివాజీ!

దీంతో రాయలసీమ తెల్లదొరల పాలన కిందికి రావటం, వారు అక్కడ రైతువారీ విధానాన్ని అమలు చేసి, నేరుగా పన్నులు వసూలు చేయటంతో సీమలోని భూమి, పాలన, సైన్యం మీద పాలెగాళ్ల పెత్తనం పట్టుతప్పిపోవటం మొదలైంది. నాటి కలెక్టర్ థామస్ మన్రో ఈ మార్పును నిరసించిన యాదర్కొండ పాలెగాడు.. ముద్దు రామప్ప నాయనను 1804లో బ్రిటిష్ పాలకులు ఉరి తీయటంతో పాలెగాళ్లంతా తెల్లవారికి ఎదురుతిరగటం ప్రారంభించారు. ఈ పరిణామం ఉద్రిక్తతలకు దారితీయటంతో నాటి బ్రిటిష్ ఉన్నతాధికారులు కలెక్టర్ పదవి నుంచి మన్రోను తప్పించాల్సి వచ్చింది.

ఆ సమయంలో కర్నూలు జిల్లా కోవెలకుంట్ల రేనాటి ప్రాంతంలోని నర్సంకోట ప్రధాన కేంద్రంగా నర్సింహారెడ్డి ప్రాంతీయ పాలకుడిగా ఉండేవాడు. తండ్రి జయరామిరెడ్డి నుంచి నర్సింహారెడ్డికి ఆ పాలనా బాధ్యత వారసత్వంగా సంక్రమించింది. ఒకరోజు శిస్తుగా వచ్చిన సొమ్మును కోవెలకుంట్ల తహసీల్దార్ రాఘవాచారికి కట్టి తనకు రావాల్సిన గౌరవ వేతనం తీసుకురమ్మని తన మనిషిని పంపాడు. ఆ తహసీల్దార్.. ‘నరసింహారెడ్డే మా సేవకుడు. ఆయనకు మరొక సేవకుడు అవసరమా’ అన్నట్లు ఆ పంపిన మనిషిని తహసీల్దార్ అవమానించాడు. అంతేగాక.. నరసింహారెడ్డి స్వయంగా కార్యాలయానికి వస్తేనే వేతనం ఇస్తామని ఆదేశించాడు. అతడు తిరిగివచ్చి జరిగినదంతా చెప్పగా.. మండిపడిన నరసింహారెడ్డి.. ‘వెళ్లి ఆ చెల్లించిన పన్ను కూడా వెనక్కి తీసుకురా. ఇవ్వకపోతే ఆ తహసీల్దార్ తల నరుకుతామని మా మాటగా చెప్పు’ అని తన మనిషిని మళ్లీ తహసీల్దార్ వద్దకు పంపాడు.

Read More : ఆధ్యాత్మిక సముద్రం.. శ్రీ రామకృష్ణులు..

దీంతో భయపడిన తహసీల్దార్ తన కార్యాలయానికి పోలీసు కాపలాగా పెట్టుకున్నాడు. కానీ.. నరసింహారెడ్డి తన సైన్యంతో ఆ కార్యాలయంపై దాడి చేసి ఖజానాలోని సొమ్మునంతా కొల్లగొట్టాడు. దీంతో బ్రిటిషర్లతో తాడోపేడో తేల్చుకునేందుకు పాలెగాడు ఉయ్యాల నరసింహారెడ్డి 5 వేల సేనలతో 1842లో బ్రిటీష్ వారిపై గెరిల్లా పోరుకు దిగాడు. ఈ విషయం తెలుసుకున్న నాటి కలెక్టర్ కాక్రేన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా వాట్స్ అనే సైన్యాధికారి సుమారు 200 మంది సైన్యంతో ఆయన నివాసం మీద దాడి చేసి, దానిని నేలమట్టం చేశారు. అప్పటికే మరోచోటకి చేరిన నరసింహారెడ్డిని చంపినా లేదా పట్టించినా 1000 దినారాల బహుమతిని ఆ అధికారి ప్రకటించాడు.

తర్వాత సంజామల మండలం రామభద్రుని పల్లె సమీపంలోని జగన్నాథ కొండపై ఉన్న దేవాలయ స్థావరంలో ఉన్న నరసింహారెడ్డిని ఆయన సైన్యాన్ని 1847లో ప్రాణాలతో పట్టుకున్నారు. నాటి ప్రభుత్వం ఆయనను ‘దోపిడీ దొంగ’ అంటూ అభియోగాలు మోపి కోవెలకుంట్ల సమీపంలోని జుర్రేరు ఒడ్డున ఉరిశిక్ష అమలు జరిపింది. ఆ ప్రాంతంలో మరెవరో పోరుబాట పట్టకుండా.. ఆయన తలను నరికి 30 ఏళ్లపాటు కోట గుమ్మానికి వేలాడదీసి ఉంచారు.

అయితే.. ఆయన మరణం ఈ ప్రాంతంలో మరిన్ని పోరాటాలకు దారితీసింది. సరిగ్గా ఆ మహావీరుడు అమరుడైన వందేళ్ళకు మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. వీరుడు ఉయ్యాలవాడ ఉరికంబమెక్కి నేటికి 177 ఏళ్లు. ‘అడుగు వచ్చే. ఇదిగో వచ్చే నరసింహారెడ్డి.. ఫల ఫల ఫల ఫల కేక వేసెరా నరసింహారెడ్డి’ అంటూ నేటికీ ఆయనను సీమ ప్రజలు స్మరించుకుంటూ పాడుకుంటూనే ఉన్నారు. తన ప్రాంత ఆకాంక్షల అణచివేతను నిరసించిన పరాయి పాలకులకు ఎదురొడ్డి పోరాడిన ఆ సీమ ముద్దుబిడ్డ చరిత్ర నేటికీ తెలుగునేల మీద సజీవంగా ఉందంటే ఆయనది ఎంతటి విశిష్ట వ్యక్తిత్వమో అర్థమవుతుంది. ఆ రాయలసీమ మహా యోధుడి వర్థంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News