Big Stories

Healthy Heart : శరీర కదలికలతో గుండె పదిలం

Healthy Heart

Healthy Heart : ఏ రూపంలోనైనా సరే.. కొద్దిపాటి శారీరక శ్రమ కూడా గుండె ఆరోగ్యాన్ని పదిలపరుస్తుంది. కానీ అదే పనిగా ఒక చోటే కూలబడితే మాత్రం ముప్పు తప్పదు. అన్నింటి కన్నా సెడెంటరీ(కూర్చుని చేసే) పని అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

ఒకవేళ కూర్చునే సుదీర్ఘ సమయం పని చేయాల్సి వస్తే.. మధ్యమధ్యలో చిన్నపాటి ఎక్సర్‌సైజ్‌‌లు చేయాలని సూచిస్తున్నారు. దీని వల్ల కార్డియోవాస్క్యులర్ ప్రయోజనాలు ఎన్నో ఉంటాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ సహకారంతో జరిగిన ఆ అధ్యయనం ఫలితాలను యూరోపియన్ హార్ట్ జర్నల్‌ ప్రచురించింది.

- Advertisement -

మనం రోజు వారీ చేసే వివిధ శారీరక పనుల ప్రభావం గుండె ఆరోగ్యంపై ఎలా ఉంటుందన్నదీ ఆ అధ్యయనం విశ్లేషించింది. ఇందుకోసం 5 దేశాల నుంచి 15 వేల మందిని ఎంపిక చేశారు. వారికి యాక్టివిటీ-ట్రాకింగ్ పరికరాలను అమర్చారు. మోస్తరు స్థాయి నుంచి కఠిన శారీరక శ్రమ అవసరమైన వివిధ పనులను వారితో చేయించారు. అలా ప్రతి రోజూ 4 నుంచి 12 నిమిషాల పాటు శ్రమ చేయించడం ద్వారా కొలెస్టరాల్ స్థాయులు మెరుగైనట్టు గుర్తించారు.

నడుము నాజూకుగా మారడమే కాకుండా.. ఆరోగ్యవంతమైన బరువును కొనసాగించగలిగినట్టు తాజా పరిశోధన ద్వారా రుజువైంది. మన దైనందిన చర్యల్లో చిన్న చిన్న మార్పులే గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపించాయని పరిశోధకులు తెలిపారు. కొద్ది సమయం బ్రిస్క్ వాక్ చేయడం లేదంటే కొన్ని మెట్లు ఎక్కడం వల్ల గుండె వేగం పెరగడాన్ని రిసెర్చర్లు గమనించారు.

కూర్చునే సమయంలో ఆరు నిమిషాలు వ్యాయామానికి కేటాయించగలిగితే.. కొలెస్టరాల్ స్థాయులు మెరుగయ్యాయని అధ్యయనం వెల్లడించింది. అదే 30 నిమిషాల సిటింగ్ సమయాన్ని శారీరక వ్యాయామానికి కేటాయించగలిగితే.. బరువు గణనీయంగా తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. మోడరేట్ నుంచి కఠోర స్థాయిలో వ్యాయామం వల్ల చక్కటి ఫలితాలు కనిపించాయని పరిశోధకులు వివరించారు.

తేలికపాటి వ్యాయామం, స్టాండింగ్, స్లీపింగ్ వంటి చర్యలు ఆ తర్వాత స్థానాలను ఆక్రమించాయి. బల్ల ఎక్కడం, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అటూ ఇటూ తిరగడం వంటి చిన్న చిన్న మార్పులను అనుసరించినా.. ఆరోగ్యంలో బోలెడంత వ్యత్యాసం కనిపించడం విశేషం. రోజువారీ దినచర్యలో కొద్ది పాటి మార్పులు చేసుకోవడం ద్వారా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ముప్పు లేకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News