Big Stories

Bhimili : దేశంలోనే రెండవ మున్సిపాలిటీ.. మన భీమిలి…!

Bheemili history

Bheemili history(AP news today telugu):

మనదేశంలోని తొలి పురపాలక సంఘం గుజరాత్‌లోని సూరత్‌ పట్టణం కాగా.. రెండవ పురపాలికగా అవతరించింది.. ఆంధ్రప్రదేశ్‌లోని భీమునిపట్నం. దీనినే నేడు మనం భీమిలి అని పిలుస్తున్నాము. హిందూ బౌద్ధ మతాలకు చెందిన అనేక ప్రాచీన కట్టడాలున్న భీమిలి.. బ్రిటిష్, డచ్ పాలనాకాలంలో గొప్ప వాణిజ్యకేంద్రంగా ఉండేది. తూర్పుకనుమల్లో ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రశాంతమైన సముద్రతీరాన, ఉక్కు నగరం విశాఖకు 24 కి.మీ దూరంలో ఉన్న భీమునిపట్నం విశేషాలు…

- Advertisement -

పురాణాల ప్రకారం.. కృతయుగంలో హిరణ్యకశిపుడిని సంహరించిన నారసింహుడు.. ప్రహ్లాదుని ప్రార్థన మేరకు తన ఉగ్రరూపాన్ని వదిలి ఇక్కడి సౌమ్యగిరిపై వెలిశాడనే పురాణ కథనం. ద్వాపర యుగంలో పాండవులు వనవాస సమయంలో ఏకచక్రపురంలో నివసిస్తుండగానే భీమసేనుడు.. బకాసురుడిని సంహరించాడు. ఆనాటి ఏకచక్రపురమే నేటి భీముని పట్నంగా మారిందనే కథనమూ ఉంది. క్రీస్తుశకం 1228 నాటి శాసనాల్లోనూ ఈ పట్టణపు ప్రస్తావన ఉంది.

- Advertisement -

బుద్ధుని అవశేషాలను 8 భాగాలుగా చేసి పలు ప్రాంతాల్లో భద్రపరచగా, అందులోని ఎనిమిదవ భాగం భీమిలి సమీపంలోని తిమ్మాపురం బావికొండ బౌద్ధకేత్రంలో లభ్యమైంది. కళింగ యుద్ధకాలంలో అశోకుడు ఈ ప్రాంతాన్ని సందర్శించాడంటారు. అలాగే.. శ్రీకృష్ణదేవరాయులు తన యుద్ధవిజయానికి గుర్తుగా భీమిలికి సమీపంలోని పద్మనాభం దగ్గరి పొట్నూరులో నెలకొల్పిన విజయస్థూపం నేటికీ ఉంది. ఇక.. విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు జన్మించిన పాండ్రంగి ప్రాంతాలు భీమిలికి దగ్గరలోనే ఉన్నాయి.

తూర్పు తీరంలోని ప్రసిద్ధ నౌకా కేంద్రమైన భీముని పట్నం ఆదినుంచి విదేశీ పాలకుల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే 17వ శతాబ్దంలో మనదేశానికి వచ్చిన డచ్ (నేటి.. నెదర్లాండ్స్) వారు.. 1641లో ఈ ప్రాంతానికి అధిపతిగా ఉన్న గోల్కొండ నవాబు.. కులీ కుతుబ్ షా అనుమతితో ఇక్కడ తమ వాణిజ్య స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. తర్వాత వారు ఇక్కడ ఒక కోటనూ నిర్మించి, తమ ఎగుమతులు, దిగుమతులన్నీ ఇక్కడి నుంచే చేయటం ఆరంభించటంతో భీమిలి వేగంగా అభివృద్ధి చెందటం మొదలుపెట్టింది.

1754లో జరిగిన మరాఠీల దాడి సమయంలో, 1781 నాటి ఫ్రాన్స్‌, బ్రిటన్‌ యుద్ధ కాలంలో డచ్‌కోట పాక్షికంగా ధ్వంసమైంది. 1825 నాటికి భీమిలి బ్రిటిషర్ల చేతికొచ్చింది. 1854లో లార్డ్ రిప్పన్.. ఇక్కడ సైనిక బలగాల కమాండ్‌ను ప్రారంభించాడు. తర్వాతి రోజుల్లో ఈస్టిం డియా కంపెనీకి సంబంధించిన పలు వ్యాపారాలు.. ఇక్కడే ప్రారంభమయ్యాయి. తర్వాత వారు చిట్టివలసలో స్థాపించిన బెల్లం కంపెని 1867లో జూట్‌ ఫ్యాక్టరీగా రూపాంతరం చెందింది. 1880లో ఇక్కడ పంచదార, నీలిమందు తయారీకై కర్మాగారాలు వచ్చాయి.

డచ్‌ వారు 1624లో తొలిసారి ఇక్కడికి వచ్చినప్పడు స్థానికులతో జరిగిన ఘర్షణలో.. 101 మంది డచ్‌ సైనికులు, 200 మంది స్థానికులు చనిపోయారని విశాఖ శాసనాల వల్ల తెలుస్తోంది. తర్వాత వారిద్దరికీ సయోధ్య కుదరగా, వారు 1661లో కోటను నిర్మించుకున్నారు. కాలక్రమంలో అది శిథిలమైనా, నాటి కోటలో ఉన్న గడియారపు స్థంభం, టంకశాల నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.

నాటి జిల్లా కలెక్టర్‌ రాబర్ట్‌ రీడ్‌ ఆధ్వర్యంలో జాన్‌ గ్రిఫిన్‌ 1855-64 మధ్యకాలంలో ఇక్కడ నిర్మించిన సెయింట్ పీటర్స్ చర్చి నేటికీ ఉంది. దీని నిర్మాణ శైలి, లోపలి వస్తువులు, తూర్పు కిటికీపై ఏసు శిలువ ఘట్టాన్ని చిత్రించిన శైలి, అక్కడి పాలరాతి శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటాయి.

నేడు చిట్టివలస జూట్‌ కర్మాగారం ఆధీనంలో ఉన్న గెస్ట్‌హౌస్ భవనాన్ని నాడు డచ్‌ వారు ఇంపీరియల్‌ బ్యాంక్‌ కోసం నిర్మించారు. తర్వాతి కాలంలో చిట్టివలస జూట్‌ మిల్లు యాజమాన్యం ఈ భవనాన్ని దత్తతకు తీసుకుని, వారసత్వ సంపదగా భావించి, కాపాడుతోంది. భీమిలి వైభవాన్ని చాటే వాటిలో ఈ భవనం నేటికీ ముందుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని తొలి మున్సిపాలిటీ అయిన భీమిలిలో నాడు నిర్మించిన సత్రం.. నేటికీ సేవలందిస్తోంది. రెండు రాళ్ళమీద మద్రాసు పెంకులతో కట్టిన ఈ కట్టడం నేటికీ ఎంతో పటిష్టంగా ఉంది. ఈ కట్టడంలో మున్సిపల్ ఆఫీసు, నౌకాశ్రయ రవాణా కార్యాలయం ఉన్నాయి. ఈ రెండు నిర్మాణాలు.. నౌకాకేంద్రంగా భీమిలికి ఉన్న ఘన చరిత్రను చాటుతున్నాయి.

18వ శతాబ్దంలో కాకినాడ – శ్రీకాకుళం మధ్య గల 8 ద్వీప స్తంభాల్లో (లైట్‌ హౌజ్‌లలో) ఒకటి భీమిలిలో ఉంది. నేటికీ భీమిలి వాసులకు సమయాన్ని తెలియజేస్తున్న గంటస్తంభం.. ఆంగ్లేయుల హయాంలో నిర్మితమైంది. పట్టణానికి పశ్చిమంగా నిర్మించిన శ్మశానవాటికలో నాటి డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ పాలకుల సమాధులున్నాయి. బీచ్‌రోడ్డులో ఎర్ర మట్టి దిబ్బలు, బౌద్ధ విశేషాలను చాటిచెప్పే తొట్లకొండ, బావికొండ, పావురాల కొండ నాటి చరిత్రకు ప్రధాన ఆనవాళ్లుగా కనిపిస్తాయి.

ఈ పట్టణంలో ఉన్న ప్రాచీన దేవాలయం భీమేశ్వరాలయం. ప్రధాన రహదారిపై ఉన్న ఈ ప్రాచీన ఆలయ నిర్మాణం.. 1170 శాలివాహన శకంలో జరిగింది. అనంతర కాలంలో చోళరాజులు దీనికి అనుబంధంగా చోళేశ్వరాలయాన్ని నిర్మించారు. 24 కి.మీ పొడవైన బీచ్ ఉన్న భీమిలికి విశాఖపట్టణం నుంచి మంచి రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News