Hepatitis ‘A’ Cases Increasing in Kerala: కేరళను హెపటైటిస్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. హెపటైటిస్-ఏ కేసులు పెరుగుతుండటంతో వాటిని ఎదుర్కొనేందుకు కిందిస్థాయి కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మలప్పురం, ఎర్నాకులం, కోజికోడ్, త్రిసూర్ జిల్లాల్లో హెపటైటిస్ -ఏ కేసులు విపరీతంగా పెరిగాయి. మలప్పురంలోని చలియార్, పోతుకల్లు ప్రాంతాల్లో హెపటైటిస్ మరణాలు కూడా నమోదయ్యాయి. మొదటి నాలుగున్నర నెలలలో 1977 కేసులు నమోదవ్వగా 12 మంది మృతి చెందారు.
ఆయా ప్రాంతాల్లో హెపటైటిస్ నివారణ, అవగాహన చర్యల్ని అంచనా వేసి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. పోతుకల్లులో జాండీస్ అదుపులో ఉన్నప్పటికీ.. కొత్త కేసులు నమోదవ్వడంతో జిల్లా వైద్య యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులతో సమావేశమై నివారణ చర్యలు చేపట్టారు. తాగునీటి వనరులను క్లోరినేషన్ చేయాలని ఆదేశించారు. అలాగే హోటల్స్, రెస్టారెంట్లు కూడా కస్టమర్లకు వేడిచేసిన నీటినే సర్వ్ చేయాలని ఆదేశించింది ప్రభుత్వం.
హెపటైటిస్ A వైరస్ కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. కలుషితమైన ఆహారం, నీటి ద్వారా లేదా అంటువ్యాధి ఉన్న వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం ద్వారా ఇది వ్యాపిస్తుంది. హెచ్ఐవీ, కాలేయ వ్యాధితో ఉన్నవారు త్వరగా హెపటైటిస్ బారిన పడే ఛాన్సులున్నాయి. అలసట, కడుుపునొప్పి, జ్వరం, విరేచనాలు, వాంతులు, ఆకలి లేకపోవడం, దురద, కామెర్లు, చర్మం, గోర్లు, కళ్లు, మూత్రం పసుపు రంగులో ఉండటం ఈ వ్యాధి లక్షణాలు.
Also Read: ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ను ఉపసంహరించుకున్న ఆస్ట్రాజెనెకా
కాచి చల్లార్చిన నీరు తాగడం, బహిరంగ మలవిసర్జనకు దూరంగా ఉండటం, తినేముందు చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా హెపటైటిస్ ఏ బారిన పడకుండా ఉంటారు.