Big Stories

Guntupalli Caves : గౌతముడి ఘనతకు గుర్తు.. గుంటుపల్లి

Guntupalli Caves

Guntupalli Caves : బుద్ధుని పాదముద్రలతో పవిత్రమైన తెలుగునేలపై నేటికీ అడుగడుగునా ఆయన ప్రభావం, ఆయన కాలపు అవశేషాలు కనిపిస్తాయి. అలాంటి ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రాలలో పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట మండలంలోని గుంటుపల్లి ఒకటి. బౌద్ధపు ఆరంభపు కాలంలో గొప్ప వైభావాన్ని చూసిన ప్రాచీన బౌద్ధక్షేత్రాలలో ఒకటైన గుంటుపల్లి విశేషాలేమిటో మనమూ తెలుసుకుందాం.

- Advertisement -

క్రీ. పూ 3వ శతాబ్దం నాటికే బౌద్ధమతానికి చెందిన జీవన విధానాన్ని గుంటుపల్లి ప్రాంతం అలవరచుకుంది. గతంలో గుంటుపల్లిని కేవలం బౌద్ధక్షేత్రంగానే భావించారు. కానీ గతంలో ఇక్కడ లభించిన మహామేఘవాహన సిరిసదా శాసనం, ఖారవేలుని శాసనాల వల్ల ఇక్కడ జైనమతం కూడా విలసిల్లిందని రుజువైంది.

- Advertisement -

గుంటుపల్లి కొండలపైన ఉన్న బౌద్ధారామాలకు ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడి చైత్యగృహము, ఆరామ మంటపాలు, స్తూపాలు పరిరక్షించదగినవని భారత పురావస్తు శాఖ ప్రకటించింది. ఇక్కడి ఒక స్తూపంలో లభించిన ధాతువులను బట్టి గట్టి గతంలో ఇది గొప్ప బౌద్ధకేంద్రంగా విలసిల్లిందని చెబుతారు. ఇక్కడి కొండలో తొలిచిన గుహాలయం, బౌద్ధారామాలు, ప్రార్ధనా స్తూపాలు, రాతి స్తూపాలు క్రీ.పూ 300 నుండి క్రీశ 300 మధ్యకాలం నాటివని పురావస్తు శాఖ భావిస్తోంది.

ఇక్కడి బుద్ధుని ప్రతిమల్లో సాధారణ వస్త్రాలే తప్ప ఎక్కడా అలంకరణలు కనిపించకపోవటాన్ని బట్టి.. ఇది బౌద్ధధర్మపు ఆరంభకాలమైన హీనయాన బౌద్ధకాలపు నాటివని తెలుస్తోంది. ఖరీదైన నగలు, వస్త్రాలు, సంపద, కళలు, కావ్యాలు.. మనసును చలింపజేస్తాయని బుద్ధుడు అప్పట్లో వాటిని నిషేధించాడు.

క్రీ.పూ 3 – 2వ శతాబ్దానికి చెందిన ఇక్కడి గుహాలయం గుండ్రంగా ఉంటుంది. దీనినే ప్రస్తుతం ధర్మ లింగేశ్వర శివలింగంగా భావిస్తున్నారు. ఇక.. ఇక్కడి పెద్ద బౌద్ధ విహారం, ఇసుకరాతి కొండ అంచున తొలచిన గుహల సముదాయం, నాటి బౌద్ధ భిక్షువులుకు ప్రధాన కేంద్రాలుగా ఉండేవి. ఈ గుహలు ఒకదానికొకటి గుండ్రని కిటికీలతో కలుపబడి ఉన్నాయి. గుహల్లోకి ఊరే నీరు, వర్షపు నీరు కాలువల ద్వారా పగులులోకి ప్రవహిస్తుంది. కొండపై ఇటుకలు, రాళ్లపై గుండ్రంగా నిర్మించిన సుమారు 60 మొక్కుబడి స్తూపాలున్నాయి.

ఇక.. క్రీ.పూ 2వ శతాబ్దకాలం నాటి ఇక్కడి స్తూపం పైభాగం అంతా రాతి ఫలకాలతో కప్పబడి ఉంది. ఇదిగాక.. 4 విరిగిన స్తంభాలతో కనిపించే శిధిల మంటపం ఒకటి ఉంది. ఇది గతంలో భిక్షువుల సమావేశ మందిరంగా ఉండేదట. ఇక్కడ దొరికిన శిలా స్తంభ శాసనంలో క్రీ.పూ 1 – క్రీ.శ 5వ శతాబ్దానికి మధ్య ఈ స్తూపానికి లభించిన దానముల వివరాలున్నాయి.

కొండ తూర్పు చివరన ఎత్తైన సమతల ప్రదేశంలో నిర్మించిన ఇటుకల స్తూప చైత్యం క్రీ.పూ 3 – 2వ శతాబ్దం నాటిది. దీనిని చేరుకొనే మెట్ల వరుసను క్రీ.పూ 2 – 1వ శతాబ్దానికి చెందిన ఒక ఉపాసిక కట్టించాడని చరిత్రకారుల అభిప్రాయం.

ఇక.. డిసెంబర్‌ 4, 2007లో ఇక్కడ క్రీస్తు శకారంభ కాలంనాటి బ్రహ్మలిపి శాసనం దొరికింది. నేటి తెలుగు భాష పూర్వరూపాలన్నీ ఈ చలువరాతి ఫలకంపై ఉన్నాయి. ప్రసిద్ద బౌద్దాచార్యుడైన మిడిలకుడు అనే బౌద్ద సన్యాసి ఈ ఫలకాన్ని గుంటుపల్లి బౌద్ద బిక్షువులకు దానం చేసినట్లు పాకృత భాషలోని ఫలకం చెబుతోంది. తర్వాతి రోజుల్లో గుంటుపల్లికి సమీపంలోని జీలకర్రగూడెం, కంఠమనేనివారి గూడెం గ్రామాలలో కూడా కొన్ని బౌద్ధారామాలను కనుగొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News