Big Stories

Ramakrishna Paramahamsa : ఆధ్యాత్మిక సముద్రం.. శ్రీ రామకృష్ణులు..

 Swami Ramakrishna Paramahamsa

Swami Ramakrishna Paramahamsa story : సనాతన ధర్మసాధనా మార్గంలోని సాధనలను అనుసరిస్తూనే పరమాత్మ తత్వాన్ని పామరులకూ పంచిన పరమ యోగీశ్వరుడు.. రామకృష్ణ పరమహంస. తాను అనుభూతి చెందిన వేదాంత సత్యాలను శిష్యులు, భక్తులకూ అనుభవంలోకి తెచ్చిన ఆధ్యాత్మిక శక్తి సముద్రంగా ఆయన పేరొందారు. ఆయన జీవిత చరిత్ర చదివి మహాత్మాగాంధీ వంటి ఎందరో ప్రభావితం కాగా, ప్రపంచాన్ని మెప్పించిన వివేకానందులూ ఆయన శిష్యులే. జీవించింది యాభై ఏళ్లే అయినా.. వేల ఏళ్ల చరిత్ర గల సనాతన ఆధ్యాత్మిక మార్గంలో ఒక దీపస్తంభంగా నిలిచిపోయి, నేటికీ వెలుగులు ప్రసరిస్తూనే ఉన్నారు.

- Advertisement -

క్రీ.శ 1836, ఫిబ్రవరి 18న బెంగాల్‌ హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ అనే కుగ్రామంలో నిరుపేద సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు చంద్రమణిదేవి, క్షుదీరామ్. తల్లిదండ్రులు ఈయనకు పెట్టిన పేరు.. గదాధరుడు. చిన్ననాటి నుంచే గదాధరుడికి బొమ్మలు వేయటం, సంగీతం అంటే ఇష్టం. సమయం అంతా వీటిమీద గడుపుతూ, స్నేహితులతో కలిసి తిరుగుతూ ఉండే గధాధరుడికి చదువు మీద గానీ సంపాదన మీద గానీ గురి కుదరలేదు. పూరీకి వెళ్ళే సాధుసంతులంతా వీరి గ్రామం మీదగా నడిచి పోతూ, పొద్దుగూకితే.. అక్కడే బస చేసేవారు. గదాధరుడు సాయంత్రానికి అక్కడికి చేరి.. వారికి సేవలు చేస్తూ వారు తోటి సాధువులతో చేసే చర్చలను వింటూ కాలం గడిపేవాడు. ‘జీవసేవే దైవసేవ’ అంటూ భిక్షగాళ్లకు అన్నం వడ్డించేవారు. ఎంగిలి విస్తళ్లను తీసి, ఆ స్థలాన్ని శుభ్రం చేసేవారు.

- Advertisement -

Reead more: ఎన్నారైలతో భారతీయుల పెళ్లిళ్లు చేస్తున్నారా? ఐతే ఈ కొత్త నిబంధనలు చూడండి..

గదాధరుడికి బాల్యం నుంచీ మనుషులంతా ఒక్కటేననే భావన ప్రబలంగా ఉండేది. ఉపనయనం తర్వాత తన తొలి భిక్షను ఓ శూద్ర యువతి నుంచి తీసుకుని ఆ రోజుల్లోనే సరికొత్త సామాజిక విప్లవానికి బాటలు పరిచారు. దీనిని కుటుంబం, బంధువులు వ్యతిరేకించగా, తాను ఆ యువతికి మాట ఇచ్చాననీ, ఆడి తప్పినవాడు బ్రాహ్మణుడు కాబోడని ప్రశ్నించి వారిని ఒప్పించాడు.

గదాధరుడి అన్నగారైన రామ్ కుమార్ కలకత్తాలో సంస్కృత పాఠశాల నడుపుతూ, పౌరోహిత్యం చేసేవాడు. ఆ రోజుల్లో రాణీ రసమణి అనే మహిళ.. అక్కడి దక్షిణేశ్వరంలో కాళీ మాతకు ఒక ఆలయాన్ని నిర్మించి రామ్‌కుమార్‌ను పురోహితుడుగా నియమించింది. అన్నగారికి సాయంగా రోజూ ఆలయానికి పోయి.. అమ్మవారి అలంకరణలో గదాధరుడు పనిచేసేవాడు. కొన్నాళ్లకు అన్నగారు మరణించటంతో పూజారి బాధ్యతలను గదాధరుడు స్వీకరించాడు.

తొలినాళ్లలో గుడిలో నిజంగా అమ్మవారు ఉన్నారా లేక తాను రాతి విగ్రహాన్ని పూజిస్తున్నానా? అనే అనుమానం ఆయనకు కలిగింది. దీంతో రాత్రీపగలు తేడా లేకుండా అమ్మవారిని ప్రత్యక్షం కమ్మని ఏడుస్తూ ప్రార్థించేవాడు. ఒకరోజు అమ్మవారితో ‘నిజంగా నువ్వు ఉంటే.. ఈ గుడి కట్టించిన రాణిగారి అమ్మాయిలు ఇప్పుడే ఈ గుడిలోని మర్రిచెట్టు వద్దకు వచ్చి నాతో మాట్లాడాలి’ అని ప్రశ్నించాడు. విచిత్రంగా.. కాసేపటికే ఏనాడూ కోట బయట కాలుపెట్టని రాణి గారి అమ్మాయిలు వచ్చి ఈయనను కలిశారు. దీంతో అమ్మవారి మీద గురికుదిరింది. నాటి నుంచి ఆలయంలోని మూర్తిని సజీవ మూర్తిగా భావించి, మనిషికి చేసినట్లే పూజలు, సేవలు చేసేవాడు. ఇదే సమయంలో ఇతర మతాల్లోని రహస్యాలనూ పరిశోధించటం మొదలుపెట్టాడు. ఆ సమయంలోనే తోతాపురి అను నాగా సాధువు గదాధరుడికి అద్వైత జ్ఞానాన్ని బోధించగా, గదాధరుడు.. దానిని సాధన చేస్తూ కేవలం 3 రోజుల్లోనే సమాధి స్థితిని పొందారు. ఈ క్రమంలోనే ఆయనకు కాళీమాత దివ్యసాక్షాత్కారం కలిగింది.

ఇదిలా ఉండగా, గదాధరుడు పిచ్చివాడై పోయాడనే పుకారు ఆయన స్వగ్రామంలో పాకిపోయింది. దీంతో బంధువులంతా గదాధరుడికి పెళ్లి చేస్తే లౌకిక జీవితంలోకి వస్తాడని తల్లికి సలహా ఇచ్చారు. తమ స్వగ్రామానికి 3 మైళ్ల గ్రామంలో ఉన్న జయరాంబాటి గ్రామంలో రామచంద్ర ముఖర్జీ ఇంట్లో శారద అనే బాలిక ఉందని, ఆమే తన భార్య కాగలదని గదాధరుడు చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ మేరకు 5 ఏళ్ళ వయసు గల శారదా దేవి అనే బాలికతో ఆయన వివాహం అయింది. వివాహం తర్వాత ఆయన వైఖరిలో ఏ మార్పూ రాకపోగా, తన ఆధ్యాత్మిక భావనలను ఆమెకూ బోధిస్తూ.. తన శిష్యురాలిగా తీర్చిదిద్దారు. ఆమెను సాక్షాత్తూ అమ్మవారిగా భావించేవాడు.

జ్ఞానం మనుషులను కలుపుతుందని, అజ్ఞానం విడదీస్తుందని ఆయన బోధించారు. భగవంతుని దర్శనం అందరికీ సాధ్యమేననీ, సంసార జీవితంలోని గృహస్తులూ ఆర్తితో, శ్రద్ధగా సాధన చేస్తే పరమాత్మను దర్శించవచ్చని చెప్పేవారు. కామం, అసూయ పరమాత్మ సాక్షాత్కారానికి ప్రధాన శత్రువులని ప్రకటించారు.
ఇనుమును అయస్కాంతం ఆకర్షించే తీరులో భగవంతుడు మనలను సర్వదా ఆకర్షిస్తూనే ఉన్నప్పటికీ.. మోహం అనే మాయ మనల్ని అడ్డగిస్తోంది. దానిని వదిలితే పరమాత్మ అందరికీ దర్శనమిస్తాడు అని చెప్పేవారు. ‘కష్టసుఖాలు, అసూయా ద్వేషాలు, నమ్మకాలు, అపనమ్మకాలన్నీ వస్తూ పోతుంటాయని, వాటిలో ఏదీ శాశ్వతం కాదనీ, వాటికి మనసులో స్థానం ఇవ్వటం అనవసరమని వివరించారు.

తన వద్దకు వచ్చిన నరేంద్రుడిని.. స్వామి వివేకానందగా తీర్చిదిద్ది భవిష్యత్ మార్గ నిర్దేశాన్ని బోధించారు. యాభయ్యవ ఏట కేన్సర్ బారిన పడిన కారణంగా శిష్యులంతా కలిసి ఆయనను దక్షిణేశ్వరం నుండి కాశిపూర్‌కు మార్చారు. తన మరణ తిథికి ఒకరోజు ముందు తన ప్రియశిష్యుడైన వివేకానందుడిని పిలిచి.. తన ఆధ్యాత్మిక శక్తులన్నిటినీ ఆయనకు ధారపోసిన రామకృష్ణులు.. 1886 ఆగష్టు 16న మహాసమాధిని పొందాడు. ఆయన తర్వాత.. ఆయన సహధర్మచారిణి అయిన శారదా మాత, ఆయన శిష్యులైన స్వామి వివేకానంద రామకృష్ణుల ఆధ్యాత్మిక భావనలను ప్రపంచపు నలుమూలలకూ అందించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News