Big Stories

Nagarjuna Sagar : నాగార్జున సాగర్ డ్యామ్ పై ఏపీ పోలీసుల హైడ్రామా.. పోలింగ్ రోజే ఎందుకు ?

Share this post with your friends

Nagarjuna Sagar

Nagarjuna Sagar : నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బుధవారం అర్థరాత్రి తర్వాత డ్యామ్ వద్ద ఏపీ పోలీసులు హంగామా చేశారు. అక్రమంగా డ్యామ్ మీదికి చొరబడి ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు మొత్తం 26 గేట్లు ఉండగా.. వాటిలో 13వ గేట్ వరకూ తమ పరిధిలోకి వస్తుందంటూ.. ఏపీ పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు సుమారు 500 మంది పోలీస్ సిబ్బందితో సాగర్ డ్యామ్ వద్దకు చేరుకున్నారు. వారిని అడ్డుకున్న ఎస్పీఎఫ్ సిబ్బందిపై దాడి చేసి మొబైల్ ఫోన్లను, డ్యామ్ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. 13వ గేట్ వద్దకు చేరుకుని ముళ్లకంచెను ఏర్పాటు చేసి.. డ్యామ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

దీనిపై సమాచారం అందుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి డ్యామ్ పైకి చేరుకుని ఏపీ పోలీసులతో మాట్లాడారు. డ్యామ్ నీటి నిర్వహణ విషయం నీటిపారుదల శాఖకు సంబంధించిందని, వెంటనే ముళ్లకంచెను తొలగించాలని ఏపీ పోలీసులకు సూచించారు. వారి నుంచి స్పందన లేకపోవడంతో ఆయన సిబ్బందితో వెనుదిరిగి వెళ్లిపోయారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. పోలింగ్ రోజే ఏపీ పోలీసులు డ్యామ్ వద్దకు ఎందుకు వెళ్లారని ప్రశ్నిస్తున్నారు. చూస్తుంటే ఇదంతా కేసీఆర్ సృష్టించిన డ్రామాలాగా కనిపిస్తోందని, ఓటమి భయంతోనే కేసీఆర్ ఇలా చేసి ఉంటారని నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి ఆరోపించారు. నిజంగానే నీటి హక్కుల కోసం వచ్చేవారైతే.. రేపు లేదా ఎల్లుండైనా రావొచ్చని, పనిగట్టుకుని పోలింగ్ కు కొన్నిగంటల ముందే రావలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News