Big Stories

Supplements : సప్లిమెంట్లతో నిత్యయవ్వనం

Share this post with your friends

Supplements : వయసు మీద పడుతున్నా సరే.. నవయవ్వనంతో కనిపించాలని ఎవరికైనా ఉంటుంది. వృద్ధాప్యం సమీపిస్తున్న కొద్దీ మన శరీరం పోషకాలను శోషించుకోవడమనేది క్లిష్టతరమవుతుంది. సప్లిమెంట్ల ద్వారా దీనిని కొంత మేర భర్తీ చేసుకోవచ్చు. మెగ్నీషియం, విటమిన్-డీ వంటి సప్లిమెంట్ల వల్ల మన ఆరోగ్యం ఎంతో మెరుగు కావడం ఖాయం. ప్రస్తుతం గ్లోబల్ సప్లిమెంట్ మార్కెట్ విలువ 39 బిలియన్ డాలర్లు. అంటే సప్లిమెంట్ల వినియోగం బాగానే ఉన్నట్టు లెక్క.

సరైన రీతిలో తీసుకుంటేనే..

సప్లిమెంట్లు తీసుకుంటున్నాం కదా.. ఇక ఆరోగ్యానికి తిరుగులేదు అని అనుకోవద్దు. వాటిని సరైన రీతిలో వినియోగిస్తేనే ఫలితం ఉంటుంది. సప్లిమెంట్లతో ప్రయోజనాలు సిద్ధించడమనేది ఆయా వ్యక్తుల శరీర ధర్మం, అప్పటి కాలపరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ పోషకాలను తీసుకునే శక్తి సన్నగిల్లుతుంది. ఈ కారణంగా కొందరి విషయంలో మాత్రమే ఆయుష్షును సప్లిమెంట్లు పెంచగలుగుతాయి. వార్థక్యాన్ని వాయిదా వేసి.. ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంలో ఐదు సప్లిమెంట్లు కీలక పాత్ర వహిస్తాయని వైద్య, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

విటమిన్-డీ

ఎముకల సాంద్రతను పెంచడంలో విటమిన్-డీ అత్యంత కీలకమైనది. ఆహారం ద్వారా తీసుకునే కాల్షియం, ఫాస్ఫరస్‌ను శక్తిగా మార్చడానికి దోహదపడుతుంది. విటమిన్-డీ ఎక్కువగా సూర్యకాంతి నుంచే లభిస్తుంది. ఎండ పెద్దగా కనిపించని శీతాకాలంలో ఈ సప్లిమెంట్ తీసుకోవడం ఉత్తమం. దీంతో పాటు విటమిన్-డీ ఎక్కువగా లభ్యమయ్యే ఆహారాన్ని కూడా తీసుకోవాలి. సాల్మన్ చేపలు, ఫోర్టిఫైడ్ మిల్క్(పోషకాలు జతచేసిన పాలు), గుడ్డులోని పసుపు సొనలో ఇది పుష్కలంగా ఉంటుంది. ఆస్టియోపోరోసిస్‌తో బాధపడేవారికి ఈ సప్లిమెంట్ తప్పనిసరి.

ఫిష్ ఆయిల్

గుండెకు గట్టి రక్షణను కల్పిస్తుంది ఫిష్ ఆయిల్. కొలెస్టరాల్ స్థాయులను మెరుగుపరిచే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఈ చేపల్లో అధికంగా లభిస్తాయి. ఆర్థరైటిస్ వల్ల వచ్చే వాపు, నొప్పులను ఇది సమర్థంగా అడ్డుకోగలదు. వాల్‌నట్స్, సాల్మన్-ట్యూనా చేపలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ల స్థాయులను పెంచొచ్చు. నట్స్‌లో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ బీ6 వంటి పోషకాలు ఎక్కువగా ఉంటే.. సాల్మన్ చేపల వల్ల విటమిన్-డీ, బీ12 లెవల్స్‌ను పెంచుకోవచ్చు.

NAD+ బూస్టర్లు

శరీరంలో శక్తి జనించేందుకు నికొటినమైడ్ అడెనీన్ డైన్యుక్లొటైడ్(NAD+) అనే ఎంజైమ్ కీలకం. కణజాలం ఆరోగ్యాన్ని కాపాడటానికి, దెబ్బతిన్న డీఎన్ఏను మరమ్మతు చేయడానికి ఈ ఎంజైమ్ అవసరం. అలాగే జీవక్రియను, ఇమ్యూన్ వ్యవస్థ పనితీరును ఇది గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఈ ఎంజైమ్ మరింతగా ఉత్పత్తి కావడంలో నికొటినమైడ్ రైబోసైడ్(NR) తోడ్పడుతుంది.NAD+ ఎంజైమ్ తక్కువగా ఉన్నవారికి NR బూస్టర్‌లా పనిచేస్తుంది.

ఫైస్టిన్

స్ట్రాబెర్రీస్ చిక్కటి ఎరుపు సంతరించుకోవడానికి కారణం ఫెస్టిన్ అనే కెమికల్ కాంపౌండ్. స్ట్రాబెర్రీస్‌తో పాటు ఉల్లిపాయలు, యాపిల్స్‌లో ఈ పాలీఫినాల్ లభ్యమవుతుంది. ఫైస్టిన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా విషపూరిత, ముసలి కణాలను శరీరం నుంచి త్వరితంగా తొలగించవచ్చు. మనకు వయసుపై‌బడినా కనిపించనీయకుండా చేస్తుంది ఫైస్టిన్. ఆర్థరైటిస్, అల్జీమర్స్‌ లక్షణాలను తగ్గించి ఉపశమనాన్ని కలగజేస్తుంది.

మెగ్నీషియం

శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలగజేసే అద్భుత ఖనిజం మెగ్నీషియం. కండరాలు, నరాలు, ఎముకలు, కణజాల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇది ఎంతో ముఖ్యం. బ్లడ్ ప్రెషర్‌ను అదుపులో ఉంచుతుంది. అయితే సప్లిమెంట్‌లా కాకుండా ప్రతి రోజూ ఆహారంలో మెగ్నీషియం ఉండేలా చూసుకుంటే మేలు. ఆకుకూరలు, అరటిపళ్లు, అవకాడో, నట్స్, బీన్స్‌లో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. సమతులాహారం, సప్లిమెంట్లు తీసుకోవడమే కాదు.. రోజూ వ్యాయామం చేయడం ద్వారా ఉత్తేజంగా ఉండొచ్చు. వృద్ధాప్యం శరీరానికే కానీ మనసుకు కాదు. అందుకే ఎప్పుడు మానసికోల్లాసంతో ఉండండి.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News